Published On: Thu, Jun 14th, 2018

జాతీయ ప్రాజెక్టుగా ప్ర‌క‌టించి నిధుల విడుద‌ల‌లో జాప్యం స‌రికాదు

* ఒక్క పైసా తగ్గించి క్రూర పరిహాసం చేస్తారా?

* కేంద్రం వైఖ‌రిపై ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఆగ్ర‌హం

సెల్ఐటి న్యూస్‌, అమరావతి: పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి డబ్బులు లేకున్నా ఖర్చు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. దిల్లీలో జరిగే నీతి ఆయోగ్‌ సమావేశంపై అమరావతి సచివాలయంలో గురువారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన రాష్ట్రం పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోన్న వైఖరిపై మండిపడ్డారు. పోలవరంలో డయాఫ్రం వాల్ విజయవంతంగా పూర్తి చేశామని, ఈ విషయంలో మన వాదనలు గట్టిగా వినిపించాల్సి ఉందన్నారు. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత నిధుల విడుదలలో ఆలస్యం చేయడం సరికాదన్నారు. లెక్కలు చెప్పలేదనే నెపం రాష్ట్ర ప్రభుత్వంపై మోపటం సరికాదన్నారు. ప్రత్యేక హోదాకు గట్టిగా పట్టుబట్టాలని, ప్రత్యేక హోదా ఇస్తామని అంటేనే హైదరాబాద్‌ను వదులుకొని వచ్చినట్లు స్పష్టం చేశారు. కానీ కాలయాపన చేస్తూ అప్పుడిస్తాం, ఇప్పుడిస్తాం అని చివరికి మోసగించారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇస్తామని చెప్పిన ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేన్నారు. ఇది ప్రజల సెంటిమెంటు అని, ఇప్పటికే రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని ప్రజలంతా భావిస్తున్నారని సీఎం తెలిపారు. ఇప్పుడు దక్షిణాదిలో ఆంధ్రప్రదేశ్‌ మిగిలిన రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధి చెందాల్సి ఉందన్నారు. ఆదాయం వచ్చేదాకా కేంద్రం సహకరించాలని మరోసారి విజ్ఞప్తి చేశారు. నాలుగేళ్లలో కేంద్రం సహకారం లేకపోయినా రాష్ట్రంలో 10.5శాతం వృద్ధి రేటు సాధించామన్నారు. విభజన సమస్యలపై ఈ సమావేశంలో చర్చించిన చంద్రబాబు అభివృద్ధికి సహకరించాలి తప్ప అడ్డుకోవడం సరికాదని హితవు పలికారు. పన్నులు చెల్లిస్తున్నా న్యాయబద్ధంగా ఇవ్వాల్సిన వాటిని కూడా కేంద్రం ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వల్ల నగదు లేక ప్రజలు కష్టాలు పడుతున్నారని, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు దారుణంగా నియంత్రణ లేకుండా పెంచేసి వాటిపై ఒక్క పైసా తగ్గించి క్రూర పరిహాసం చేస్తారా? అని కేంద్రాన్ని నిలదీశారు.

Just In...