Published On: Mon, Aug 19th, 2019

చరిత్రను మార్చే దిశగా అడుగులు వేస్తున్నాం..

* డల్లాస్‌లోని ప్రవాసాంధ్రులతో ఏపీ సీఎం జగన్‌

సెల్ఐటి న్యూస్, డల్లాస్‌: అమెరికా పర్యటనలో భాగంగా డల్లాస్‌లోని హచిన్‌సన్‌ కన్వెన్షన్‌లో ప్రవాసాంధ్రులతో ఏపీ సీఎం జగన్‌ మోహన్ రెడ్డి శనివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వైఎస్‌ఆర్‌ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం జగన్‌ ప్రవాసాంధ్రులను ఉద్దేశించి మాట్లాడారు. వైకాపా విజయంలో ప్రవాసాంధ్రుల పాత్ర ఎంతో ఉందన్నారు. ‘‘ఐ హ్యావ్‌ ఏ డ్రీమ్‌ అన్న మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ జూనియర్‌ స్ఫూర్తిదాయకం. అవినీతి, లంచగొండితనం లేని రాష్ట్రాన్ని చూడాలని నా కల. అన్నం పెడుతున్న రైతు ఆకలిబాధతో మరణించకూడదన్నది నా కల. ఏ ప్రభుత్వ పథకమైనా లంచం, వివక్ష లేకుండా పేదవాడికి అందుబాటులోకి రావాలన్నది నా కల. రాష్ట్రంలో ప్రతి ఎకరానికి కాల్వల ద్వారా నీరు అందించాలన్నది నా కల. పాలకులు మనసు పెడితే చేయలేనిది ఏదీ లేదు.  రెండున్నర నెలల పరిపాలనలోనే చరిత్రను మార్చే దిశగా అడుగులు వేస్తున్నాం. అమ్మ ఒడి, రైతు భరోసా, ఆరోగ్యశ్రీ, పేదలకు ఇళ్ల పట్టాలు వంటి కార్యక్రమాలు చేపట్టాం. గాంధీ జయంతి నాటికి గ్రామ సచివాలయాలను కూడా ఏర్పాటు చేస్తాం. విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌, మద్యం బెల్టు దుకాణాల మూసివేత చేపట్టాం. మహిళలకు నామినేటెడ్‌ పదవుల్లో 50శాతం రిజర్వేషన్‌ కల్పించాం. 75శాతం ఉద్యోగాలు స్థానికులకు ఇచ్చేలా చట్టం చేశాం’’.
‘‘అవినీతికి ఆస్కారం లేకుండా టెండర్ల విషయంలో న్యాయ సమీక్ష చేపట్టాలని నిర్ణయించాం. దేశంలో కనీవినీ ఎరుగని విధంగా రివర్స్‌ టెండరింగ్‌ విధానం తీసుకొస్తున్నాం. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం తప్పనిసరి చేస్తున్నాం. పాఠశాలలు, ఆసుపత్రుల ప్రస్తుత ఫొటోలు చూపిస్తున్నాం. తర్వాత నాడు, నేడు అంటూ అభివృద్ధి చేసిన పాఠశాలలు, ఆసుపత్రుల ఫొటోలు చూపిస్తాం.  గత ప్రభుత్వం అవకాశం ఉన్నా తక్కువ ధరకు విద్యుత్‌ కొనుగోలు చేయలేదు. 13 నెలలుగా డిస్కమ్‌లకు బిల్లులు కూడా చెల్లించలేదు. దాదాపు రూ.20వేల కోట్లు డిస్కమ్‌లకు బకాయిలు పడింది. రాష్ట్రంలో పోర్టులు, విమానాశ్రయాలు, రైలు మార్గాలు ఉన్నాయి. పల్లెలు, పట్టణాల మధ్య అంతరాలను చెరిపేసే చర్యలు చేపట్టాం. కనీసం ఏడాదికి ఒకటి.. రెండు సార్లయినా ప్రవాసాంధ్రులను ఏపీకి రావాలని ఆహ్వానిస్తున్నా. ప్రభుత్వం, ప్రవాసాంధ్రులు కలిసి గ్రామాలను బాగుచేసుకుందాం. ప్రభుత్వం వెబ్‌సైట్‌లో ఒక పోర్టల్‌  తెరవబోతున్నాం. పోర్టల్‌ నేరుగా సీఎం కార్యాలయానికి అనుసంధానమై ఉంటుంది. మీరు పెట్టుబడులు పెట్టాలనుకుంటే పోర్టల్‌లో చెప్పొచ్చు. పోర్టల్‌ పర్యవేక్షణకు ఒక అధికారిని నియమిస్తాం’’ అని జగన్‌ తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రవాసాంధ్రులు భారీగా తరలివచ్చారు.
 

Just In...