Published On: Thu, Aug 24th, 2017

చ‌లామణీలోకి రూ.200 నోటు..

సెల్ఐటి న్యూస్‌, జ‌న‌ర‌ల్ డెస్క్‌: కొత్తగా ముద్రించిన రూ.200 నోటు ఈ నెల 25వ తేదీ (శుక్ర‌వారం) నుంచి చ‌లామణీలోకి రానున్నట్లు రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా గురువారం విడుద‌ల చేసిన ప్ర‌కటనలో తెలిపింది. నవంబరు 8న‌ పెద్ద నోట్ల రద్దు తర్వాత విడుదల కానున్న మూడో నోటు ఇది. కొత్తగా విడుదల కానున్న ఈ నోటు పసుపు రంగులో ఉంది. నోటు వెనుక భాగాన భారతదేశ సంప్రదాయ వారసత్వాన్ని ప్రతిబింబించే విధంగా సాంచీ స్తూపం బొమ్మను ముద్రించారు. ఈ నోటు ఎంపిక చేసిన కొన్ని బ్యాంకులు, ఆర్బీఐ కార్యాల‌యాల్లో శుక్ర‌వారం నుంచి అందుబాటులోకి రానుంది. పెద్ద నోట్ల అక్రమ నిల్వలు, వాణిజ్యానికి కళ్లెం వేయడమే లక్ష్యంగా రూ.200 నోట్లను తెరపైకి తీసుకొస్తున్నారు. రూ.100, రూ.500 మధ్య మరో కరెన్సీ నోటు ఇప్పటి వరకూ లేదు. దీంతో రూ.200 నోటు మంచి ఆదరణ పొందుతుందని ఆర్బీఐ అంచనా వేస్తోంది. పెద్ద నోట్ల తర్వాత ఎదురవుతున్న చిల్లర సమస్యలను కూడా రూ.200 నోటు కారణంగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. అక్రమ నగదు చెలామణీతో పాటు నకిలీ కరెన్సీ నోట్లకు అడ్డుకట్ట వేసేందుకు రూ.200 నోటును ముద్రిస్తున్నట్లు గతంలోనే ఆర్బీఐ ప్రకటించింది.

200_note

Just In...