Published On: Wed, Jan 9th, 2019

జగన్‌ పాదయాత్ర ప్రజా వంచన యాత్రగా మిగిలిపోయింది

* తెదేపా రాష్ట్ర అధ్య‌క్షుడు కళా వెంకట్రావు

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: ప్ర‌తిపక్ష నేత జగన్మోహన్‌రెడ్డి చేసిన పాదయాత్ర స్వప్రయోజనాలను కాపాడుకునేందుకే కాని ప్రజల కోసం కాదన్నది కొండంత సత్యం అని తెదేపా రాష్ట్ర అధ్య‌క్షుడు క‌ళా వెంక‌ట్రావు అన్నారు. ఈ మేర‌కు ఆయ‌న బుధ‌వారం ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. పాదయాత్ర ముగింపు సభలో రాష్ట్రానికి ద్రోహం చేసిన నరేంద్రమోదీ, కేసీఆర్‌లను పల్లెత్తు మాట అనకుండా మీరు ప్రసంగించడం దేనికి నిదర్శనం. కేసుల మాఫీ కోసం, కేంద్రం కాళ్ల చుట్టూ తిరుగుతూ, మోడీ చేతుల్లో కీలు బొమ్మలా మారి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారు. జగన్‌ పాదయాత్రలో గ్రామాల్లో 24 గంటల వెలుగులు కనపడలేదా? శుభ్రమైన రోడ్లు, ప్రాజెక్టులు, పరిశ్రమలు కనపడలేదా? ఎప్పుడైనా మీరు నిర్మాణాత్మకంగా వ్యవహరించారా? పాదయాత్ర పేరుతో దుష్ప్రచారం తప్పా ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు? అందుకే ఇది ప్రజా సంకల్ప యాత్ర కాదు.. ప్రజా వంచన యాత్రా.. అని ప్రజలు భావిస్తున్నారు. పాదయాత్రలో స్వచ్ఛందంగా ప్రజల స్పందన లేదు కాబట్టి కోడి కత్తి డ్రామా లాడి అభాసుపాలయ్యారు. ఈ కేసును పక్కదారి పట్టించేందుకు, మీ కుట్ర ఎక్కడ భయటపడుతుందోనన్న భయంతో మోడీ కాళ్ల మీద పడి టెర్రరిస్టులను అణచివేసే ఎన్‌ఐఏ సంస్థను వేయించుకున్నావు. 2014 ఎన్నికల్లో జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలను ప్రజలు నమ్మలేదు, ఓట్లు వేయలేదు. ఇప్పుడూ ఆయన చెప్పే నవరత్నాలలో నాలుగు గులకరాళ్లు తప్ప ప్రజలను మోసం చేసే పాచికలు తప్ప మరొకటి కాదు. మిగులు బడ్జెట్‌ ఉన్నా రాజశేఖర్‌రెడ్డి రైతులకు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, ఇళ్లు నిర్మిస్తానని హామీలను ఇచ్చి నెరవేర్చలేకపోయారు. మ్యానిఫెస్టోలో కనీసం 10 శాతం హామీలను పూర్తి చేయడంలో విఫలం అయ్యారు. లోటు బడ్జెట్‌లోను ఇచ్చిన హామీలను నూటికి నూరు శాతం పూర్తి చేసి.. ఇవ్వని హామీలను నెరవేరుస్తూ, అవినీతికి ఆస్కారం లేకుండా ప్రజా రంజక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ కనీవినీ ఎరుగని రీతిలో పారదర్శకవంతమైన పాలనను అందిస్తూ, అభివృద్ధి చేస్తూ 85% ప్రజల సంతృప్తిని పొందగలుతున్నాం. జ‌యప్రకాష్‌ నారాయణ, పద్మనాభయ్య  ఆధ్వర్యంలో నవ్యాంధ్రప్రదేశ్‌కు రూ.75వేల కోట్లు రావాలని నిర్ధారించారు. అవి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని మీ ముగింపు సభలో మోదీని ఎందుకు ప్రశ్నించలేదు..? రాఫెల్‌ యుద్ధ విమానాల అవినీతి మీద మోడీని ఎందుకు నిలదీయలేదు..?కాపులు, రజకలు, వాల్మీకుల రిజర్వేషన్‌ మీద ఏపీ ప్రభుత్వం పంపిన తీర్మానాలు ఆమోదించాలని కేంద్రాన్ని ఎందుకు కోరలేదు..? విభజన చట్టంలోని ప్రతి హామీని నెరవేర్చని మోడీని 2019 ఎన్నికల్లో ఓడించండి అని ప్రకటించే ధమ్ము, ధైర్యం ఉందా? కేంద్రంలో జరుగుతున్న నిరంకుశత్వ పాలనకు వ్యతిరేకంగా బీజేపీయేతర శక్తులన్నింటిని ఏకం చేసి ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునేందుకు, విభజన హామీలను నెరవేర్చుకునేందుకు, సెక్యులరిజాన్ని కాపాడేందుకు కృషి చేస్తోంది ఒక్క తెలుగుదేశం పార్టీనే అన్నారు.

Just In...