Published On: Thu, Oct 31st, 2019

చేనేత కార్మికుల‌కు ప్ర‌భుత్వం ప్రోత్సాహం..

* వ‌స్త్ర ప్ర‌ద‌ర్శ‌న ఎక్స్‌పో ప్రారంభోత్స‌వంలో మంత్రులు ముత్తంశెట్టి, వెలంప‌ల్లి

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ‌: చేనేత కార్మికులను ప్రోత్సహించే దిశలో రాష్ట్ర సంస్కృతిని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం విజ‌య‌వాడ‌లోని స్థానిక కృష్ణా రైస్ మరియు ఆయిల్ మిల్లర్స్ అసోసియేషన్ హాలులో చేనేత వస్త్ర ప్రదర్శన ఎక్స్‌పోను  మంత్రులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, వెలంపల్లి శ్రీనివాసరావు, శాసనసభ్యులు మల్లాది విష్ణువర్ధనరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస‌రావు మాట్లాడుతూ హస్తకళల యొక్క ప్రాముఖ్యాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు హస్తకళలను ప్రోత్సహించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ఆయా ఉత్పత్తుల ప్రాచుర్యానికి ప్రదర్శనలు మేళాలు నిర్వహించి వాటిని నేరుగా ప్రజల్లోకి తీసుకు వెళుతున్నామన్నారు. ఈ ప్రదర్శన బుధ‌వారం నుండి నవంబరు 12వ తేదీ వరకూ నిర్వహిస్తున్నామన్నారు. కనుమరుగ‌వుతున్న కళలను ప్రోత్సహించేందుకు శిల్పారామాల్లో ప్రదర్శించి వాటికి తగిన ఆదరణ, ప్రోత్సాహాన్ని కల్పిస్తున్నామన్నారు. దళారుల ప్రమేయం లేకుండా ఉత్పత్తిదారుల నుండి నేరుగా వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులను అందించే దిశలో ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటామన్నారు. మన సంస్కృతి సంప్రదాయాలను, కళలను భావితరాలకు అందించే దిశలో వెలుగులోకి తీసుకురావడానికి ఎన్నో కార్యక్రమాలను చేపట్టడం జరుగుతోందన్నారు. ఆదిశలోనే శిల్పారామాలను ఏర్పాటు చేయడం జరుగుతోందని విశాఖపట్నం, తిరుపతి, కడప, పులివెందుల, అనంతపురం, పుట్టపర్తి, విజయనగరం, కాకినాడ, మంగళగిరి ప్రాంతాలలో ఏర్పాటు చేస్తున్నామన్నారు. మారుతున్న ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఉత్పత్తులను ప్రోత్సహించడంలో తగిన ప్రణాళికలను రూపొందిస్తున్నామని, వీటిలో చేనేత కార్మకులను భాగస్వాములను చేస్తున్నామన్నారు. మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ 34 స్టాల్స్ ద్వారా రాష్ట్రంలోని ప్రముఖ చేనేత ఉత్పత్తులను ప్రదర్శించడం జరుగుతోందన్నారు. రాష్ట్రంలోని ప్రసిద్ధి చెందిన చేనేత ఉత్పత్తులు ఒకే చోట లభ్యమవుతున్నాయని ప్రజలు, మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. శాసనసభ్యులు మల్లాది విష్ణు మాట్లాడుతూ శిల్పారామాల అభివృద్ధి కై మెరుగైన సూచనలు, సలహాలను పాటించేందుకు వాస్తు శిల్పులు, పేరుగాంచిన సంస్థలు, సలహాదారుల సహకారంతో ప్రస్తుతం నిర్వహిస్తున్న శిల్పారామాలను మరింత అభివృద్ధి పరిచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల నుండి వస్తున్న చేనేత కార్మికుల ఉత్పత్తులను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

Just In...