Published On: Wed, Jun 13th, 2018

చీకటిలో వెలుతురు లోకాన్ని సృష్టించిన ‘రాత్రి సూర్యుడు’

* గ్రంథావిష్క‌ర‌ణ స‌భ‌లో ఏపీ శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ క‌ల్చ‌ర‌ల్‌: కంటి కొలనులో చూపులు ఇంకిపోయి శాపంలా మారిన జీవితంలో గుండెను తట్టి, చీకటి కన్నీళ్లను.. కలల అలలను సమగ్ర దీర్ఘకావ్యంగా వెలువరించిన కెరె జగదీష్‌ అభినందనీయుడని ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌ అన్నారు. మంగళవారం సాయంత్రం మొగ‌ల్రాజ‌పురంలోని కల్చరల్‌ సెంటర్‌ ఆఫ్‌ విజయవాడ, అమరావతిలో కెరె జగదీష్‌ రాసిన ‘రాత్రి సూర్యుడు’ కవితా సంపుటిని ‘ది సన్‌ ఇన్‌ది డార్క్‌’ పేరిట డాక్టర్‌ పి.రమేష్‌ నారాయణ ఆంగ్లంలోకి అనువ‌దించిన గ్రంథాన్ని మండ‌లి బుద్ధప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కావ్యం చీకటిలో వెలుతురు లోకాన్ని సృష్టించిందని పేర్కొన్నారు. రాష్ట్ర సృజనాత్మకత, సాంస్కృతిక సమితి సీఈవో డి.విజయ్‌భాస్కర్‌ మాట్లాడుతూ ఈ కావ్యాన్ని రచయిత కొంత కాలంగా అంధత్వాన్ని అనుభవించి రాసి పుంభావ గాంధారి అయ్యారని పేర్కొన్నారు. అంధత్వం కేవలం ఒక అసౌకర్యమే తప్ప జీవితంలో అడ్డంకి కాదన్నారు. నిలువెల్లా ఆవరించిన శూన్యంలో అనంత దృశ్యాలను ఆవిష్కరించిన ఘనత కెరె జగదీష్‌కు దక్కుతుందని జిల్లా రచయితల సంఘం కార్యదర్శి జి.వి.పూర్ణచందు అన్నారు. పుస్తకాన్ని బాలాంత్రపు ప్రసూన, డాక్టర్‌ సశ్రీ సమీక్షించారు. కార్య‌క్ర‌మంలో రచయిత జగదీష్‌, అనువాదకుడు డాక్టర్‌ రమేష్‌, ఆచార్య మన్నవ సత్యనారాయణ, మంజులూరి కృష్టకుమారి, డాక్టర్‌ గుమ్మా సాంబశివరావు, డాక్టర్‌ ఈమని శివనాగిరెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Just In...