Published On: Mon, Jun 25th, 2018

జైన్ స‌మాజ్ సేవ‌లు ఆద‌ర్శ‌నీయం

* మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్‌ 

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ‌: నిరుపేదల ఆర్థిక ఇబ్బందుల‌ను దృష్టిలో ఉంచుకుని జైన్ స‌మాజ్ విజ‌య‌వాడ న‌గ‌ర శాఖ ఆధ్వ‌ర్యంలో క్యాన్స‌ర్ ప‌రీక్ష‌, ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయ‌డం ముదావ‌హ‌మ‌ని మాజీ మంత్రి డాక్ట‌ర్ కామినేని శ్రీనివాస్  అన్నారు. పాత‌బ‌స్తీ పాడివీధిలోని సీవీ రెడ్డి ఛారిటీస్ ప్రాంగ‌ణంలో జైన్ స‌మాజ్ ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన ఐదు రోజుల పాటు జ‌రిగే వైద్య‌శిబిరాన్ని రెండో రోజైన సోమ‌వారం ఉద‌యం మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ క్యాన్స‌ర్‌తో పాటు గుండెజ‌బ్బులు, కంటి, చెవి, ముక్కు, గొంతు త‌దిత‌ర వ్యాధుల‌కు సంబంధించి ఒకేచోట వైద్య‌శిబిరం ఏర్పాటు చేయ‌డంతో పాటు ప్ర‌ముఖ ఆసుప‌త్రులకు చెందిన వైద్యుల స‌మ‌క్షంలో ఉచితంగా వైద్య ప‌రీక్ష‌లు, మందులు పంపిణీ చేయ‌డం అభినంద‌నీమ‌న్నారు. జైన్ స‌మాజ్ సేవ‌లు ఆద‌ర్శ‌నీయ‌మ‌ని కొనియాడారు. ఈ సంద‌ర్భంగా వైద్య‌శిబిరంలో మాజీ మంత్రి కామినేని శ్రీనివాస‌రావు వైద్య‌ప‌రీక్ష‌లు చేయించుకున్నారు. వైద్య శిబిరాన్ని సంద‌ర్శించిన భార‌తీయ జ‌న‌తా పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జి.వి.ఎల్ నరసింహరావు మాట్లాడుతూ ఉత్త‌రాధి ప్రాంతం నుంచి వ‌చ్చిన‌ప్ప‌టికీ జైనులు స్థానికంగా ఉండే తెలుగువారి ఆరోగ్య‌భ‌ద్ర‌త‌కు పెద్ద‌పీట వేస్తూ వైద్య శిబిరం ఏర్పాటు చేయ‌డం గొప్ప విష‌య‌మ‌ని పేర్కొంటూ నిర్వాహ‌కుల‌ను ప్ర‌శంసించారు. ఇటువంటి కార్య‌క్ర‌మాలు మ‌రిన్ని చేయాల‌ని సూచించారు. ఉచిత మెగా వైద్య‌శిబిరంలో రెండోరోజూ సైతం రెండు వేల మంది రోగులు త‌ర‌లివ‌చ్చి వైద్య‌ప‌రీక్ష‌లు చేయించుకున్నారు. కార్య‌క్ర‌మం నిర్వాహ‌కులు ప్ర‌వీణ్‌జైన్‌, భావేష్‌జైన్‌, సంజ‌య్ మెహ‌తా మాట్లాడుతూ ఉచిత మెగా వైద్య‌శిబిరం ఈ నెల 28వ తేదీ వ‌ర‌కు ప్ర‌తిరోజూ ఉద‌యం 10 గంట‌ల నుండి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు కొన‌సాగుతుంద‌ని తెలిపారు. న‌గ‌ర‌వాసులు ఈ స‌ద‌వ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని కోరారు.
 

Just In...