Published On: Wed, Mar 6th, 2019

చేతివృత్తిదారులకు చేయూతనిద్దాం..

* క్రాఫ్ట్ ఇండియా షాపింగ్ ఎక్స్‌పో ప్రారంభోత్సవంలో జిల్లా కలెక్టర్ ఎ.ఎండి.ఇంతియాజ్

సెల్ఐటి న్యూస్‌, విజయవాడ:  దైనందిన జీవితంలో ప్ర‌జ‌ల అవ‌స‌రాల‌కు అనుగుణంగా వివిధ కళాత్మక వస్తువులను రూపొందించి జీవనం సాగించే చేతివృత్తిదారులను ప్రోత్సహించాల్సిన అవసరం అందరిపైనా ఉందని కృష్ణా జిల్లా కలెక్టర్ ఎ.ఎండి.ఇంతియాజ్ అన్నారు. జీవ‌న్ జ్యోతి రూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ సొసైటి ఆధ్వ‌ర్యంలో నగరంలోని స్వరాజ్య మైదానంలో ఏర్పాటు చేసిన క్రాఫ్ట్ ఇండియా షాపింగ్ ఎక్స్‌పోను మంగళవారం రాత్రి కలెక్టర్ ఇంతియాజ్ ముఖ్య అతిథిగా హాజ‌రై రిబ్బ‌న్ క‌త్తిరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ ఎక్స్‌పోలో 15 రాష్ట్రాల నుండి వచ్చిన చేతివృత్తిదారులు తాము స్వ‌యంగా తయారుచేసిన కళాత్మక వస్తువులను విశేషంగా ఆక‌ట్టుకుంటున్నాయ‌ని, ప్ర‌ద‌ర్శ‌న‌లో భాగంగా ఏర్పాటు చేసిన 150 స్టాల్స్‌లో వీరంతా విక్రయాలు సాగిస్తారని తెలిపారు. ఈ వేసవిలో ఎండ వేడిమిని తట్టుకునేందుకు వీలుగా చేతివృత్తిదారులు రూపొందించిన పొందూరు ఖద్దరు, బెంగాల్‌ కాటన్, మంగళగిరి ఖ‌ద్ద‌రు తదితర నూలు వస్త్రాలతో పాటు అన్ని రకాల పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు, చెప్పులు, హోఆండెకార్స్‌, పిల్ల‌ల ఆట‌బొమ్మ‌లు, పింగాణి వ‌స్తువులు తదితర ఉత్ప‌త్తుల‌తో ఈ నెల 13వ తేదీ వ‌ర‌కు ప్రదర్శన, విక్ర‌యాలు కొన‌సాగుతాయ‌న్నారు. నగర‌వాసులు ఈ ప్రదర్శనను తిలకించి ఆయా ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా చేతివృత్తిదారులకు ప్రోత్సాహం అందించాలని కోరారు.  అనంతరం స్టాల్స్‌లో ఏర్పాటు చేసిన ఉత్పత్తులను కలెక్టర్ ఇంతియాజ్ ఆసక్తిగా తిలకించారు. కార్యక్రమంలో ఎక్స్‌పో నిర్వాహకులు రాజేందర్ జోషి, అతిన్ జ‌స్వాల్‌, డీపీఆర్వో భాస్క‌ర్ నారాయ‌ణ‌, గ‌రిమెళ్ల నానయ్య‌చౌద‌రి (నాని), గ‌రిమెళ్ల జాన‌కిరామ‌య్య, స్టాల్స్ నిర్వాహ‌కులు త‌దిత‌రులు పాల్గొన్నారు.
 

Just In...