Published On: Tue, Jun 12th, 2018

డీమార్ట్‌ రూ.2500 ఇస్తోందంటూ వాట్సాప్‌లో ప్ర‌చారం..

* న‌మ్మి మోస‌పోవ‌ద్దంటున్న నిపుణులు
సెల్ఐటి న్యూస్‌, బిజినెస్ డెస్క్‌: ప్రముఖ సూపర్‌ మార్కెట్‌ డీమార్ట్‌ 17వ వార్షికోత్సవం సందర్భంగా రూ.2500 షాపింగ్‌‌ వోచర్‌ ఇస్తోంది. మీకూ కావాలంటే ఈ లింక్‌ క్లిక్‌ చేయండి!
– గత రెండు రోజులుగా వాట్సాప్‌లో చక్కర్లు కొడుతున్న లింక్‌ ఇది…
ఆ మెసేజ్‌లో చెప్పినట్లు మీకు రూ. 2500 డబ్బులు రాకపోగా మీ వ్యక్తిగత సమాచారం ఆగంతుకుల పాలు అయ్యే అవకాశం ఉంది. మీరూ డీమార్ట్‌ లింక్‌ను క్లిక్‌ చేస్తే అది వేరే వెబ్‌సైట్‌ (http://neuewfarben.com)కి రీడైరక్ట్‌ అవుతుంది. అక్కడ మీరు ఇచ్చే సమాచారం, మీరు ఆ మెసేజ్‌ షేర్‌ చేసిన నెంబర్లు.. ఇలా అన్నీ దుండగులకు చేరిపోతాయనేది టెక్‌ నిపుణుల మాట. ఈ లింక్‌ అచ్చంగా డీమార్ట్‌ వెబ్‌సైట్‌కి చెందినదిలా ఉంటుంది. కానీ, మెసేజ్‌లో చూపిస్తున్న పేజీ ఆ వెబ్‌సైట్‌లో లేదు. ఇప్పటికే ఈ లింక్‌ను క్లిక్‌ చేసి సమాచారం ఇచ్చినవాళ్లు మీ బ్యాంకు, మెయిల్‌ ఐడీ తదితర ముఖ్యమైన వాటి పాస్‌వర్డ్‌లు మార్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ షాపింగ్‌‌ వోచర్‌ మెసేజ్‌ విషయమై డీమార్ట్‌ యాజమాన్యం స్పందించింది. సామాజిక మాధ్యమాల్లో ప్రచారంలో ఉన్నట్లుగా తాము ఎలాంటి ఆఫర్లు, డబ్బులు ఇవ్వడం లేదని.. ఇలాంటి మెసేజ్‌లపట్ల జాగ్రత్తగా ఉండాలని తమ వెబ్‌సైట్‌లో స్క్రోలింగ్‌ను విడుద‌ల చేసింది.

Just In...