Published On: Thu, Jul 11th, 2019

తాగునీటి అవ‌స‌రాల‌కు నియోజకవర్గానికి రూ.కోటి ఇస్తాం..

* పాడి రైతులకు పాలపై లీటరుకు రూ.4 పెంచుతాం

* గ‌త ప్ర‌భుత్వం పెట్టుబ‌డి రాయితీని ఎగ్గొట్టి రైతుల‌ను మోసం చేసింది

* శాసనసభలో కరవుపై ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి

సెల్ఐటి న్యూస్‌, అమరావతి: రాష్ట్రంలోని ప్ర‌తి ఒక్క ఎమ్మెల్యే వారి నియోజవర్గాల్లో పర్యటించి నీటి ఎద్దడి తెలుసుకోవాలని ఏపి సీఎం వైఎస్ జగన్మోహ‌న్‌రెడ్డి సూచించారు.రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్థితులపై గురువారం బ‌డ్జెట్ స‌మావేశాల ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ శాసనసభలో ప్రకటన చేశారు. తాగునీటి సమస్య తక్షణ పరిష్కారానికి ప్రతి నియోజకవర్గానికి రూ.కోటి కేటాయిస్తున్నట్లు చెప్పారు. ‘‘ ప్రతి పక్షంలో ఉన్న ఎమ్మెల్యేలకు కూడా రూ.కోటి ఇస్తాం. దీనిని సీఎం అభివృద్ధి నిధి నుంచే కేటాయిస్తాం. తాగునీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలని ఎమ్మెల్యేలను కోరుతున్నా’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. గత ప్రభుత్వం రూ.2300 కోట్ల పెట్టుబడి రాయితీని ఎగ్గొట్టి రైతులను మోసం చేసిందని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ ఆరోపించారు. పంట నష్టపోయిన రైతులకు సహాయం రూపంలో గతంలో ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. విత్తనాల సేకరణ కూడా చేయలేని పరిస్థితి గత ప్రభుత్వ హయాంలో ఏర్పడిందని మండిపడ్డారు. నవంబర్‌లోనే విత్తనాల సేకరణ ప్రారంభమై ఏప్రిల్‌కు పూర్తికావాలని, వైకాపా ప్రభుత్వం వచ్చేనాటికి విత్తన సేకరణ పూర్తయి పంపిణీ జరుగుతుండాలని అన్నారు. కానీ, కేవలం 50 క్వింటాళ్ల విత్తనాలు మాత్రమే అందుబాటులోకి వచ్చాయని జగన్‌ పేర్కొన్నారు. అధికారులు లేఖలు రాసినా నిధులు ఇవ్వలేదని, గత ప్రభుత్వం స్పందించలేదని అధికారులు చెబుతుంటే బాధగా ఉందని సీఎం అన్నారు. పాడి రైతులకు పాలపై లీటరుకు రూ.4 పెంచుతామని జగన్‌ చెప్పారు.
‘‘ గతేడాది కొనుగోలు చేసిన ధాన్యానికి కూడా రైతులకు బకాయిలు పెట్టారు. గత ఐదేళ్లలో రుణాల రీషెడ్యూల్‌, వడ్డీ చెల్లింపుల మాఫీపై ఆలోచన చేయలేదు. వ్యవసాయ రుణాలు రూ.87,612 కోట్లు మాఫీ చేస్తామని ఎన్నికలకు ముందు చెప్పారు. కానీ, అది ప్రకటనలకే పరిమితమైంది’’ అని జగన్‌ ఎద్దేవా చేశారు. ప్రస్తుత ప్రభుత్వం రైతులకు ఏం చేయబోతోందో సభ ముందు ఉంచుతున్నామన్నారు. ‘‘ సాధారణంగా ఖరీఫ్‌లో 42 లక్షల హెక్టార్లలో పంటలు పండుతాయి. జులై రెండో వారం వచ్చినా ఇప్పటికీ విత్తనం వేయని పరిస్థితి ఏర్పడింది. రైతు సమస్యలను సమర్థంగా ఎదుర్కొనేందుకు మరిన్ని చర్యలు చేపడతాం. మేం అధికారంలోకి వచ్చి కేవలం 45 రోజులు మాత్రమే అయ్యింది. స్వల్ప వ్యవధిలోనే రైతు సమస్యల పరిష్కారంపై దృష్టి పెడుతున్నాం’’ అని జగన్‌ శాసనసభలో చెప్పారు. ‘‘ పంటరుణాలు తీసుకున్న రైతులు గడువులోగా చెల్లిస్తే వడ్డీ ఉండదు. వడ్డీ వ్యాపారుల నుంచి రైతులను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. 60 శాతం ఫీడర్లలో రైతులకు పగటిపూట 9 గంటల విద్యుత్‌ ఇస్తున్నాం. వచ్చే జూన్‌ నాటికి 40 శాతం ఫీడర్లలో పగటిపూటే 9 గంటల విద్యుత్తు ఉంటుంది. 40 శాతం ఫీడర్లలో 9 గంటల విద్యుత్తు సరఫరాకు రూ.1700 కోట్లు ఖర్చు చేస్తున్నాం. వైఎస్‌ఆర్‌ ఉచిత పంటల బీమా పథకం తీసుకొచ్చాం. 55 లక్షల మంది రైతుల కోసం రూ.2,604 కోట్ల బీమాను ప్రభుత్వమే చెల్లిస్తుంది. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తున్నాం. ఆయిల్‌పామ్‌ రైతులకు అదనపు మద్దతు ధర కల్పిస్తూ రూ.80 కోట్లు విడుదల చేస్తాం. దీని ద్వారా 1.1లక్షల మంది రైతులకు లబ్ధి కలుగుతుంది’’ అని సీఎం అన్నారు. పొగాకు ధరలు పడిపోతున్న సమయంలో వెంటనే స్పందించామని, వ్యవసాయ మంత్రి అక్కడికి వెళ్లి బోర్డు అధికారులు, రైతులతో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దారని జగన్‌ చెప్పారు. ‘‘ మార్కెట్‌ కమిటీలకు ఇకపై ఎమ్మెల్యేలనే గౌరవ ఛైర్మన్లుగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నాం. ప్రతి జిల్లాలోనూ వివిధ పంటలకు ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. గత ప్రభుత్వం చెల్లించకుండా ఉంచిన పెట్టుబడి రాయితీ రూ.2 వేల కోట్లను త్వరలోనే చెల్లిస్తాం. వ్యవసాయ మిషన్‌లో రైతులు, శాస్త్రవేత్తలు అందరూ ఉన్నారు. ప్రమాదంలో రైతు మరణిస్తే గతంలో పట్టించుకున్న దాఖలాలు లేవు. కానీ, ఇప్పుడు మాత్రం ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.7 లక్షలు ఇస్తాం’’ అని జగన్ పేర్కొన్నారు.

Just In...