Published On: Tue, Jan 8th, 2019

‘జేపీ’ రిపోర్టు కేంద్రానికి చెంపపెట్టు

* రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు

* ఏపీకి కేంద్రం చేస్తున్న అన్యాయం బట్టబయలు

* ప్రధాని నరేంద్రమోడివన్నీ అబద్ధాలే

* వారెప్పుడైనా అసెంబ్లీకి వస్తే కదా నిజాలు తెలిసేది

* ప్రతిపక్ష నేతలపై కుటుంబరావు ఫైర్

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: ఏపీ పునర్ వ్యవస్థీకరణ  చట్టం – సంబంధిత హామీల అమలుపై ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంలోని అంశాలు నిజమేనని లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ నేతృత్వంలోని నిపుణుల కమిటీ విడుదల చేసిన నివేదికతో రుజువైందని, ఇది కేంద్రానికి చెంప పెట్టువంటిదని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు సి.కుటుంబరావు అన్నారు. ఏపీకి  కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయం బట్టబయలైందన్నారు. రాష్ట్రంలోని ఏడు వెనుకబడి జిల్లాలకు ఇవ్వాల్సిన రూ.750 కోట్లు తక్షణమే చెల్లించాలని ప్రధానమంత్రి నరేంద్రమోడి అధ్యక్షునిగా ఉన్న నీతి అయోగ్ స్పష్టం చేసిందన్నారు. ఏపీకి అన్ని చెల్లించేశామంటూ చెబుతున్న ప్రధానమంత్రి నరేంద్రమోడి నీతి అయోగ్ సభ్యులను డిస్మస్ చేస్తారా అని ఆయన ప్రశ్నించారు. సచివాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ ప్రధాన కార్యదర్శిగా ఏర్పాటయిన ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ విడుదల చేసిన నివేదిక పునర్విభజన చట్టం ప్రకారం ఏపీకి రూ.85 వే కోట్ల వరకూ చెల్లించాల్సి ఉందని తెలిపిందన్నారు. ఏపీ పునర్ వ్యవస్థీకరణ  చట్టం – సంబంధిత హామీల అమలుపై గత నెల 23వ తేదీన విడుదల చేసిన శ్వేతపత్రంలోని కేంద్ర ప్రభుత్వం నుంచి ఏపీకి రూ.90 వేల కోట్ల రావాల్సి ఉందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపిందన్నారు. కేంద్ర నుంచి ఏపీకి రావాల్సిన నిధులపై జయప్రకాశ్ నారాయణ నేతృత్వంలోని ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ విడుదల చేసిన, రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం చిన్న చిన్న అంశాలు మినహా ఒకేలా ఉన్నాయన్నారు. ఈ రెండింటి లెక్కలతో ఏపీకి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయం బట్టబయలైందన్నారు.
జేపీ రిపోర్టును కూడా తప్పుబడతారా..?
2015“-20 మధ్య ఏపీ రెవెన్యూ లోటు రూ.22,113 కోట్లు అని, అదే సమయంలో తెలంగాణా రూ.1,17,000 కోట్ల మిగులు రెవెన్యూ కలిగి ఉంటుందని 14వ ఆర్థిక సంఘం చెప్పిందని, రాష్ట్ర విభజనకు ఇదేనా హేతుబద్ధత అని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా, రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలకు బుందేల్ ఖండ్ తరహాలో ప్యాకేజీ ఇవ్వాలని14వ ఆర్థిక సంఘం చెప్పిందన్నారు. జేపీ నేతృత్వంలోని ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సంస్థలో జస్టిస్ పర్వతరావు, కె.పద్మనాభయ్య, కాకి మాధవరావు, ప్రొఫెసర్ ఆర్.రాధాకృష్ణ, అజేయ కల్లాం, ప్రొఫెసర్ ఎస్.గలాబ్ తో పాటు 13, 14వ ఆర్థిక సంఘ సభ్యులుగా ఉన్నారన్నారు. వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని వివరాలూ అందజేశామన్నారు. తామిచ్చిన వివరాలతో పాటు వారు సేకరించిన అంశాలను పరిశోధించి కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.85 వేల కోట్లు రావాలని నిర్ధారించారన్నారు. ఏపీ పునర్ వ్యవస్థీకరణ  చట్టం – సంబంధిత హామీల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన శ్వేతప్రతాన్ని కొందరు ప్రతిపక్ష నేతలు తప్పుబట్టారన్నారు. జేపీ నేతృత్వంలోని ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ ఇచ్చిన రిపోర్టును కూడా తప్పుబట్టగలరా అని ఆయన ప్రశ్నించారు. కేంద్రానికి ఈ  రిపోర్టు ఒక చెంప పెట్టు అని అన్నారు.
అబద్ధాలు చెబుతున్న నరేంద్రమోడి…
రాష్ట్రంలోని వెనుకబడి ప్రాంతాలకు రూ.24 వేల కోట్లు ఇవ్వాల్సి ఉండగా, కేంద్ర ప్రభుత్వం నేటి వరకూ రూ.1,050 కోట్లు మాత్రమే మంజూరు చేసిందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు తెలిపారు. తక్షణమే రూ.750 కోట్లు చెల్లించాలని కేంద్రానికి ప్రధానమంత్రి అధ్యక్షునిగా ఉన్న నీతి అయోగ్ నివేదిక అందజేసిందన్నారు. ఏపీకి అన్నీ ఇచ్చేశామంటున్న ప్రధానమంత్రి నరేంద్రమోడి ఏం సమాధానం చెబుతారని ఆయన నిలదీశారు. నీతి అయోగ్ నివేదిక అసత్యమైతే, ఆ సంస్థ సభ్యులను డిస్మస్ చేస్తారా? అని పీఎం నరేంద్రమోడిని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వం యూసీలు అందజేసినట్లు నీతి అయోగ్ చెప్పిందన్నారు. ఇదే విషయం, జయప్రకాశ్ నారాయణ నేతృత్వంలోని ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ కూడా ధ్రువీకరించిందన్నారు. యూసీలు ఇవ్వలేదని పీఎం చెబుతున్నారన్నారు. ఆంద్రప్రదేశ్ పై కక్షపెంచుకున్న ప్రధానమంత్రి నరేంద్రమోడి మాత్రం బీజేపీ కార్యకర్తలతో పచ్చి అబద్ధాలు చెబుతున్నారన్నారు.
ఏపీకి తెలంగాణా రూ.5 వేల కోట్ల బకాయి…
2015-20 మధ్య ఏపీ రెవెన్యూలోటు రూ.22,113 కోట్లు ఉంటుందని 14వ ఆర్థిక సంఘం చెబితే, తెలంగాణా ముఖ్యమంత్రి హేళనగా మాట్లాడడం తగదని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు హితవు పలికారు. ఏపీ విద్యుత్ సంస్థలకు తెలంగాణా ప్రభుత్వం రూ.5 వేల కోట్ల బకాయి ఉందని, ఇదే విషయమై జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్.సి.ఎల్.టి.)లో కేసు నడుస్తున్న విషయం నిజమా…కాదా..? అని ఆయన ప్రశ్నించారు. ఏ కేసులూ, బాకీలు లేవన్నట్లు, అప్పు చేసి పప్పుకూడు తింటున్నట్లు తమ రాష్ట్రంలో 24 గంటలూ విద్యుత్ ఇస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి డాబులకు పోతున్నారని ఆయన విమర్శించారు. ఏపీకి కేంద్రం సాయం చేయాలని కోరుతుంటే తమ జేబుల్లో డబ్బులు ఇస్తున్నట్లు పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారన్నారు.
అసెంబ్లీకి వస్తే కదా నిజాలు తెలిసేది…
శ్వేతపత్రాలతో ప్రభుత్వ విజయాలను ప్రజల దగ్గరుకు తీసుకెళుతుంటే, ప్రతిపక్ష వైసీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు విమర్శించారు. శ్వేతపత్రాల్లోని నిజాలను దృష్టి మరల్చడానికే అబద్ధపు పుస్తకాలు ముద్రిస్తున్నారన్నారు. ఆ పుస్తకాల్లో 0.1 శాతం కూడా వాస్తవం ఉండదన్నారు. శ్వేతపత్రాల్లో అవాస్తవాలు ఉంటే పోలిస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయొచ్చునన్నారు. నాలుగేళ్ల నిద్రపోయి, ఇపుడు విమర్శలు చేస్తున్నారని ప్రతిపక్ష నేతలను ఆయన ప్రశ్నించారు. కొన్ని డిపార్టుమెంట్లలో కేటాయిస్తున్న బడ్జెట్ కంటే ఎక్కువ అవినీతి జరిగిందని ఆరోపిస్తున్నారని, వాళ్లెప్పుడయినా అసెంబ్లీకి వస్తే కదా వాస్తవాలు తెలియడానికి అని ఎద్దేవా చేశారు. తమకున్న ప్రింటింగ్ ప్రెస్ ద్వారా అబద్ధపు ముద్రణలు చేస్తున్నారని, అవే డబ్బులు ప్రజాహితానికి వినియోగిస్తే ఎంతో మేలు కలుగుతుందని హితవు పలికారు. ప్రభుత్వ శ్వేతపత్రాలు, ప్రతిక్షం అబద్ధపు ముద్రణలు…వాస్తవాలు Vs అబద్ధాలుగా ఆయన అభివర్ణించారు. ప్రధానమంత్రి నరేంద్రమోడి, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాటలు చూస్తుంటే, భారతదేశంలో భూభాగంగా ఏపీని చూడడంలేదని అర్థమవుతోందన్నారు. రోజు రోజుకూ ఆంధ్రప్రదేశ్ పై కేంద్ర ప్రభుత్వం శత్రుత్వం పెంచుకుంటోందన్నారు. జాతీయ సంస్థలను కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని, ఇదే విషయంపై సీబీఐ డైరెక్టర్ గా అలోక్ వర్మను తిరిగి నియమిస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు రుజువు చేసిందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు అన్నారు.

Just In...