Published On: Wed, Dec 2nd, 2020

జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భూముల రీసర్వే..

* పెండింగ్‌లో ఉన్న భూములను మొబైల్ కోర్టుల ద్వారా సెటిల్ చేసుకోవచ్చు

* సిసియల్‌ఏ కమిషనర్‌ నీరబ్‌కుమార్ ప్రసాద్

విజ‌య‌వాడ‌, సెల్ఐటి న్యూస్‌: భూముల రీసర్వే, డిజిటలైజేషన్‌ను వచ్చే జనవరి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం నిర్వహించనుంద‌ని సిసియల్‌ఏ కమిషనర్ నీరబ్‌కుమార్ ప్రసాద్ చెప్పారు. మంగళవారం విజ‌య‌వాడ‌లోని కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో జిల్లాలోని జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడు గ్రామంలో (వైయస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు – భూరక్షా పధకం)పై పైలెట్ ప్రాజెక్టుగా నిర్వహించిన రీసర్వే వివరాలపై ఆయన అధికారులతో సమీక్షించారు. ఈ సమావేశంలో సిసియల్‌ఏ జాయింట్ సెక్రటరి చెరుకూరి శ్రీధర్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ కమిషనర్‌ సిద్ధార్డ్ జైన్, జిల్లా కలెక్టర్‌ ఏయండి ఇంతియాజ్, జాయింట్ కలెక్టర్ డాక్ట‌ర్ కె.మాధవీలత, జాయింట్ సెక్రటరీ, పిడి సియంఆర్‌ఓ ఎం.విజయసునీత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిసియల్‌ఏ కమిషనర్‌ నీరబ్‌కుమార్ ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో భూమి సమస్యలకు ఆస్కారం లేకుండా పక్కా భూమి రికార్డు రూపొందించేందుకు భూముల రీసర్వే కార్యక్రమాన్ని వచ్చే జనవరి 1న ప్రారంభించి, ఆగష్టు 2023 నాటికి పూర్తి చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశ‌మన్నారు. అందులో జగ్గయ్యపేటలో నిర్వహించిన భూముల రీసర్వే వివరాలను ప్రామాణికంగా తీసుకుని రాష్ట్రంలో జరిగే సర్వేకు అనుసంధానించ‌నున్న‌ట్లు తెలిపారు.  అందువల్ల తక్కెళ్లపాడులో డ్రోన్, ఏరియల్ పొటోగ్రఫీ, మొబైల్ వర్క్ స్టేషన్ల ద్వారా నిర్వహించిన సర్వే వివరాలను అడిగి తెలుసుకున్నారు. తక్కెళ్లపాడు గ్రామంలో నోటిఫికేషన్-5(1), 6(1) లు జారీ చేసామని, రీసర్వే కూడా పూర్తైంద‌ని కలెక్టర్‌ ఇంతియాజ్ కమిషనర్‌కు నివేదించారు. ఫీల్డ్ మ్యాప్, గ్రామపటం అన్నీ సిద్ధ‌మ‌య్యాయని చెప్పారు. అయితే గ్రామంలో గతంలో 150 సర్వేనెంబర్లే ఉన్నాయని అవి రీసర్వే తర్వాత 640 సర్వే నెంబర్లుగా పెరిగిందన్నారు. మొదటినుంచి వస్తున్న సర్వే నెంబర్లుకు అనుబంధంగా మ్యూటేషన్ చేసుకున్న రైతులు 1, 2 లేదా ఏ ఆర్ బి సంఖ్యల పైనే పట్టాలు తీసుకున్నారని కారణంగా చెప్పారు. అయితే ఆభూముల నెంబర్లన్నీ మార్పు చెంది ప్రస్తుతం 640 క్రొత్త సర్వే నెంబర్లుగా వచ్చాయన్నారు. గ్రామంలో 157 ల్యాండ్ పార్శిల్స్ పై సర్వే జరపగా 112 సర్వే నెంబర్లు మధ్య అంగీకారం కుదిరిందని జాయింట్ కలెక్టర్‌ కె.మాధవీలత కమిషనర్‌తో చెప్పారు. అయితే 35ల్యాండ్ ఫార్శిళ్లపై తమకు ఉన్న భూమికంటే తక్కువ భూమి చూపిస్తున్నారని అధికారులు చెప్పిన సర్వేకు అంగీకరించలేదని తెలిపారు. కమిషనర్ నీరబ్‌కుమార్ ప్రసాద్ జోక్యం చేసుకుంటూ భూమి వ్యత్యాసం పది శాతం కంటే తేడా ఎక్కువగా వస్తే ఆ భూమినంతా పెండింగ్‌లో పెట్టమని ఆదేశించారు. సర్వే పనులన్నీ పూర్తైన తర్వాత ఫారం-13లో ఫైనల్ నోటిఫికేషన్ కూడా ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. వచ్చే వారం రోజుల్లోపు ఫైనల్ నోటిఫికేషన్ కూడా విడుదల చేయమని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఆతర్వాత పెండింగ్‌లో భూములు ఏమైనా ఉంటే వాటిని సివిల్ కోర్టులో లేదా క్రొత్తగా రీసర్వే కోసం ఏర్పాటు చేసే మొబైల్ కోర్టుల ద్వారానైనా ఆ రైతులు పరిష్కారానికి వెళ్లవచ్చని స్పష్టం చేశారు. ఫారం-13లో ప్రచురించిన భూమి పాత సర్వే నెంబర్లకు, క్రొత్త సర్వే నెంబర్లకు కోరిలేషన్ కూడా స్పష్టంగా చూపించాలని ఆయన ఆదేశించారు. మొత్తంమీద ఆర్‌యస్‌ఆర్‌ను తుది ఖరారు ఇతర రిజిష్టర్ల తయారీ అంశాలను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఫారం-1బిను సక్రమంగా ముద్రణకు డిజైనింగ్ రూపొందించాలని, ప్రోపర్టీ కార్డు డిజైనింగ్ తయారుచేయాలని సూచించారు. ఇప్పటివరకు పూర్తి చేసిన రీసర్వే భూముల్లో స్టోన్ ప్లాంటేషన్‌కు చర్యలు తీసుకోవాలన్నారు. స‌మావేశంలో విజయవాడ సబ్‌క‌లెక్ట‌ర్ ‌హెచ్‌.యం.ధ్యానచంద్ర, డిపివో సాయిబాబా, సర్వే శాఖ రీజనల్ డిప్యూటి డైరెక్టర్‌ వెంకటేశ్వరరావు, తహశీల్దారు రామకృష్ణ, ఏడి సర్వేయరు సూర్యారావు తదితరులు పాల్గొన్నారు.

Just In...