Published On: Thu, Aug 8th, 2019

జూడాలపై దాడిని ఖండిస్తున్నాం

*  ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత

సెల్ఐటి న్యూస్, విశాఖపట్నం: రాష్ట్రంలో ధర్నాలు, ర్యాలీలు చేయదలచుకుంటే ముందుగా అనుమతి తీసుకోవాలని ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. శాంతియుతంగా చేపట్టే నిరసనలకు ప్రభుత్వం అనుమతిస్తుందని చెప్పారు. నిరసనల్లో హింసాత్మక ఘటనలకు పాల్పడవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు. విశాఖలో గురువారం ‘మహిళా మిత్ర’ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం మీడియాతో ఆమె మాట్లాడారు. ఎంఎన్‌సీ బిల్లుకు వ్యతిరేకంగా బుధవారం విజయవాడలో జరిగిన ధర్నాలో జూనియర్‌ డాక్టర్లపై పోలీసులు అతిగా ప్రవర్తించి చేయిచేసుకోవడాన్ని తాము ఖండిస్తున్నామన్నారు. ఆ ఘటనపై ఇప్పటికే విచారణకు ఆదేశించామని చెప్పారు. జూనియర్‌ డాక్టర్లు తమ హక్కుల కోసం ధర్నాలు చేసుకోవచ్చన్నారు.

పోలీసులు పొరపాటు చేసినట్లే కనిపిస్తోంది: డీజీపీ
విజయవాడలో జూనియర్‌ డాక్టర్లపై పోలీసుల దాడి అనుకోకుండా జరిగిన సంఘటన అని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ అన్నారు. దానికి సంబంధించిన దృశ్యాలు చూస్తుంటే పోలీసులు పొరపాటు చేసినట్లే కనిపిస్తోందన్నారు. విజయవాడలో దాడి ఘటనపై విచారణకు ఆదేశించామని సవాంగ్‌ వివరించారు. ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో పరిస్థితి అదుపులో ఉందని డీజీపీ చెప్పారు. మావోయిస్టులు ప్రజల్లో ఉనికి కోసం పాకులాడుతున్నారని.. అందుకే హింసకు మార్గాలు వెతుకుతున్నారని ఆయన విమర్శించారు. కళాశాలల్లో విద్యార్థినుల రక్షణకు వర్చువల్‌ పోలీస్‌స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు డీజీపీ తెలిపారు.

Just In...