Published On: Sat, Nov 30th, 2019

టిడ్కోలో రివర్స్ టెండరింగ్‌ ద్వారా రూ.106 కోట్లు ఆదా

* మంత్రి బొత్స సత్యనారాయణ

సెల్ఐటి న్యూస్‌, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన పట్టణ గృహనిర్మాణ శాఖ (టిడ్కో)లో  రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రభుత్వానికి  రూ.106 కోట్లు ఆదా అయినట్లు పురపాలక, పట్టణాభివృద్ధి మరియు పట్టణ గృహనిర్మాణ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. వెలగపూడి సచివాలయంలోని ప్రచార విభాగంలో మంత్రి శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఈ మేరకు టిడ్కోలో రివర్స్ టెండరింగ్ విధానం ద్వారా నాలుగు జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆదా చేసిన సొమ్ము వివరాలను మీడియాకు తెలియజేశారు. చిత్తూరు జిల్లాలో టిడ్కో ద్వారా కేటాయించిన 5808 యూనిట్లకు రూ.271.03 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేయడం జరిగిందని మంత్రి వివ‌రించారు. ఇందులో తక్కువ బడ్జెట్ కే ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు ఇంద్రజిత్ మెహతా కన్స్ట్రక్షన్స్, డీఈసీ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ మరియు ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు పోటీ పడ్డాయన్నారు. ఇందులో డీఈసీ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ అతి తక్కువగా రూ.230.18 కోట్లకు టెండర్లను దక్కించుకుందన్నారు. తద్వారా రూ.40.85 కోట్లు (15%) ప్రభుత్వానికి ఆదా అయినట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ నిర్మాణాల్లో భాగంగా చదరపు అడుగుకు రూ.1587 అంచనా వేయగా రూ.1321 కే నిర్మాణాలు పూర్తిచేసేందుకు డీఈసీ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ సంస్థ నిర్మించనుందని ప్రకటించారు. కృష్ణా జిల్లాలో టిడ్కో ద్వారా కేటాయించిన 2064 యూనిట్లకు రూ.95.65 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేయడం జరిగిందన్నారు. ఇందులో తక్కువ బడ్జెట్ కే ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు ఎన్ జే ఆర్ కన్ స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్, కేఎంవీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్,  ఇంద్రజిత్ మెహతా కన్స్ట్రక్షన్స్ సంస్థలు పోటీ పడ్డాయన్నారు. ఇందులో ఎన్ జే ఆర్ కన్ స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అతి తక్కువగా రూ.81.03 కోట్లకు టెండర్లను దక్కించుకుందన్నారు. తద్వారా రూ.14.35 కోట్లు (15%) ప్రభుత్వానికి ఆదా అయినట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ నిర్మాణాల్లో భాగంగా చదరపు అడుగుకు రూ.1628 అంచనా వేయగా రూ.1312 కే నిర్మాణాలు పూర్తిచేసేందుకు ఎన్ జే ఆర్ కన్ స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్మించనుందని ప్రకటించారు.
విశాఖపట్నం జిల్లాలో టిడ్కో ద్వారా కేటాయించిన 3424 యూనిట్లకు రూ.192.23 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేయగా తక్కువ బడ్జెట్ కే ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్, ఎన్ జే ఆర్ కన్ స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇంద్రజిత్ మెహతా కన్స్ట్రక్షన్స్  సంస్థలు పోటీ పడ్డాయన్నారు. ఇందులో ఇంద్రజిత్ మెహతా కన్స్ట్రక్షన్స్  ప్రైవేట్ లిమిటెడ్ అతి తక్కువగా రూ.163.4 కోట్లకు టెండర్లను దక్కించుకుందన్నారు. తద్వారా రూ.28.83 కోట్లు (15%) ప్రభుత్వానికి ఆదా అయినట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ నిర్మాణాల్లో భాగంగా చదరపు అడుగుకు రూ.1609 అంచనా వేయగా రూ.1304 కే నిర్మాణాలు పూర్తిచేసేందుకు ఇంద్రజిత్ మెహతా కన్స్ట్రక్షన్స్  ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్మించనుందని ప్రకటించారు. విజయనగరం జిల్లాలో టిడ్కో ద్వారా కేటాయించిన 3072 యూనిట్లకు రూ. 148.12 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేయగా తక్కువ బడ్జెట్ కే ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు వీఎన్ సీ లిమిటెడ్, ఎన్ జే ఆర్ కన్ స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇంద్రజిత్ మెహతా కన్స్ట్రక్షన్స్ సంస్థలు పోటీ పడ్డాయన్నారు. ఇందులో ఇంద్రజిత్ మెహతా కన్స్ట్రక్షన్స్  ప్రైవేట్ లిమిటెడ్ అతి తక్కువగా రూ.126.24 కోట్లకు టెండర్లను దక్కించుకుందన్నారు. తద్వారా రూ.21.88 కోట్లు (14.78%) ప్రభుత్వానికి ఆదా అయినట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ నిర్మాణాల్లో భాగంగా చదరపు అడుగుకు రూ.1578 అంచనా వేయగా రూ.1315 కే నిర్మాణాలు పూర్తిచేసేందుకు ఇంద్రజిత్ మెహతా కన్స్ట్రక్షన్స్  ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్మించనుందని ప్రకటించారు.
చిత్తూరు, కృష్ణా, విశాఖపట్నం, విజయనగరం  జిల్లాల్లో మొత్తం టిడ్కో ద్వారా కేటాయించిన 14368 యూనిట్లకు (ఇళ్ల నిర్మాణాలు) సంబంధించి రూ.707.3 కోట్లు ఖర్చు అవుతుందని ప్రభుత్వం అంచనా వేయగా రూ.606.12 కోట్లకే పనులు చేస్తామని రివర్స్ టెండరింగ్ కంపెనీలు ముందుకు వచ్చాయని మంత్రి తెలిపారు. టిడ్కోలో రివర్స్ టెండరింగ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు రూ.105.91 కోట్లు ఆదా అయినట్లు మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. గత ప్రభుత్వ అవినీతిని ఎండగడుతూ దానిని నియంత్రించే దిశగా తమ ప్రభుత్వం స్వయంగా పేదలకు ఉచితంగా ఇళ్లు కట్టించే పథకానికి శ్రీకారం చుట్టిందని మంత్రి బొత్స అన్నారు. ఈ క్రమంలోనే  రాష్ట్రంలోని 4 జిల్లాల్లో టిడ్కో ద్వారా కేటాయించిన 14,368 యూనిట్లను రివర్స్ టెండరింగ్ విధానంలో పిలవగా రూ.105.91 కోట్లు ఆదా అయ్యిందన్నారు. గత ప్రభుత్వంలో మాదిరి పాత రేట్లకు టెండర్లు పిలిచివుంటే రాష్ట్రంలో నివసిస్తున్న ప్రజల మీద ఒక్కొక్కరిపై  రూ. 75 వేల నుండి రూ.95 వేల వరకు భారం పడేదని మంత్రి తెలిపారు. రివర్స్ టెండరింగ్‌తో ఆ మేరకు లబ్ధిదారులకు ప్రయోజనం కలిగినట్లేనని అభిప్రాయపడ్డారు. టిడ్కో లో రివర్స్ టెండరింగ్ మూలాన ప్రతి చదరపు అడుగు నిర్మాణానికి రూ.250 మేర ప్రజాధనం ఆదా అయినట్లేనని మంత్రి తెలిపారు. ఈ డిసెంబరు 13వ తేదీన 15,086 యూనిట్లు, 19వ తేదీన 21,744 యూనిట్లు, 26వ తేదీన 14,800 యూనిట్లకు అంటే మొత్తం 65,998 ఇళ్లకు రూ.3,258 కోట్లతో టెండర్స్ లు పిలుస్తామని ప్రకటించారు. కేవలం నాలుగు జిల్లాల్లోని టిడ్కో యూనిట్లకు రివర్స్ టెండరింగ్ పిలవడం వల్ల రూ.105.91 కోట్లు  ఆదా అయిందని, డిశెంబర్ లో మిగతా జిల్లాల్లోని యూనిట్లకు పిలవబోయే  రివర్స్ టెండరింగ్ ద్వారా మరింత సొమ్ము ఆదా అవుతుందని  మంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు.  తమది పేదల పక్షపాతి ప్రభుత్వమని మంత్రి బొత్స సత్యనారాయణ గుర్తుచేశారు.

Just In...