Published On: Fri, Jan 24th, 2020

ఛైర్మన్‌ షరీఫ్‌ను కొట్టబోయారు…

* నిరసన తెలిపే హక్కు మాకు లేదా?

* నీతి, నిజాయతీ కోసం ఛైర్మన్‌ నిలబడ్డారు

* ఛైర్మన్‌ షరీఫ్‌ను కొట్టబోయారు

* మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు

అమరావతి, సెల్ఐటి న్యూస్‌: శాసన మండలి ఛైర్మన్‌ షరీఫ్‌, తెదేపా ఎమ్మెల్సీలు రాష్ట్ర భవిష్యత్తు కోసం నిలబడ్డారని ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ ఉపసంహరణ బిల్లులను మండలి ఛైర్మన్‌ సెలెక్ట్‌ కమిటీకి పంపడం.. మండలి రద్దు దిశగా ప్రభుత్వ నిర్ణయం తీసుకోనుందనే వార్తల నేపథ్యంలో మీడియాతో ఆయన మాట్లాడారు. తాజాగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో అధికార పార్టీ వ్యవహరిస్తున్న తీరుపై ఆరోపణలు చేశారు. మండలిలో బిల్లులు ఆమోదం పొందేందుకు అధికార పార్టీ తమ సభ్యులను ప్రలోభాలతో పాటు బెదిరింపులకు గురిచేసిందని..అయినా తమ సభ్యులు లొంగలేదన్నారు. ఎన్ని సమస్యలు వచ్చినా వీరోచితంగా పోరాడుతామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ సంద‌ర్భంగా మండలిలో జరిగిన పరిణామాలపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి పంపారనే అక్కసుతో ఛైర్మన్‌ షరీఫ్‌ను వైకాపా సభ్యులు కొట్టబోయారని ఆరోపించారు. నీతి, నిజాయతీ కోసం ఛైర్మన్‌ నిలబడ్డారని కొనియాడారు. మండలి వ్యవహారాలను మంత్రులు, ఇతర నేతలు ఎలా నియంత్రిస్తారని చంద్రబాబు ప్రశ్నించారు. శాసనసభ, మండలి స్వయం ప్రతిపత్తి సంస్థలని.. మండలిపై సీఎం జగన్‌ చేసిన వ్యాఖ్యలు దారుణమని ఆక్షేపించారు. దారికి రాకుంటే మండలిని రద్దు చేస్తామని బెదిరిస్తున్నారని.. ఆ బెదిరింపులు చెల్లవని వ్యాఖ్యానించారు. మండలి రద్దు చేసే అధికారం సీఎంకు లేదని.. అది కేంద్రానికి మాత్రమే ఉందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రం మండలిని రద్దు చేయడం కష్టమని చెప్పారు. బిల్లులు ఆమోదం పొందలేదనే వైకాపా నేతలకు ఉక్రోషం వచ్చిందన్నారు. ఒకవేళ మండలిని రద్దు చేస్తే తెదేపా అధికారంలోకి వస్తే మళ్లీ దాన్ని పునరుద్ధరిస్తామని చెప్పారు.

ఛైర్మన్‌ షరీఫ్‌ను కొట్టబోయారు…
‘‘శాసనసభలోనూ తమపై ఇష్టానుసారంగా వ్యవహరించార‌ని చంద్ర‌బాబు ఆరోపించారు. త‌న‌ను బండబూతులు తిట్టార‌ని పేర్కొన్నారు. అతిముఖ్యమైన బిల్లులపై చర్చ జరగాలని కోరాం. మాకు 2 గంటల సమయం కావాలని చెప్పాం. బిల్లు ఎప్పుడొచ్చినా సభలో చర్చించడం ఆనవాయితీ. బిల్లులు ఎలా ఉన్నాయో పరిశీలించి చర్చించడం ప్రతిపక్షం పని. ఇలాంటి ముఖ్యమైన బిల్లులపై లాభనష్టాలు చెప్పడం మా బాధ్యత. మాపై 70 మంది వైకాపా సభ్యులు దాడికి యత్నించారు. మా ఎమ్మెల్యేల పట్ల సభాపతి వైఖరి సరిగా లేదు. అభివృద్ధిని కోరుకునే వారు మూడు రాజధానులకు మద్దతివ్వరు. ప్రపంచంలో ఎక్కడా మూడు రాజధానులు లేవు. ఈ అంశంపై ప్రజాభిప్రాయం తీసుకోవాలని కోరాం. కొన్ని ఛానళ్లకు శాసనసభ ప్రసారాలు ఇవ్వడం లేదు. అసెంబ్లీలో మేం కూర్చున్న గదుల్లో ప్రత్యక్ష ప్రసారాలను కూడా నిలిపివేశారు. సభలో ఏం జరుగుతుందో బయటకు తెలియకుండా చేస్తున్నారు. మయసభను మరిపించేలా సీఎం జగన్‌ వ్యవహరిస్తున్నారు. రాజధాని అనే పదం లేకుండా మూడు రాజధానుల ప్రస్తావన ఎలా తెచ్చారు? మందడం ఘటనలో మీడియా ప్రతినిధులపై కేసులు పెడతారా?మీరు చెప్పింది కాదన్నారనే ఉద్దేశంతో మండలిని రద్దు చేస్తారా? విశాఖలో వచ్చిన హుద్‌హుద్‌ తుపానుకు.. రాజధానికి పోలికెలా తెస్తారు? సభలో నిరసన తెలిపే హక్కు మాకు లేదా? ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా’’ అని దుయ్యబట్టారు.

వైఎస్‌ హయాంలోనూ ఇంత అరాచక పాలన లేదు…
‘‘నా జీవితంలో ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశాను. కానీ ఇంత ఏకపక్షంగా వ్యవహరించిన వారిని ఎప్పుడూ చూడలేదు. ఎంతో మంది ఉద్ధండులతో పనిచేశాం. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలోనూ ఇంత అరాచక పాలన లేదు. సభలో నేను లేస్తే గౌరవిస్తూ రాజశేఖర్‌రెడ్డి కూర్చొనేవారు. రాజశేఖర్‌రెడ్డి లేస్తే నేను అంతే గౌరవం ఇచ్చేవాడ్ని. అది సభా సంప్రదాయం.. గౌరవం. ఇప్పుడు దాన్ని కించపరిచే విధంగా వ్యవహరిస్తున్నారు. గ్యాలరీల్లో ఉన్న విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి తదితరులు సభ వాయిదా పడగానే ఛైర్మన్ గదిలోకి వెళ్లారు. మండలిలో బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత 22 మంది మంత్రులు మండలి ఛైర్మన్‌పై ఒత్తిడి తీసుకొచ్చారు. ఆయనను గుక్క తిప్పుకోకుండా చేశారు’’ అని చంద్రబాబు ఆరోపించారు.

Just In...