Published On: Sun, Feb 10th, 2019

ఢిల్లీలో ధర్మపోరాట దీక్షకు సన్నద్ధమవుతున్న ఎపి భవన్ ప్రాంగణం 

* దీక్షకుభారీగా  తరలివస్త్తున్న మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఆంధ్ర ప్రజానీకం
* ఏర్పాట్లలో నిమజ్ఞమైన ఎపి భవన్ అధికార యంత్రంగం
* సమీక్షించిన ఎపి భవన్ రెసిడెంట్ కమీషనర్ ప్రవీణ్ ప్రకాష్
సెల్ఐటి న్యూస్‌, న్యూ ఢిల్లీ:  ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో కేంద్ర ప్రభుత్వం చేసిన హామీలను నెరవేర్చాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం చేపట్టనున్న “ధర్మపోరాట దీక్ష” కు ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ ప్రాంగణంలో ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. ముఖ్య‌మంత్రి చంద్రబాబు సోమవారం ఉదయం 8గంటల నుంచి రాత్రి 8గంటల వరకు చేపట్టనున్న “ధర్మపోరాట దీక్ష” ఏర్పాట్లను ఆంధ్రప్రదేశ్ భవన్ రెసిడెంట్ కమీషనర్ ప్రవీణ్ ప్రకాష్, శాసనమండలి సభ్యులు సత్యనారాయణరాజు, ఎపి భవన్ కమీషనర్ డాక్ట‌ర్ అర్జా శ్రీకాంత్, ఎపి భవన్ ఓఎస్డి భావన సక్సెనాలతో కలసి ఎపి భవన్ అధికారులు, సిబ్బంది, తెలుగు సంఘాల ప్రతినిధులతో ఏర్పాట్లను సమీక్షించారు. దీక్షలో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నలుమూలల నుంచి భారీగా తరలివస్తున్న ప్రజాప్రతినిధులు, ప్రజలకు ఏవిధమైన అసౌకర్యం కలుగకుండా ప్రణాళికాబద్ధంగా సకల ఏర్పాట్లను పూర్తిచేయాలని ప్రవీణ్‌ప్రకాష్ సూచించారు. ఏపీ పునర్విభజన చట్టంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా భవన్ అధికారులు, సిబ్బందికి విశదీకరిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి చేపట్టనున్న ధర్మపోరాట దీక్ష విజయవంతం చేయుటకు అధికారులు, సిబ్బందిని సమాయత్తపరిచారు. రాష్ట్రం నుంచి త‌ర‌లివస్తున్న వారికి ముందుగా గుర్తించిన హోటల్స్, ఇతర భవనాలలో ఏర్పాటు చేస్తున్న బస ఏర్పాట్లను, వారికి అవసరమైన భోజనవసతి, రవాణా సౌకర్యాలలో ఏవిధమైన లోపం లేకుండా చూడాలని భవన్ సిబ్బందికి సూచించారు. ప్రధాన దీక్షా వేదిక వద్ద అవసరమైన పెండాల్స్, పబ్లిక్ అడ్రస్ సిస్టం, పోలీసు రక్షణ వలయం, మంచినీటి సరఫరా, మీడియా లాంజ్, ప్రసార మాధ్యమాల ద్వార ప్రత్యక్ష ప్రసార ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని రెసిడెంట్ కమీషనర్ ప్రవీణ్ ప్రకాష్ సూచనలు చేశారు. రాష్ట్రం నుంచి తరలివస్తున్న ప్రజలతో పాటు దేశ రాజధానిలోని తెలుగు ప్రజలు విరివిగా పాల్గొనేలా స్థానిక తెలుగు సంఘాలు తమవంతు చేయూతనిచ్చి సహకరించాలని రెసిడెంట్ కమీషనర్ ప్రవీణ్ ప్రకాష్ విజ్ఞప్తి చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదివారం రాత్రి 7గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి రాత్రి 9.15 నిముషాలకు న్యూ ఢిల్లీ విమానాశ్రయం చేరుకొని అక్కడ నుండి ఎపి భవన్‌కు విచ్చేసి రాత్రికి బస చేయనున్నారు. 11న సోమవారం ఉదయం 7గంటలకు రాజఘాట్‌లోని మహాత్మాగాంధీ సమాధిని సందర్శించి నివాళులు అర్పిస్తారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ భవన్‌కు చేరుకొని డాక్ట‌ర్ బి.ఆర్.అంబెడ్కర్ విగ్రహానికి పుష్పమాల వేసి అంజలి ఘటించి భవన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ధర్మపోరాట దీక్ష ప్రధాన వేదికపై ఉదయం 8గంటల నుంచి రాత్రి 8గంటల వరకు దీక్ష చేపట్టనున్నారు. 12న‌  మంగళవారం మధ్యాహ్నం 12.30ని.లకు భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌ను కలసి ఏపీ పునర్విభజనలో రాష్ట్రానికి  జరిగిన అన్యాయాన్ని వివరించి, కేంద్రం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ విజ్ఞాపన పత్రాన్ని సమర్పిస్తారు.

Just In...