Published On: Wed, Apr 17th, 2019

తాగునీటి పంపిణీకే మొదటి ప్రాధాన్యత

* ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆదేశం

* తాగునీటి ఫిర్యాదులపై తక్షణమే స్పందించండి

* తాగునీటి అవసరాలకు రూ.105 కోట్లు: ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రవిచంద్ర

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: వేసవి దృష్ట్యా తాగునీటి పంపిణీకే మొదటి ప్రాధాన్య అంశంగా అధికారులు పనిచేయాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆదేశించారు. పశువులకూ పశుగ్రాసం, తాగునీటి కల్పనకు చర్యలు తీసుకోవాలన్నారు. తాగునీటి సరఫరాపై వచ్చే ఫిర్యాదులకు తక్షణమే స్పందించాలని, ఇందుకోసం ప్రతి రోజూ సమీక్షలు నిర్వహించుకోవాలని స్పష్టం చేశారు. సచివాలయంలోని తన కార్యాలయంలో తాగునీరు, పశుగ్రాసం పంపిణీకి రూపొందించిన సమ్మర్ యాక్షన్ ప్లాన్ పై బుధవారం సీఎస్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ముందుగా రాష్ట్రంలో భూగర్భ జలాలు, వర్షాభావ పరిస్థితుల గురించి రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి కెఎస్.జవహర్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా సీఎస్‌కు వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి కల్పనకు తీసుకుంటున్న చర్యలు వివరించారు. వేసవి అవసరాల దృష్ట్యా ఆర్థిక శాఖ నుంచి నిధులు రావాల్సి ఉందన్నారు. జలవాణి పేరుతో టోల్ ఫ్రీ నెంబరు 18004251899 రాష్ట్ర ప్రజలకు అందుబాటులో ఉంచామని, తాగునీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తితే ఆ నెంబరుకు ఫోన్ చేస్తే తక్షణమే సమస్యను పరిష్కరిస్తున్నామని సీఎస్‌కు జవహర్ వివరించారు. గ్రామాల్లో పశువులకు తాగునీరు, పశుగ్రాసం అందించడానికి తీసుకుంటున్న చర్యలను సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యానికి రాష్ట్ర పశు సంవర్ధక శాఖ కార్యదర్శి బి.శ్రీధర్ వివరించారు. రాష్ట్రంలో ఉన్న పశువులకు 25.70 లక్షల మెట్రిక్ టన్నుల పశు గ్రాసం అవసరముందని, ప్రస్తుతం 24.21 లక్షల మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉందని, మరో 1.49 లక్షల మెట్రిక్ టన్నులు కావాల్సి ఉందని తెలిపారు. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కార్యదర్శి వరప్రసాద్ మాట్లాడుతూ, సమ్మర్ యాక్షన్ ప్లాన్ లో భాగంగాః పట్టణాలకు రూ.77.34 కోట్లు, గ్రామీణ ప్రాంతాలకు రూ.100 కోట్లు అవసరమని తెలిపారు.
రూ.105 కోట్లు విడుదల…
రాష్ట్రంలో తాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన యూసీలు ఎప్పటికప్పుడు అందజేస్తేనే నిధులు మంజూరు చేస్తామని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రవిచంద్ర స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి అవసరాలు నిమిత్తం రూ.100 కోట్లు, పట్టణాలకు రూ.5 కోట్లు ఈ నెల 16వ తేదీన విడుదల చేశామన్నారు.
యూసీల ఇవ్వడంలో నిర్లక్ష్యం చూపొద్దు…
ప్రస్తుతం రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయని, సమ్మర్ యాక్షన్ ప్లాన్ లో భాగంగా మనుష్యులకు, పశువులకు తాగునీటి పంపిణీ చేయడంలో ఎంతో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం స్పష్టంచేశారు. ఇందుకోసం జిల్లా, డివిజన్ స్థాయిలో ప్రత్యేక పర్యవేక్షణ, రోజువారీ సమీక్షలు చేయాలన్నారు. జలవాణి టోల్ ఫ్రీ ద్వారా రోజుకు ఎన్ని ఫిర్యాదు వస్తున్నాయని సీఎస్ అడిగి తెలుసుకున్నారు. రోజుకు ఎన్ని కాల్స్ వస్తున్నాయి…వాటిపై తీసుకున్న చర్యలు ఏమిటి? అనే దానిపై రోజువారీ నివేదికలు రూపొందించి ఏరోజుకారోజు తనకు, గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి శాఖల ప్రిన్సిపల్ కార్యదర్శులకు అందజేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తాగునీటి సరఫరాపై వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలన్నారు. గ్రామాలు, పట్టణాల్లో బోర్ల మెకానిక్ లను అందుబాటులో ఉంచాలన్నారు. తాగునీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలన్నారు. ముఖ్యంగా, జాతీయ ఉపాధి హామీ పనులు జరిగే చోట, నీడనిచ్చే టెంట్లతో పాటు తాగునీరు కూడా కూలీలకు అందుబాటులో ఉంచాలన్నారు. కేంద్రం నుంచి నిధులు రాబట్టాలని, ఇందుకోసం ఎప్పటికప్పుడు యూసీలు అందజేయాలని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ అధికారులను సీఎస్ ఆదేశించారు. ప్రస్తుతం వేసవి కాలం దృష్ట్యా తాగునీటి సరఫరాకే మొదటి ప్రాధాన్య అంశంగా పనిచేయాలని అధికారులకు ఆయన స్పష్టం చేశారు. ఎన్నికలు ముగిసినందున అధికారులంతా తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పశువులకు పశుగ్రాసంతో పాటు తాగునీటిని కూడా అందించాలన్నారు. నీటి తొట్టెలను ఎండల్లో కాకుండా నీడ ఉండే చోట్ల ఏర్పాటు చేయాలన్నారు. తాగునీటి పంపిణీకి అవసరమైన నిధులను త్వరితంగా మంజూరు చేయాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రవిచంద్రను సీఎస్ ఆదేశించారు. సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికల వలవన్, రూరల్ వర్క్స్ ఇంజనీర్ చీఫ్ భరత్ గుప్తా, పట్టణ, గ్రామీణాభివృద్ధి, పశుసంవర్ధక శాఖాధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Just In...