Published On: Tue, Mar 12th, 2019

తాగునీటికి ఇబ్బంది లేకుండా అవసరమైన చర్య‌లు చేప‌ట్టాలి

* వేసవి దృష్ట్యా రాష్ట్రంలో ఎక్కడా ఇబ్బంది లేకుండా చూడండి

* నీటి ఎద్దడి ప్రాంతాల్లో ట్యాంకర్లు ద్వారా నీటిని అందించాలి

* అంటువ్యాధులు ప్రభలకుండా చర్యలు తీసుకోవాలి

* పశుగ్రాసం, తాగునీరు అందక మూగ‌జీవాలు మృతి చెంద‌కూండా చూడాలి  

* ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌చంద్ర పునేఠ

సెల్ఐటి న్యూస్‌, అమరావతి: ప్రస్తుత వేసవి దృష్ట్యా రాష్ట్రంలో ఎక్కడా తాగునీటికి ఇబ్బంది రాకుండా అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌చంద్ర పునేఠ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం అమరావతి సచివాలయం నుండి వేసవి కార్యాచరణ ప్రణాళిక కింద తాగునీరు, పశుగ్రాసం, విద్యుత్ సరఫరా, వైద్య ఆరోగ్యం, వ్యవసాయ, ఉద్యానవనం, ఉపాధి కల్పన అంశాలపై జిల్లా కలక్టర్లతో దృశ్య శ్రవణ (వీడియో) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఎక్కడా తాగునీటికి ఇబ్బంది లేకుండా అవసరమైన కార్యచరణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాయలసీమ జిల్లాలతో పాటు తాగునీటికి ఇబ్బంది ఉన్న ప్రాంతాలకు ట్యాంకరుల ద్వారా ప్రతిరోజు నీటిని సరఫరా చేయాలని చెప్పారు. అలాగే పశుగ్రాసం, తాగునీటి సమస్యతో రాష్ట్రంలో ఎక్కడా ఒక్క పశువు కూడా చనిపోడానికి వీలులేదని అవసరమైన కార్యాచరణ ప్రణాళికతో తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా తాగునీరు, పారిశుద్ధ్య లోపంతో డయేరియా, అతిసార‌ర వంటి వివిధ అంటువ్యాధులు ప్రభలకుండా తగిన చర్యలు చేపట్టాలని సిఎస్ ఆదేశించారు. ఎండలు అధికం అయినప్పుడు వడదెబ్బ తినకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలను ముందుగానే అప్రమత్తం చేసేందుకు తగిన ప్రచారం చేయాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను, కలెక్టర్లను సిఎస్ ఆదేశించారు.
  వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండ్య మాట్లాడుతూ గత ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో 99.8శాతం మంది చిన్నారులకు అనగా 54లక్షల మందికి పోలియో చుక్కలు వేయించడం జరిగిందని వివరించారు. వడదెబ్బల నుండి ఉపశమనం పొందేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామ‌న్నారు. బస్సులు, రైల్వే స్టేషన్లు, సంతలు జరిగే ప్రాంతాలు జనసామ‌ర్థ్యం అధికంగా ఉండే ప్రాంతాలు, కూడళ్లలో అవసరమైన చలివేంద్రాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. తాగునీటి సంబంధిత వ్యాధులు ప్రభలకుండా గ్రామం, వార్డు వారీ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు.
మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికల వలవన్ మాట్లాడుతూ రాష్ట్రంలో 12 పట్టణాల్లో రెండు రోజులకు ఒకసారి మంచినీటిని సరఫరా చేయడం జరుగుతోందని మిగతా అన్ని పట్టణాల్లో రోజూ నీటిని సరఫరా చేస్తున్నట్టు తెలిపారు. నీటికి ఇబ్బంది గల ప్రాంతాలకు ట్యాంకర్లు ద్వారా నీటిని సరఫరా చేస్తున్నామన్నారు. పట్టణాల్లో నీటి సరఫరాకు రూ.133 కోట్లు అవసరం ఉందని చెప్పగా ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి యం.రవిచంద్ర స్పందించి మున్సిపాలిటీల్లోని 35శాతం జనరల్ ఫండ్ నిధులను ఖర్చు చేయాలని ఆతదుపరి అవసరమైన నిధులు ప్రభుత్వం సమకూరుస్తుందన్నారు. పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో నీటి ఎద్దడి అధికంగా ఉండే అనంతపురం, చిత్తూర్, నెల్లూరు, ప్రకాశం, కడప తదితర జిల్లాల్లోని 1970 ఆవాసాల్లో రోజూ ట్యాంకర్ల ద్వారా మంచినీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.
రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కమీషనర్ వరప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో 257 మండలాలను కరువు మండలాలుగా ఇప్పటికే ప్రకటించగా మరో 90 మండలాలకు సంబంధించి జిల్లా కలక్టర్ల నుండి ప్రతిపాదనలు రాగా వాటిలో నిబంధనల ప్రకారం 10మండలాలు కరువు మండలాలుగా ప్రకటించేందుకు అర్హతకలిగి ఉండగా మిగతా 80 మండలాలకు సంబంధించి కలక్టర్ల నుండి అదనపు సమాచారం అడిగామని తెలిపారు.కేంద్ర ప్రభుత్వం ఎన్డిఆర్ఎఫ్ గ్రాంటు కింద రాష్ట్రానికి రూ.900 కోట్లు ఇస్తామని ప్రకటించగా ఇప్పటికే రూ.412 కోట్లు విడుదల చేసంద‌ని, మిగతా నిధులు ఏప్రిల్ నెలలో ఇవ్వనుందని తెలిపారు.
90 శాతం యుసిలు సమర్పించిన గుంటూరు, అనంతపురం కలక్టర్లకు సిఎస్ ప్రశంస
రాష్ట్రంలో గత నాలుగేళ్లలో తాగునీటి అవసరాలకై రూ.453 కోట్లు నిధులు విడుదల చేయగా వాటికి ఇంకా 60శాతం నిధులకు వినియోగపత్రాలు రావాల్సి ఉందని ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి రవిచంద్ర సిఎస్ దృష్టికి తెచ్చారు. దానిపై సిఎస్ అనిల్‌చంద్ర పునేఠ స్పందించి వెంటనే యుసిలు సమర్పించాలని అందరు జిల్లా కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ప్రకాశం జిల్లాకు రూ.151 కోట్లు విడుదల చేస్తే రూ.100 కోట్లకు యుసిలు రాలేదని, కడప, శ్రీకాకుళం, కర్నూల్ జిల్లాల నుండి అసలు యుసిలే రాలేదేన్నారు. గుంటూరు, అనంతపురం జిల్లాలు 90 శాతం యుసిలు సమర్పించారని చెప్పగా ఆ రెండు జిల్లాల కలెక్టర్లను సిఎస్ ప్రత్యేకంగా అభినందించారు. సమావేశంలో వ్యవసాయ, ఉద్యానవన కార్యాచరణ ప్రణాళికలపై సిఎస్ సమీక్షించారు. రాష్ట్ర పశుసంవర్ధక శాఖ కార్యదర్శి శ్రీధర్, సాదారణ పరిపాలన శాఖ కార్యదర్శి ఎన్.శ్రీకాంత్, తదితర అధికారులు పాల్గొన్నారు.

Just In...