Published On: Sat, Jan 12th, 2019

ఢిల్లీలోని ఏపీ భవన్‌లో సంక్రాంతి సంబరాలకు విస్తృత ఏర్పాట్లు

* సంబరాలకు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్న అధికార‌గ‌ణం  

సెల్ఐటి న్యూస్‌, న్యూ ఢిల్లీ: మంచు దుప్పటి కప్పుకున్న దేశరాజధాని హస్తినలో హంగామాగా 4 రోజులపాటు సంక్రాంతి సంబరాలను నిర్వహించుటకు న్యూ ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ ముస్తాబైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం న్యూ ఢిల్లీలోని ఎపి భవన్‌లో అంబరాన్ని తాకేలా సంక్రాంతి సంబరాలను జనవరి 12వ తేదీ శనివారం నుంచి 15వ తేదీ మంగళవారం వరకు 4 రోజులపాటు ఆహ్లాదకరమైన పల్లెవాతావరణంలో ఘనంగా నిర్వహించేందుకు ఎపి భవన్ అధికార యంత్రాంగం సర్వసన్నద్ధమైనది. ప్రతిరోజూ ఒక ప్రధాన అంశం ఇతివృత్తంగా సాంక్రామిటి సంబరాలను ఆనందోత్సాహాలతో జరుపుకునేందుకు ఎపి భవన్ రెసిడెంట్ కమీషనర్ ప్రవీణ్ ప్రకాష్ నేతృత్వంలో అధికార యంత్రంగం సకల ఏర్పాట్లు పూర్తి చేసింది. మొదటిరోజు హస్తినలో “గాన కోకిల పాటల పోటీలు, చిన్నారులకు, పెద్దలకు చిత్రలేఖనం, సంగీతం, వ్యాసరచన, వక్తృత్వ పోటీలు, పొదుపు కధల పోటీలను నిర్వహించి బహుమతులను అందచేయనున్నారు.  ప్రతిరోజూ ఉదయం, రాత్రి సమయములలో నూతనంగా విడుదలైన చలన చిత్రాల ప్రదర్శనలను అంబెడ్కర్ ఆడిటోరియంలో ప్రదర్సించనున్నారు.  ఆరుబయలు సభాప్రాంగణ  వేదికపై వివిధ కళాకారులచే జానపద గీతాలు, నృత్యాలు, దప్పుల విన్యాసాలు, పగటివేషాలు, హరిదాసులు, గంగిరెద్దుల ప్రదర్శన, సినీ సంగీత విభావరి  ప్రదర్శనలను ఏర్పాటు చేస్తున్నారు.   పల్లెకోకిలా శ్రీమతి బేబీ, జానపద సంగీత కళాకారిణి శ్రీమతి అరుణా సుబ్బారావులచే జానపద గీతాలు, కోలాట, ప్రదర్శనలు చేయనున్నారు. రెండ‌వ రోజున హస్తినలో 2019 ఉత్తమ కూచిపూడి నృత్య బృందం పోటీలు నిర్వహించి విజేతలకు నగదు బహుమతిని అందచేయనున్నారు. సాయంత్రం ప్రసిద్ధ నేపధ్య గాయకుడు కళారత్న ఎల్.వి.గంగాధర శాస్త్రిచే సంక్రాంతి గీతాంజలి, అనురాధచే వీణా నాదం, డాక్ట‌ర్ చింతా రవి బాలకృష్ణ బృందంచే అన్నమయ్య వైభవం కూచిపూడి నృత్య రూపకం ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. మూడవరోజైన భోగి పండుగ నాడు కబడ్డీ, తొక్కుడుబిళ్ల, రింగ్ గేమ్, టగ్ అఫ్ వార్, మ్యూజికల్ చైర్స్, చెస్, క్యారమ్స్, ముగ్గుల పోటీలు, పిండివంటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతుల ప్రధానం చేయనున్నారు. పొంగళ్ళు, గొబ్బెమ్మలు, గంగిరెద్దులు, డూడూ బసవన్నలు, చిన్నారులకు భోగిపండులు పోయటం వంటి సంప్రదాయ కార్యక్రమాలను నిర్వహించడమే కాక ఇండియన్ ఐడల్, జీ సరిగమప టీమ్ వారిచే సినీ సంగీత విభావరి నిర్వహిస్తున్నట్లు రెసిడెంట్ కమీషనర్ తెలిపారు. నాలుగవ రోజైన సంక్రాంతి నాడు చిన్నారులకు, యువతకు, పెద్దలకు, దంపతులకు, సంప్రదాయ దుస్తుల పోటీలు, చక్కనైన అమ్మాయి, సొగసైన అబ్బాయి, ఆదర్శ దంపతులు పోటీలను నిర్వహించనున్నారు.  సాయంత్రం కూచిపూడి నృత్యం, కృష్ణవేణి జానపద బృందం, విజయవాడ వారిచే జానపద గీతాలు, నృత్యాలు మొదలైనవి వుంటాయని తెలిపారు.  ప్రతి రోజూ ఉదయం నుంచి రాత్రివరకు ఆంధ్ర ప్రదేశ్ లో ప్రసిద్ధి పొందిన వెంకటిగిరి, మంగళగిరి, చేనేత వస్త్రాలు, మచిలీపట్టణం కలంకారీ, ఏటికొప్పాక బొమ్మలు, వన్ గ్రామ గోల్డ్, ఆప్కో, లేపాక్షి, ఆంధ్ర పిండి వంటకాల స్టాల్ల్స్ ఏర్పాటు చేసినట్లు రెసిడెంట్ కమీషనర్  ప్రవీణ్ ప్రకాష్ తెలిపారు.  ఈ నాలుగురోజులు ఢిల్లీ, ఢిల్లీ చుట్టుప్రక్కల వున్న మన తెలుగువారు అంద‌రూ విశేషంగా పాల్గొని సంక్రాంతి వేడుకలను ఘనంగా ఆంధ్రప్రదేశ్ భవన్‌లో జరుపుకోవాలని తెలిపారు.

Just In...