Published On: Wed, Jul 10th, 2019

తప్పుడు కేసులు పెట్టి వేధించడం మంచిపద్ధతి కాదు

* కార్యకర్తలపై దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోము

* అనంత‌పురం జిల్లా ప‌ర్య‌ట‌న‌లో తెదేపా అధినేత చంద్ర‌బాబు

సెల్ఐటి న్యూస్‌: అనంతపురం: నేరాలు, ఘోరాలు, హత్యలను ప్రజలెవరూ ఒప్పుకోరని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రజలు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితులు కల్పించాలని కోరారు. ఈ సంద‌ర్భంగా మంగళవారం ఆయన అనంతపురం జిల్లాలో పర్యటించారు. కడప విమానాశ్రయం నుంచి తాడిపత్రి మండలంలోని వీరాపురం గ్రామానికి చేరుకొని హత్యకు గురైన తెదేపా కార్యకర్త భాస్కర్‌ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ కార్యకర్తలపై దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమ‌న్నారు. తప్పుడు పరిపాలన చేస్తే ప్రజలే బుద్ధి చెబుతార‌ని పేర్కొన్నారు. అన్ని గ్రామాలు తిరిగి కార్యకర్తలను కాపాడుకుంటాం. తప్పుడు కేసులు పెట్టి వేధించడం మంచిపద్ధతి కాద‌న్నారు. ఇవన్నీ చూస్తుంటే ఆవేదన, బాధ కలుగుతోంద‌న్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ పైనా దాడి చేశార‌ని, ప్రకాశం జిల్లా కొండపి ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామి పైనా దౌర్జన్యానికి పాల్పడ్డార‌ని ఆవేదన వ్యక్తం చేశారు. అనంత‌రం ఆయ‌న తాడిపత్రి నుంచి బత్తలపల్లికి చేరుకుని మే 31న హత్యకు గురైన తెదేపా కార్యకర్త గుల్ల రాజు కుటుంబాన్ని పరామర్శించారు. అంతకుముందు కడప విమానాశ్రయంలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కార్యకర్తలను కాపాడుకోవడానికి ఎలాంటి పోరాటానికైనా సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించారు. వైకాపా నేతలు చేస్తున్న దాడులను ఖండిస్తున్నట్టు చెప్పారు. తెదేపాకు సహకరించిన ప్రజలపై కూడా వైకాపా దాడులు చేస్తోందన్నారు. ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు మీడియాపైనా దాడులకు దిగి పత్రికా స్వేచ్ఛను హరిస్తున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. రాజకీయాల్లో గెలుపోటములు సర్వసాధారణమని, దాడులు చేయడం మంచి పద్ధతి కాదని చంద్రబాబు హితవు పలికారు.

Just In...