Published On: Sat, May 12th, 2018

జూన్‌లో దాములూరు-వైకుంఠపురం కృష్ణానదిపై వంతెనకు టెండర్లు

* త్వరలో మైలవరం అంతటా పాదయాత్ర చేస్తా

* జూపూడి సైకిల్ యాత్రలో మంత్రి దేవినేని ఉమా

సెల్ఐటి న్యూస్‌, ఇబ్రహీంపట్నం: వచ్చే నెలలో దాములూరు-వైకుంఠపురం వరకు కృష్ణానదిపై వంతెన నిర్మాణానికి టెండర్లు పిలవబోతున్నట్లు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రకటించారు. వంతెన నిర్మాణ పనులను కూడా త్వరితగతిన పూర్తి చేసేందుకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసినట్లు చెప్పారు. శనివారం ఇబ్రహీంపట్నం మండలం జూపూడి గ్రామంలో జరిగిన తెలుగుదేశం పార్టీ సైకిల్ యాత్ర సందర్భంగా ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి ఉమా మాట్లాడుతూ వచ్చే నెలలో మైలవరం నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని, ప్రతి ఇంటిని కలిసేలా పెద్ద ఎత్తున పాదయాత్ర చేపట్టబోతున్నట్లు చెప్పారు. నాలుగేళ్ళ కాలంలో మైలవరం నియోజకవర్గం అంతటా చేపట్టిన అభివద్ధి పనులను, ప్రగతి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ మిగిలిన సమస్యలపై కూడా దృష్టి పెట్టేలా ఈ పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తనపై ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడు, మూడో కృష్ణుడు పోటీ చేసారని, వారంతా ఓడిపోయారని ఇప్పుడు నాలుగో కృష్ణుడు పోటీ చేసేందుకు వస్తున్నట్లు అభివర్ణించారు. ఎవరు పోటీ చేసినా తాను మైలవరం ముద్దుబిడ్డనని, ఎన్నికలతోనూ, ఓట్లతోనూ సంబంధం లేకుండా ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్నానని తెలిపారు. ఎవరొచ్చినా 2019లో కూడా రాష్ర్టంలో తెలుగుదేశం పార్టీ విజయం తధ్యమని ప్రజల హర్షధ్వానాల మద్య వెల్లడించారు. రాష్ర్టం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపడుతున్న  అభివృద్ధి పథకాల గూర్చి ఒక్కక్కటిగా వివరించారు. చంద్రన్న పెళ్లికాను వివిధ కార్పొరేషన్ల ద్వారా రుణాల పంపిణీ, చంద్రన్న భీమా, మహిళా సాధికారత, బాలికల రక్షణ వంటి కార్యక్రమాలను ఆయన ప్రజలకు వివరించారు. కేంద్ర ప్రభుత్వం ఏపీ ప్రజలను మోసగిస్తున్నా, ఒక వైపు ప్రత్యేక హోదా పేరు చెబుతూ మోదీతో వైకాపా నాయకులు అంటకాగుతున్నారని విమర్శించారు. తెలుగుప్రజలకు ద్రోహం చేసేవారిని 2014 ఎన్నికల మాదిరిగానే 2019లోనూ తెలుగు ప్రజలు శిక్షించేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేసారు. విపత్కర పరిస్థితులలోనూ దీక్షాదక్షతలతో రాష్ర్టాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తెలుగు ప్రజలందరూ అండగా నిలవాలని మంత్రి ఉమా కోరారు. మంత్రి ఉమా పర్యటనలో భాగంగా వైసీపీ కార్యకర్తలు రెంటపల్లి చిట్టి, రెంటపల్లి చిన్ననాగయ్య మండల తెదేపా అధ్యక్షుడు రామినేని రాజశేఖర్ ఆధ్వర్యంలో తెదేపాలో చేరారు. వీరికి మంత్రి స్వయంగా పచ్చకండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వనించారు.

Just In...