Published On: Mon, Apr 16th, 2018

జిల్లా ప్రభుత్వ వసతి గృహాల్లో జూన్ 12న స్వీకారం-2 నిర్వ‌హ‌ణ‌

* కృష్ణా కలెక్టర్ బి.లక్ష్మీకాంతం వెల్ల‌డి

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ‌: దాతల సహకారంతో జిల్లాలోని ప్రభుత్వ వసతి గృహాలకు మౌలిక సదుపాయాలు కల్పించి సుందరీకరణ కార్యక్రమాలు చేస్తున్నట్లు కృష్ణా జిల్లా కలెక్టర్ బి.లక్ష్మీకాంతం ఆదివారం విడుద‌ల చేసిన ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. జూన్ 12న విద్యాసంస్థలు తెరిచే నాటికి అన్ని వసతిగృహాలు పనులు పూర్తిచేసి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పిస్తామని ఆరోజున పండ‌గ వాతావరణంలో స్వీకారం-2ను నిర్వహిస్తామని కలక్టర్ బి.లక్ష్మీకాంతం తెలిపారు. అదే రోజున దాతలు, విద్యార్థుల తల్లిదండ్రుల‌ను స‌త్క‌రిస్తామ‌న్నారు.

అలసత్వం ప్రదర్శించే అధికారులకు ఈ నెల జీతం నిలుపుదల… 

ప్రభుత్వ పథకాల అమలు.. లక్ష్యసాధనలో అలసత్వం ప్రదర్శించే అధికారులకు ఈ నెల జీతాలు నిలుపుదల చేస్తామని, వారం రోజుల్లో ప్రగతి సాధించి లక్ష్య‌సాధనకు కృషి చేయాలని కృష్ణా కలెక్టర్ బి.లక్ష్మీకాంతం అన్నారు. ఆదివారం తమ విడిది కార్యాలయం నుండి జిల్లా అధికారులు, క్షేత్రస్థాయి అధికారులతో ఆయ‌న వివిధ పథకాల అమలుపై టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ల‌క్ష్మీకాంతం మాట్లాడుతూ వారం రోజుల్లో నూటికి నూరు శాతం లక్ష్యాలు సాధించని జిల్లా స్థాయి అధికారులతో పాటు క్షేత్రస్థాయి అధికారుల వరకు జీతాలు నిలుపుదల చేస్తామని టెలీకాన్ఫరెన్స్ ద్వారా హెచ్చ‌రించారు.

అన్నింటా మనమే ముందు…

ప్రభుత్వ పథకాల అమలులో ఎక్కువసార్లు రాష్ట్రంలోని అన్ని జిల్లాల కంటే కృష్ణాజిల్లా ప్రథమస్థానంలో నిలుస్తుందని కలెక్టర్ బి.లక్ష్మీకాంతం తెలిపారు. ఆదివారం తమ విడిది కార్యాలయంలో వివిధ పథకాల గురించి వివరించారు. కృష్ణాజిల్లా బయోమెట్రిక్ హాజరులో 88 శాతం ప్రగతి సాధించి రాష్ట్రంలోనే ప్రథమస్థానంలో ఉందన్నారు. ఈ-ఆఫీస్ ఫైళ్ల పరిష్కారం 91 శాతం ప్రగతి సాధించి మొదటి స్థానంలో ఉన్నామన్నారు. మైక్రో ఇరిగేషన్ లక్ష్యసాధనలో 79.51 శాతంతో రాష్ట్రంలో మొదటిస్థానంలో ఉందని కలెక్టర్ బి.లక్ష్మీకాంతం వెల్ల‌డించారు.

Just In...