Published On: Tue, Jul 9th, 2019

డాక్టర్ బెజవాడ పాపారావుకు అరుదైన గౌరవం

* కర్నాటక ఆర్థిస్కోపీ అసోసియేషన్ పురస్కారం 

* డాక్టర్ పాపారావును అభినందించిన కామినేని వైద్య బృందం

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ‌: ప్రఖ్యాత ఆర్థ్రోసర్జన్ డాక్టర్ బెజవాడ పాపారావుకు అరుదైన గౌరవం లభించింది. ఆర్థ్రోసర్జన్‌గా వందలాది మందికి పునర్జీవనం ప్రసాదించిన డాక్టర్ పాపారావు సేవలకు గుర్తింపుగా కర్నాటక ఆర్థోస్కోపీ అసోసియేషన్ విశిష్ట పురస్కారాన్ని అందచేసింది. జూన్ 27న బెంగళూరులోని ఐటీసీ గార్డెనియా హోటల్లో జరిగిన ఆర్థోస్కోపీ సొసైటీ కాన్ఫరెన్స్‌లో డాక్టర్ బెజవాడ పాపారావు ఈ పురస్కారాన్ని అందుకున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన పురస్కారాన్ని అందుకున్న డాక్టర్ పాపారావును కామినేని హాస్పిటల్స్ వైద్యులు అభినందించారు. డాక్టర్ పాపారావుకు కర్నాటక ఆర్థోస్కోపి పురస్కారం లభించడం తమందరికీ గర్వకారణమని వారు పేర్కొన్నారు. డాక్టర్ బెజవాడ పాపారావుకు కర్నాటక ఆర్థోస్కోపీ అసోసియేషన్ పురస్కారం లభించడం హర్షణీయమని కామినేని హాస్పిటల్స్ మెడికల్ డైరక్టర్ డాక్టర్ వెనిగళ్ల నవీన్ తెలిపారు. ఎన్నో క్లిష్టమైన కేసులలో విజయవంతంగా చికిత్స చేసిన ఘనత డాక్టర్ పాపారావుకు దక్కుతుందని, ఆయనకు లభించిన ఈ పురస్కారం కామినేని హాస్పిటల్స్ ప్రతిష్టను మరింత ఇనుమడింపచేసిందని డాక్టర్ నవీన్ పేర్కొన్నారు. కామినేని హాస్పిటల్స్ నందు అందుబాటులో ఉన్న అత్యాధునిక సదుపాయాల ద్వారా డాక్టర్ బెజవాడ పాపారావు, డాక్టర్ కె.వి.గురువర్ధన్ వైద్య బృందం ఎంతో మంది రోగులకు నాణ్యమైన చికిత్స అందిస్తోందన్నారు. తనకు కర్ణాటక ఆర్థోస్కోపీ అసోసియేషన్ పురస్కారం లభించడం పట్ల డాక్టర్ బెజవాడ పాపారావు సంతోషం వ్యక్తం చేశారు. ఈ అవార్డు తనపై బాధ్యతను మరింత పెంచిందని పేర్కొన్నారు. తన పదేళ్ల ప్రస్థానంలో దాదాపు వెయ్యిమందికి పైగా లిగమెంట్లు దెబ్బతిన్నవారికి శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించానని, దేశంలోని వివిధ పరిశోధనా కేంద్రాల్లో కీహోల్ సర్జరీ విధానంపై అధ్యయనం జరిపి అనేక మందికి చికిత్సనందించినట్లు తెలిపారు. మోకాలు, భుజం జాయింట్లలో లిగమెంట్లు దెబ్బతిన్నవారికి కీహోల్ సర్జరీ ద్వారా మెరుగైన ఫలితాలు లభిస్తాయని, కీహోల్ సర్జరీ చేసిన పేషెంట్లు కొద్దిరోజుల వ్యవధిలోనే కోలుకుని సాధారణ జీవనం గడపగలుగుతారని డాక్టర్ బెజవాడ పాపారావు వివరించారు.

Just In...