Published On: Wed, Nov 14th, 2018

తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలి

* ఆరు నెలలకోసారి తాగునీటి పథకాల పనితీరును పర్యవేక్షించాలి

* విపత్తుల సమయంలో ఉపయోగపడే చేతిపంపులు సక్రమంగా పనిచేసేలా చూడాలి

* క్రిష్ణా జిల్లాలో కిసాన్ రాజా పైలట్ ప్రాజెక్ట్ త్వరిగతిన పూర్తి చేయాలి

* జలవాణికి వచ్చిన పెండింగ్ ఫిర్యాదులు 15 రోజుల్లో పరిష్కరించాలి

* ఆర్‌డబ్ల్యుఎస్ సమీక్షలో మంత్రి నారా లోకేష్ 

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: గ్రామాలలో తాగునీటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ అధికారులకు ఆదేశించారు. సచివాలయంలోని తన చాంబర్‌లో బుధవారం గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ర్టవ్యాప్తంగా ఉన్న 49,355 తాగునీటి పథకాలు, 2 లక్షలకు పైగా ఉన్న చేతి పంపులను ఆరు నెలలకోసారి తప్పనిసరిగా పర్యవేక్షించాలని మంత్రి సూచించారు. ఇప్పటి వరకూ 35,183 తాగునీటి పథకాలు పర్యవేక్షణ పూర్తి అయ్యిందని అధికారులు మంత్రికి వివరించారు. నీటి లభ్యత లేకపోవడం వలన 876 తాగునీటి పథకాలు పనిచేయడం లేదని మంత్రి దృష్టికి తీసుకురాగా, 15 రోజుల్లోగా వీటిని పనిచేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి స్పష్టం చేశారు. విపత్తుల సమయంలో చేతిపంపులే గ్రామాల తాగునీటి అవసరాలకు ఉపయోగపడుతున్నాయని, చేతిపంపులు సక్రమంగా పనిచేసేలా పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలన్నారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న 3322 తాగునీటి పథకాల్లో 2197 పూర్తి అయ్యాయని అధికారులు వివరించారు. నూతన పథకాలు ఏర్పాటు చేయక ముందే శాస్త్రీయ పద్దతిలో నీటి లభ్యత పై పూర్తి స్థాయి అంచనా సిద్దం అయిన తరువాత మాత్రమే పనులు ప్రారంభించాలని మంత్రి సూచించారు. తాగునీటి పథకాల పనితీరు రియల్ టైంలో తెలుసుకునే విధంగా కిసాన్ రాజా యాప్ ద్వారా పర్యవేక్షణ చెయ్యాలన్నారు. కృష్ణా జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ కింద  తాగునీటి పథకాలకు కిసాన్ రాజా పరికరాలు త్వరితగతిన అమర్చాలని సూచించారు. రాష్ట్రంలో ఉన్న 100 పెద్ద మల్టీ విలేజ్ స్కీమ్స్ లో ల్యాబ్స్ ద్వారా కాకుండా సెన్సార్ల ద్వారా నీటి నాణ్యత రియల్ టైం లో తెలుసుకునే వ్యవస్థ ఏర్పాటు చెయ్యాలని మంత్రి సూచించారు. తీర ప్రాంతంలో ఉన్న అన్ని తాగునీటి పథకాలకు జనరేటర్లు ఏర్పాటు చేయాలన్నారు.  గ్రామాల్లో ఉన్న 738 ఓవర్ హెడ్ టాంక్ లలో 365 ఓవర్ హెడ్ టాంక్ ల మరమ్మతులు పూర్తి అయ్యాయని అధికారులు వివరించారు. మిగిలినవి త్వరలో పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. ఎన్టీఆర్ సుజల ఫేజ్  2 కార్యక్రమంలో భాగంగా 103 క్లస్టర్లు ఏర్పాటు చేయాలని, 221 కోట్ల తో 103 మదర్ ప్లాంట్లు, 2655 రూరల్ డిస్పెన్సింగ్ యూనిట్స్ ఏర్పాటు చెయ్యాలని సూచించారు. ప్రకాశం జిల్లా కనిగిరి లో 86 నివాస ప్రాంతాలకు తాగునీరు అందించేందుకు ఉద్దేశించిన పథకం పనులు వెంటనే ప్రారంభించి 2019 మార్చిలోగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. తాగునీటి కొరత ఉన్న జిల్లాల్లో ట్యాంకర్ల ద్వారా సరఫరా చెయ్యాలని, అవసరమైతే ట్యాంకర్ల సంఖ్య,ట్రిప్పుల సంఖ్య పెంచాలని మంత్రి స్పష్టం చేశారు. గ్రామాల్లో ఏర్పాటు చేసిన పశువుల తొట్టెలలో క్రమం తప్పకుండా తాగునీటిని నింపాలన్నారు.  తాగునీటి సమస్య ఉన్న వెయ్యి నివాస ప్రాంతాలలో సమస్య పరిష్కారానికి  ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.  జలవాణి కాల్ సెంటర్ కి వచ్చిన 24 వేల ఫిర్యాదులలో 13,511 ఫిర్యాదులు ఇప్పటికే పరిష్కరించామని, 7482 ఫిర్యాదుల పరిష్కారం వివిధ స్థాయిల్లో ఉన్నాయని అధికారులు వివరించారు. పెండింగ్ ఫిర్యాదులను 15 రోజుల్లో పరిష్కరించాలని మంత్రి స్పష్టం చేశారు. గ్రామీణ నీటి సరఫరా విభాగం ఆధ్వర్యంలో 30 గ్రామాల్లో జరుగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు మూడు నెలల్లో పూర్తి చెయ్యాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రిన్సిపల్ సెక్రటరీ జవహర్ రెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి శ్రీధర్, వాటర్ గ్రిడ్ ఎండి భరత్ గుప్తా, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Just In...