Published On: Sat, Nov 23rd, 2019

తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి..

* సేంద్రీయ వ్యవసాయ పద్ధతులపై సీఎస్ సమీక్ష

సెల్ఐటి న్యూస్‌, అమరావతి: రాష్ట్రంలో సేంద్రీయ వ్యవసాయ పద్ధతులను అవలంభించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై శుక్రవారం వెల‌గ‌పూడి సచివాలయంలోని కలెక్టర్స్ కాన్ఫరెన్స్ హాల్‌లో రాష్ట్రస్థాయి అధికారులతో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సీఎస్ నీలంసాహ్ని హాజరయ్యారు. వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విదేశాలకు చెందిన ముగ్గురు శాస్త్రవేత్తల బృందం రాష్ట్ర అధికారులకు అవగాహన కల్పించింది. అంతకుముందు ఈ బృందం రాష్ట్రంలోని 13 జిల్లాల్లో పర్యటించి వ్యవసాయ స్థితిగతులను అంచనా వేసింది. భూమి స్థితిగతులు, పంట మార్పిడి విధానం, నీటి వనరులు, సేంద్రీయ ఎరువుల వినియోగం వంటి అంశాలపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి అధికారులకు వాటిని వివరించారు. ప్రధానంగా మృత్తిక జీవ శాస్త్రవేత్త వాల్టర్ జెహ్ని పలు ఆసక్తికర విషయాలను రాష్ట్ర స్థాయి అధికారులకు వివరించారు. అనంతరం సాయిల్ స్పాంజ్ శాస్త్రవేత్త డిడి పెర్సౌజ్, మొక్కల ఉత్పత్తి మరియు సంరక్షణ ప్రాజెక్టు డివిజన్ కోఆర్టినేటర్ అన్నెసోఫీలు మాట్లాడారు. అనంతరం రాష్ట్రాధికారులకు సేంద్రీయ వ్యవసాయ విధానాలపై ఉన్న సందేహాలు నివృత్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహదారు, కో వైస్ ఛైర్‌పర్సన్ టి.విజయ్‌కుమార్ అధికారులను సమన్వయపరిచి సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించారు.

Just In...