Published On: Sat, Mar 16th, 2019

జగన్‌ను కాపాడుతోంది మోదీనే…

* ఆంధ్రాలో ఫ్యాన్‌.. హైదరాబాద్‌లో స్విచ్‌.. దిల్లీలో కరెంటు..!

* చిన్నాన్న చనిపోతే విచారణ జరిపించకుండా రాజకీయాలా..?

* కేసీఆర్‌ బెదిరింపులకు భయపడం

* తిరుప‌తి విజయ శంఖారావం సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు

సెల్ఐటి న్యూస్‌, తిరుపతి: వైఎస్‌ వివేకానంద రెడ్డి మృతిని కూడా వైకాపా రాజకీయాలకు వాడుకుంటోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. హత్యానంతరం గుండెపోటు అని నమ్మించేందుకు తప్పుడు ప్రచారం చేశారని, దాన్ని కప్పిపుచ్చుకొనేందుకు మరిన్ని అడ్డదారులు తొక్కారని ధ్వజమెత్తారు. తిరుపతిలోని తారకరామ మైదానంలో శ‌నివారం ఉద‌యం నిర్వహించిన విజయ శంఖారావం ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా విజయ ఢంకా మోగించి ఎన్నికల ప్రచార భేరిని ప్రారంభించారు. అనంత‌రం సీఎం చంద్ర‌బాబు మాట్లాడుతూ శవపరీక్షలో హత్య అని తేలగానే.. ఆ నేరాన్ని వైకాపా నేత‌లు తెదేపాపై నెట్టే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. చిన్నాన్న హత్యకు గురైతే దోషులపై కఠిన చర్యలు తీసుకొనేలా డిమాండ్‌ చేయకుండా జగన్‌ వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కేంద్రంలో మోదీ ఉన్నారనే జగన్‌ సీబీఐ విచారణ కోరుతున్నారన్నారు. ఈ హత్య ఎవరు చేశారో రాష్ట్ర ప్రజలందరికీ తెలియాలన్నారు. ఈ కేసులో దోషులు ఎంతటివారైనా కఠినంగా శిక్షిస్తామని స్పష్టంచేశారు. ప్రతిపక్ష పాత్రలో ఇలా చేస్తే ఓ పది సీట్లు ఎక్కువ గెలిస్తే రాష్ట్రాన్ని రావణ కాష్ఠం చేసే అవకాశముందన్నారు. అవినీతిలో పట్టుబడ్డ వ్యక్తి జగన్‌ను ఎల్లప్పుడూ కాపాడేది చౌకీదార్‌ ప్రధాని నరేంద్రమోదీ. ఆంధ్రలో ఫ్యాన్‌.. హైదరాబాద్‌లో స్విచ్.. దిల్లీలో కరెంటు ఉంటుంది. దిల్లీ నుంచి కరెంటు వస్తే హైదరాబాద్‌లో స్విచ్‌ వేస్తే ఇక్కడ ఫ్యాన్‌ తిరుగుతుంది. ఇలాంటి ఫ్యాన్‌ను ఇక్కడ తిరగనిస్తారా తమ్ముళ్లూ? అని ప్రశ్నించారు.
                   ‘‘ఫారం-7 ద్వారా మొత్తం 9లక్షల ఓట్లు తొలగించారు. ఫారం-7 దరఖాస్తు చేసినవారిని జైలుకు పంపేవరకూ వదిలిపెట్టకూడదు. ఏపీ డేటాపై తెలంగాణ సీఎం కేసీఆర్‌కు చాలా ప్రేమ ఉంది. జగన్‌కు డేటా ఇచ్చి రాజకీయ లబ్ధి పొందాలని చూశారు. ఇలాంటి నేతలను కాపాడేది దిల్లీలో ఉన్న చౌకీదార్‌ మోదీ. దిల్లీ, హైదరాబాద్‌ నుంచి కుట్రలు పన్నుతున్నారు’’ అని మండిపడ్డారు. విభజన చట్టంలో రాష్ట్రానికి 18 హామీలు ఇచ్చినా.. ఒక్క హామీనీ నిలబెట్టుకోలేదు. ఐటీ, సీబీఐ, ఈడీలతో అందరిపై దాడులు చేయిస్తున్నారు. తెలుగు తమ్ముళ్లు దేనికీ భయపడరు.  కేసీఆర్ బెదిరింపులకు ఎవరూ భయపడరు. మా వద్ద నాటకాలాడితే తగిన బుద్ధి చెబుతాం. ఏపీకి విద్యుత్‌ బకాయిలు రూ.5వేల కోట్లు ఇవ్వాలి. ఇప్పుడు తిరిగి ఏపీపైనే ఆరోపణలు చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో కేసు వేశారని, ఏపీ ప్రాజెక్టులతో తెలంగాణకు ఏం పని’’ అని సీఎం ప్రశ్నించారు.
ఏప్రిల్‌ నుంచి రూ.5 లక్షల వైద్య సాయం…
‘‘ఎన్టీఆర్‌ వైద్య సేవ కింద వచ్చే ఏప్రిల్‌ నుంచి రూ.5 లక్షల వైద్య సాయం కల్పించబోతున్నాం. అనారోగ్యం పాలైనప్పుడు ఏ ఆస్పత్రికైనా వెళ్లి ఈ వైద్య సదుపాయం పొందవచ్చు. ఇప్పటివరకూ రూ.2.5 లక్షలుగా ఉన్న ఈ  వైద్య సాయం పరిమితిని రెట్టింపు చేసే ఈ కార్యక్రమం విజయవంతం కావాలని కోరుకుంటున్నా’’ అని సీఎం చంద్ర‌బాబు ఆకాంక్షించారు.
 

Just In...