జగజ్జేత ఇంగ్లాండ్..
* తొలిసారి ప్రపంచ కప్ కైవసం చేసుకున్న వైనం..
సెల్ఐటి న్యూస్, జనరల్ డెస్క్: నరాలు తెగే ఉత్కంఠ. బంతి బంతికి ఎక్కడ లేని ఉద్వేగం. నెల రోజులకు పైగా సాగిన మహా సంగ్రామం ఆఖరి రోజైన ఆదివారం మాత్రం మామూలు ఆనందం పంచలేదు. సగటు క్రికెట్ అభిమాని గుండెల్లో నిలిచిపోయేలా సాగింది ఈ మ్యాచ్. ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లాండ్ కూడా 50 ఓవర్లలో 241 పరుగులకే ఆలౌటైంది. స్టోక్స్(84నాటౌట్; 98బంతుల్లో 5×4, 2×6) గొప్ప పోరాటం చేశాడు.దీంతో మ్యాచ్ టై కావడంతో సూపర్ ఓవర్‌కు దారితీసింది. సూపర్ ఓవర్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 6 బంతుల్లో 15 పరుగులు చేసింది. ఛేదనకు దిగిన న్యూజిలాండ్ కూడా 6 బంతుల్లో 15 పరుగులు చేసింది. దీంతో సూపర్ ఓవర్ కూడా టైగా ముగిసింది. దీంతో ఐసీసీ నిబంధనల ప్రకారం మ్యాచ్‌లో ఎక్కువ బౌండరీలు సాధించిన జట్టు విజేతగా నిలుస్తుంది. అత్యధిక బౌండరీలు సాధించడంతో ఇంగ్లాండ్ జగజ్జేతగా నిలిచింది.