Published On: Sun, Jun 23rd, 2019

తితిదే ఛైర్మన్‌గా వైవి సుబ్బారెడ్డి ప్రమాణ స్వీకారం

సెల్ఐటి న్యూస్‌, తిరుమ‌ల‌: టిటిడి ధర్మకర్తల మండలి 50వ అధ్య‌క్షునిగా వైవి.సుబ్బారెడ్డి శనివారం ప్రమాణస్వీకారం చేశారు. శ్రీవారి ఆలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో టిటిడి ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్ ఆయ‌న‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. ముందుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా శ్రీ‌వారి ఆల‌యంలోకి ప్ర‌వేశించారు. ఉద‌యం 11.47 గంట‌ల‌కు ప్రమాణ స్వీకారం అనంతరం వైవి.సుబ్బారెడ్డి కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి శ్రీవారిని దర్శించుకున్నారు. అనంత‌రం వకుళామాత, విమాన వేంకటేశ్వరస్వామి, సబేరా, భాష్యకార్ల సన్నిధి, యోగ నరసింహస్వామివారిని దర్శించుకుని హుండీలో కానుకలు చెల్లించారు. రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. టిటిడి ఈవో, జెఈవోలు క‌లిసి శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటం అందించారు. ఈ సంద‌ర్భంగా వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యానికి సంబంధించి ఆగ‌మ‌శాస్త్రాలు, సంప్ర‌దాయాలు, నియ‌మాల‌ను గౌర‌విస్తూ తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థాన‌ముల ప్ర‌తిష్ట‌ను ప్ర‌పంచ‌వ్యాప్తంగా మ‌రింత పెంచేలా చ‌ర్య‌లు చేప‌డ‌తామ‌ని వెల్లడించారు. తిరుమల శ్రీవారి ఆలయంలో శనివారం ప్రమాణస్వీకారం అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ సాక్షాత్తు శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి కృప వ‌ల్లే త‌న‌కు టిటిడి ఛైర్మన్‌గా భక్తులకు సేవలందించే అవకాశం వ‌చ్చింద‌న్నారు. ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. భ‌క్తుల‌కు త్వ‌రిత‌గ‌తిన శ్రీ‌వారి ద‌ర్శ‌నం చేయించేందుకు, అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా వ‌స‌తి క‌ల్పించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని వివ‌రించారు. తిరుమ‌ల‌కు నీటి స‌మ‌స్య లేకుండా ముఖ్య‌మంత్రితో చ‌ర్చించి శాశ్వ‌త ప‌రిష్కారం క‌నుగొంటామ‌న్నారు. టిటిడి ఉద్యోగులు, స్థానికుల స‌మ‌స్య‌ల‌ను ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లిలో చ‌ర్చించి ప‌రిష్క‌రిస్తామ‌న్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉప‌ముఖ్య‌మంత్రి నారాయ‌ణ‌స్వామి, శాసనమండలి చీఫ్‌విప్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి, ఎమ్మెల్యేలు బి.క‌రుణాక‌ర్‌రెడ్డి,  శ్రీకాంత్‌రెడ్డి, రవీంద్రనాథ్‌రెడ్డి, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, సినీ నిర్మాత దిల్‌రాజు, పాలక మండలి మాజీ సభ్యుడు రౌతు సూర్యప్రకాశరావు, టిటిడి తిరుమల జెఈవో కె.ఎస్‌.శ్రీనివాసరాజు, తిరుపతి జెఈవో బి.ల‌క్ష్మీకాంతం, సివిఎస్‌వో గోపినాథ్‌జెట్టి ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

   

Just In...