Published On: Sat, May 11th, 2019

జీఎస్టీని త‌ప్పించుకోబోయి దొరికిన ముఠా..

* భారీ మొత్తంలో ప‌ట్టుబ‌డిన వెండి   

* కారు, న‌గ‌దు, సెల్‌ఫోన్లు స‌హా స్వాధీనం చేసుకున్న విజ‌య‌వాడ టాస్క్‌ఫోర్స్ పోలీసులు

* ముగ్గురు నిందితులు అరెస్ట్‌

* అక్ర‌మార్కుల‌పై ఉక్కుపాదం మోపుతాం

* సీపీ ద్వార‌కా తిరుమ‌ల‌రావు స్ప‌ష్టీక‌ర‌ణ 

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ క్రైం: జీఎస్టీని చెల్లించ‌కుండా ప్ర‌భుత్వ ఆదాయానికి గండి కొడుతూ ఎటువంటి బిల్లులు లేకుండా దొడ్డిదారిన కారులో త‌ర‌లిస్తున్న సుమారు రూ.52.44 ల‌క్ష‌లు విలువైన 138 కేజీల వెండి వ‌స్తువులు, వెండి దిమ్మెలు, రూ.3.65 ల‌క్ష‌లు న‌గ‌దు, మూడు సెల్‌ఫోన్లు, ఒక కారును విజ‌య‌వాడ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శ‌నివారం స్వాధీనం చేసుకున్నారు. ప‌న్ను చెల్లించ‌ని వెండి వ‌స్తువులు ఒక కారులో త‌ర‌లిస్తున్న‌ట్లు త‌మ‌కు అందిన ఖ‌చ్చిత‌మైన స‌మాచారంతో టాస్క్‌ఫోర్స్ ఏసీపీ కె.సూర్యచంద్రరావు త‌మ సిబ్బందితో కలసి గవర్నరుపేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని జైహింద్ కాంప్లెక్స్ సమీపం వద్ద కారును ఆపి త‌నిఖీ చేయ‌డంతో నిందితులు ప‌ట్టుబ‌డ్డార‌ని విజ‌య‌వాడ పోలీస్ క‌మిష‌న‌ర్ సీహెచ్ ద్వార‌కా తిరుమ‌ల‌రావు చెప్పారు. ప్ర‌భుత్వానికి చెల్లించాల్సిన ఆదాయాన్ని ఎగ్గొట్టేందుకు ప్ర‌య‌త్నిస్తున్న అక్ర‌మార్కుల‌పై టాస్క్‌ఫోర్స్ బృందం డేగ క‌ళ్ల‌తో కాపు కాస్తార‌ని పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా సిబ్బందిని అభినందించారు. చ‌ట్ట‌ప‌రంగా అక్ర‌మార్కుల‌ను దోషులుగా నిల‌బెట్టేందుకు అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని సీపీ ద్వారకా తిరుమ‌ల‌రావు స్ప‌ష్టం చేశారు.

Just In...