Published On: Thu, Jun 14th, 2018

జూలై 8న టీడీపీకి గుడ్‌బై చెప్పనున్న ఆనం?

* వైసీపీలో చేరేందుకు సుముఖ‌త‌

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: తెదేపా రాష్ట్ర ప్ఱ‌ధాన కార్య‌ద‌ర్శి, మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడాలని నిర్ణయించుకొన్నారు. ఈమేరకు ఆయన ఆత్మకూరు నియోజకవర్గంలోని నాయకులకు తేల్చి చెప్పేశారు.  వైసీపీలోకి ఆయన చేరేందుకు రంగం సిద్ధమైనట్టు విశ్వసనీయ సమాచారం. జూలై 8న దివంగత వైయస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. టీడీపీలో రామనారాయణను కొనసాగించేందుకు టీడీపీ నేతలు జరిపిన బుజ్జగింపులు ఫలించలేదు. గత రెండు, మూడు రోజులుగా అభిమానులు, సన్నిహితులతో ఆయన సమావేశాలు నిర్వహించారు. పార్టీ మారాలనుకోవడానికి కారణాలు వివరిస్తూ, వారి మద్దతును కూడగట్టుకునే ప్రయత్నం చేశారు. వాస్తవానికి పార్టీ మారాలనే నిర్ణయాన్ని కొన్ని నెలల ముందే రామనారాయణ రెడ్డి తీసుకున్నారు. టీడీపీలో చేరే సమయంలో చంద్రబాబు తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదనే అసంతృప్తి ఆయనలో ఉంది. మినీ మహానాడు వేదికలపై కూడా టీడీపీని, పార్టీ విధానాలను ఆయన బహిరంగంగా విమర్శించారు. ఈ నెల 2న నెల్లూరులో జరిగిన నయవంచన దీక్ష వేదికపైనే ఆయన వైసీపీకి సంఘీభావం ప్రకటించాల్సి ఉంది. అయితే, రోజులు బాగాలేవని ఆ కార్యక్రమాన్ని ఆయన వాయిదా వేసుకున్నారని సమాచారం.

Just In...