Published On: Sat, May 30th, 2020

జూన్‌ 30 వరకు లాక్‌డౌన్‌ పొడిగింపు…

న్యూఢిల్లీ, సెల్ఐటి న్యూస్‌: కరోనా వైర‌స్ కట్టడికి కేంద్ర ప్రభుత్వం విధించిన నాలుగో విడత లాక్‌డౌన్‌ రేపటితో (ఆదివారం) ముగియనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతు‌న్నా మరిన్ని సడలింపులతో లాక్‌డౌన్‌ 5.0ను కేంద్రం రూపొందించింది. కంటైన్‌మెంట్‌ జోన్లలో జూన్‌ 30 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. జూన్‌ 8 నుంచి అన్ని రాష్ట్రాల్లో ప్రార్థనా మందిరాలు తెరుచుకోవచ్చని తెలిపింది. ఇక ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు హోటల్స్‌, రెస్టారెంట్లు, మాల్స్‌కు కూడా అనుమతినిచ్చింది. జూలై నుంచి పాఠశాలలు, కాలేజీలు, కోచింగ్‌ సెంటర్లు ప్రారంభం అవుతాయని కేంద్రం తన మార్గదర్శకాల్లో పేర్కొంది. ఈ మేరకు శనివారం సాయంత్రం 5.0కి సంబంధించి కొత్త గైడ్‌లైన్స్‌ను విడుదల చేసింది. లాక్‌డౌక్‌ కారణంగా రెండు నెలలుగా మూతబడ్డ అంతర్జాతీయ విమాన సర్వీసులు, మెట్రో రైళ్లు. సినిమా హాల్స్‌, జిమ్‌లు, బార్లు, స్విమ్మింగ్ పూల్స్‌, ఆడిటోరియంల ప్రారంభంపై త్వరలోనే తేదీలను ప్రకటిస్తామని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. అలాగే రాజకీయ, సామాజిక, సాంస్కృతిక మతపరమైన కార్యకలాపాలపై కూడా త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తామని తెలిపింది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 వరకు కర్ఫ్యూ కొనసాగుందని కేంద్రం స్పష్టం చేసింది. ఇక కరోనా వైరస్‌ వ్యాప్తి కట్టడికి అన్ని బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌లు, భౌతికదూరం తప్పనిసరి చేస్తున్నట్లు నూతన మార్గదర్శకాల్లో కేంద్రం స్పష్టం చేసింది. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు మరిన్ని రంగాలకు ఆంక్షల నుంచి సడలింపులు కల్పించింది.

Just In...