Published On: Tue, Apr 17th, 2018

టిటిడి పేరుతో ఉన్న బోగస్‌ వెబ్‌సైట్లపై విచారణ చేపట్టాలి

* సివిఎస్‌వోను కోరిన తితిదే ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ 

సెల్ఐటి న్యూస్‌, తిరుమ‌ల‌: శ్రీవారి దర్శనం, బస.. ఇతర సేవల బుకింగ్‌కు సంబంధించి టిటిడి పేరుతో కొన్ని బోగస్‌ వెబ్‌సైట్లు పనిచేస్తున్నాయని, వీటిపై సమగ్రంగా విచారణ చేపట్టి భక్తులు మోసపోకుండా చర్యలు చేపట్టాలని టిటిడి ఈవో  అనిల్‌కుమార్‌ సింఘాల్‌ టిటిడి సివిఎస్‌వో ఆకే రవికృష్ణను కోరారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలోని  సమావేశ మందిరంలో సోమవారం ఆయ‌న సీనియర్‌ అధికారులతో ఈవో సమావేశం నిర్వహించారు. వేసవి దృష్ట్యా రాబోయే 15 వారాలు తిరుమలలో అధిక రద్దీ ఉంటుందని, అందుకు తగ్గట్లు సీనియర్‌ అధికారుల పర్యవేక్షణలో ఏర్పాట్లు చేపట్టాలని ఈవో ఆదేశించారు. తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లలో టీవీల ద్వారా ప్రసారం చేస్తున్న కార్యక్రమాల నాణ్యత, విషయ పరిజ్ఞానంపై భక్తుల అభిప్రాయాలు సేకరించాలని ప్రజాసంబంధాల అధికారికి సూచించారు. కంపార్ట్‌మెంట్ల నుంచి భక్తులను దర్శనానికి వదిలే సమయంలో ఒకరినొకరు తోసుకోకుండా తగిన చర్యలు చేపట్టాలని భద్రతా అధికారులను ఆదేశించారు. శ్రీవారి ఆలయంలోకి వెళ్లే భక్తుల సౌక‌ర్యార్థం శబ్దం రాని ఫ్యాన్లు ఏర్పాటు చేయాలని ఎలక్ట్రికల్‌ అధికారులను కోరారు. శ్రీవారి పుష్కరిణి వద్ద అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు. తిరుమలలో భక్తుల రద్దీకి తగ్గట్లు మరుగుదొడ్ల సంఖ్యను పెంచనున్న క్రమంలో వాటి డిజైన్లు రూపొందించాలని ఇంజనీరింగ్‌ అధికారులను ఈవో ఆదేశించారు. కన్యాకుమారి, కురుక్షేత్రలో శ్రీవారి ఆలయాల నిర్మాణ పనులను వేగవంతం చేయాలన్నారు. టిటిడిలోని అన్ని విభాగాల్లో విద్యుత్‌ పరికరాలకు సంబంధించి ప్రత్యేకంగా రిజిస్టర్‌లు నిర్వహించాలన్నారు. సమావేశంలో టిటిడి తిరుమల జెఈవో కెఎస్ శ్రీనివాసరాజు, తిరుపతి జెఈవో పోల భాస్కర్‌, సివిఎస్‌వో ఆకే రవికృష్ణ, ఎఫ్‌ఏసిఏవో బాలాజీ, చీఫ్‌ ఇంజనీర్‌ చంద్రశేఖర్‌రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.

Just In...