Published On: Sun, Oct 6th, 2019

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో లక్ష్యాలను సాధించాలి

* మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

సెల్ఐటి న్యూస్‌, అమరావతి: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో లక్ష్యాలను సాధించాలి అని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. శుక్ర‌వారం సాయంత్రం తాడేపల్లిలోని పంచాయతీరాజ్‌ కమిషనర్‌ కార్యాలయంలో రాష్ట్ర స్థాయి డ్వామా పిడిల కాన్ఫెరెన్స్ నిర్వ‌హించారు. ముఖ్యఅతిథిగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పంచాయతీరాజ్‌ ప్రిన్సిపల్‌ కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్‌ గిరిజా శంకర్, 13 జిల్లాల డ్వామా ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌లు  హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఉపాధి హామీ పనులపై సమీక్ష నిర్వ‌హించారు. అనంత‌రం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో లక్ష్యాలను సాధించాలి. గత ఏడాది కంటే కనీసం 20 శాతం అధికంగా చేయాలి. ప్రగతిపై ప్రతినెలా ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ల ఆధ్వర్యంలో సమీక్షలు చేయాలి. ప్రతి నియోజకవర్గానికి రూ.10 కోట్లు నరేగ కింద ఇవ్వాలని కలెక్టర్‌ లకు ఆదేశాలు. డ్రైనేజీ, మురుగునీటి శుద్ది వంటి కార్యక్రమాలు చేపట్టాలి. ప్రాధాన్యతా క్రమంలో గ్రామస్థాయిలో ప్రతిపాదిత పనులు చేయాలి. గ్రామ సచివాలయాలు, అసంపూర్తిగా వున్న అంగన్‌వాడీలు, స్కూళ్లలో వసతులపై దృష్టి సారించాలి. సీఎం వైఎస్‌ జగన్‌ చెప్పినట్లు ”నాడు-నేడు” అనే విధంగా స్కూళ్లను ఆధునీకరించాలి. 40 వేలకు పైగా వున్న పాఠశాలలకు ప్రహరీ, మరుగుదొడ్ల నిర్మాణంకు ప్రతిపాదనలు పంపాలి. అంతర్గత రహదారులు… హార్టీకల్చర్‌, ఫిషరీస్‌ వంటివి ప్రోత్సహించాలి. 11వేలకు పైగా వున్న గ్రామసచివాలయాలకు ఉపాధి హామీని వర్తింప చేయాలి. అవసరమైన చోట్ల కొత్త భవనాలు నిర్మించాలి. ప్రస్తుతం వున్న వాటికి అదనపు గదుల నిర్మాణాలు చేపట్టాలి. కేంద్రం నుంచి నిధులు మరింతగా రావాలంటే.. నరేగ ప్రోగ్రస్‌ లో ముందుండాలి. ఫీల్డ్ అసిస్టెంట్‌ ల పై ఫిర్యాదులు వస్తే వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలి. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై స్పందించాలి. మొక్కల సంరక్షణ, ప్లాంటేషన్‌ లపై దృష్టి సారించాలి. ట్రీగార్డ్‌ల‌ కోసం అన్ని జిల్లాల నుంచి కొటేషన్లు తెప్పించుకుని తక్కువ రేటును నిర్ణయించాలి. మెటీరియల్‌, లేబర్‌ కాంపోనెంట్‌ లో పనులను ముందుకు తీసుకువెళ్లాలి. చిత్తూరు జిల్లాలో లేబర్‌ వలసలు లేకుండా చూడాలి. ఏజెన్సీ ఏరియాలో గిరి సేవ పథకం కింద గ్రామ సచివాలయాలు నిర్మించాలి. వెంటనే వాటికి టెండర్లు పిలవాలి. ‘ఉద్దానం’ వంటి ప్రాంతంలో వెంటనే నరేగ కింద ప్లాంటేషన్‌ చేపట్టాలి. ప్రభుత్వ పక్కాగృహాలకు 90 రోజుల ఉపాధి పనిదినాలను సద్వినియోగం చేయాలి. నరేగ కింద ఎంపీలు ప్రతిపాదించే పనులకు ఎంపి ల్యాడ్స్‌ను కూడా తీసుకోవాలి.

 

Just In...