Published On: Tue, Nov 17th, 2020

టైర్ల లోడుతో ఉన్న లారీ ద‌గ్ధం…

విజ‌య‌వాడ క్రైం, సెల్ఐటి న్యూస్‌: విజ‌య‌వాడ విద్యాధ‌ర‌పురంలోని ఆర్టీసీ వర్క్‌షాప్ రోడ్డులో సోమ‌వారం రాత్రి 7:30 గంట‌ల స‌మ‌యంలో టైర్ల లోడుతో ఉన్న లారీ అగ్ని ప్ర‌మాదానికి గురైంది. ఈ ఘ‌ట‌న‌తో లారీలోని టైర్లు పూర్తిగా అగ్నికి ఆహుత‌య్యాయి. స‌కాలంలో అగ్నిమాప‌క సిబ్బంది చేరుకున్న‌ప్ప‌టికీ అప్ప‌టికే జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగిపోయింది. సేక‌రించిన వివ‌రాల ప్ర‌కారం.. విజయవాడ రూరల్ మండలం రాయనపాడు నుండి రాజమండ్రి దగ్గర రాజానగరంలో అన్‌లోడ్ అవ్వాల్సి ఉండగా ఆర్టీసీ వర్క్‌షాప్ రోడ్డులోని రైతు బజార్ దగ్గర తన ఇంటికి వెళ్లి భోజనం చేసి తరువాత రాజనగరం వెళదామ‌నే ఆలోచ‌న‌తో లారీ యజమాని నిజాముద్దీన్ (భాషా) ఆర్టీసీ వర్క్ షాప్ రోడ్డులో లారీని పార్కింగ్ చేశారు. రాత్రి 11 గంటలు దాటిన తరువాత రాజమండ్రి దగ్గర రాజానగరం వెళదాం అనుకున్నాడు. ఈ క్ర‌మంలో లారీ టైర్లు
పైన ఉన్న విద్యుత్తు తీగ‌ల‌ను తాక‌డంతో అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. భారీగా మంట‌లు ఎగ‌సిప‌డ‌డంతో స్థానికంగా ఉన్న కాల‌నీల‌కు విద్యుత్తు శాఖ అధికారులు స‌ర‌ఫ‌రాను నిలిపివేశారు. ఊహించని పరిణామంతో లారీ, లారీలోని టైర్లు పూర్తిగా అగ్నికి ఆ‌హుతి అయ్యాయి. భవానీపురం పోలీసుల సహాయంతో అగ్నిమాప‌క సిబ్బంది ఎట్ట‌కేల‌కు మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. మంట‌లు అదుపులోకి వ‌చ్చాక రాత్రి 9:‌‌30గంట‌ల‌కు విద్యుత్తు స‌ర‌ఫ‌రా లేక స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

 

Just In...