Published On: Wed, Dec 4th, 2019

డాక్టర్ వేణుగోపాలరెడ్డికి మహాత్మాగాంధీ పురస్కారం

* తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ చేతుల మీదుగా అవార్డు ప్రదానం

హైద‌రాబాద్‌, సెల్ఐటి న్యూస్‌: ప్రఖ్యాత డయాబెట్టాలజిస్టు డాక్టర్ కే.వేణుగోపాలరెడ్డికి అత్యంత విశిష్టమైన మహాత్మాగాంధీ పురస్కారం లభించింది. ఇటీవల ఆర్ఎస్ఎస్డీఐ డయాబెటిస్ ఎక్సెలెన్స్ జాతీయ పురస్కారాన్ని అందుకోవడంతో పాటు, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుల్లో స్థానం సంపాదించిన డాక్టర్ వేణుగోపాలరెడ్డి.. తెలంగాణ రాష్ట్ర గవర్నరు తమిళసై సౌందరరాజన్ చేతుల మీదుగా మహాత్మాగాంధీ పురస్కారాన్ని అందుకున్నారు. మహాత్మాగాంధీ ఫౌండేషన్ నిర్వహించిన గాంధీజీ 150వ జయంతి ఉత్సవాలలో ఈ పురస్కారాన్ని అందజేశారు. నవంబరు 30న హైదరాబాద్‌లోని బిర్లా ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో హిమాచల్ ప్రదేశ్ గవర్నరు బండారు దత్తాత్రేయ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. వీజీఆర్ డయాబెటిస్ స్పెషాలిటీస్ హాస్పిటల్స్ ద్వారా సేవలందిస్తున్న డాక్టర్ కే.వేణుగోపాలరెడ్డి.. వీజీఆర్ ట్రస్టు ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు.  ప్రపంచ మధుమేహవ్యాధి దినోత్సవం సందర్భంగా 35 వేల మంది విద్యార్థులకు ఒకేసారి వ్యాసరచన పోటీలు నిర్వహించి రికార్డులకెక్కిన డాక్టర్ వీజీఆర్.. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుతో పాటు పలువురి ప్రశంసలు అందుకున్నారు. మధుమేహవ్యాధి పట్ల అవగాహన కల్పించేందుకు వేల సంఖ్యలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడంతో పాటు, పేద విద్యార్థులకు ఉపకారవేతనాలు అందజేస్తున్నారు. రేడియో, టీవీ తదితర ప్రసార మాధ్యమాల ద్వారా మధుమేహవ్యాధి నియంత్రణకు తనదైన శైలిలో ముందుకెళుతున్న డాక్టర్ వీజీఆర్, మధుమేహవ్యాధి పట్ల అవగాహన కల్పించేలా రూపొందించిన లక్షలాది పుస్తక ప్రతులను ప్రజలకు ఉచితంగా అందజేశారు. మహాత్మాగాంధీ పురస్కారం అందుకున్న సందర్భంగా డాక్టర్ కే.వేణుగోపాలరెడ్డి సంతోషం వ్యక్తంచేశారు. మహాత్మాగాంధీ పురస్కారం అందుకోవడం ద్వారా లభించిన స్పూర్తితో మరింత విస్తృతంగా సేవా కార్యక్రమాలను చేపడతామని ఆయన పేర్కొన్నారు.

Just In...