Published On: Thu, Jan 10th, 2019

జగన్‌ కాశీయాత్ర చేసుకోవడం మేలు

* మంత్రి దేవినేని ఉమా

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ‌: వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్‌ ఇక కాశీయాత్ర చేసుకోవడం ఉత్తమం అని రాష్ట్ర జ‌ల‌వ‌న‌రుల శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. గురువారం ఉద‌యం ఆయ‌న విజ‌య‌వాడ‌లోని త‌మ విడిది కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడారు. కాశీకి వెళితే మీరు స్నేహం చేసే మోదీ కూడా తోడవుతారని జ‌గ‌న్‌ను ఉద్దేశించి మంత్రి ఎద్దేవాచేశారు. ప్రజా సంకల్ప యాత్ర ముగింపు సందర్భంగా జగన్‌ చేసిన ప్రసంగంపై మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు విమర్శలు గుప్పించారు. జగన్‌ మాటల్లో ఒక్కటి కూడా వాస్తవం లేదని ఆరోపించారు. గ్రామాల్లో పార్టీలకతీతంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతుంటే అబద్ధాలు ప్రచారం చేస్తారా? అని మండిపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిపై ఒక్క మాటైనా మాట్లాడారా? అని నిలదీశారు. జగన్‌ ప్రసంగంలో నిరాశ, నిస్పృహ స్పష్టంగా కనిపించిందన్నారు. జగన్‌, కేసీఆర్‌, మోదీ కుమ్మక్కయ్యారని ఆరోపించారు. సంకల్పయాత్ర ముగింపు కాదని.. అది వైకాపా ముగింపు యాత్ర అని అన్నారు.

Just In...