Published On: Wed, Jun 19th, 2019

తితిదే ఛైర్మన్‌ పదవికి పుట్టా రాజీనామా!

సెల్ఐటి న్యూస్‌, తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఛైర్మన్‌ పదవికి ఎట్ట‌కేల‌కు పుట్టా సుధాకర్‌ యాదవ్‌ రాజీనామా చేశారు. ఈ సంద‌ర్భంగా పుట్టా సుధాక‌ర్ యాద‌వ్ బుధ‌వారం పుట్టా తన రాజీనామా లేఖను తితిదే ఈవో అనిల్‌ సింఘాల్‌కు అందజేశారు. మరోవైపు తితిదే కొత్త ఛైర్మన్‌గా వైకాపా సీనియర్‌ నేత, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డిని ప్రభుత్వం నియమించిన సంగ‌డ‌తి విధిత‌మే. సుబ్బారెడ్డి శనివారం బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించి ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులు వెలువడలేదు. మరోవైపు పుట్టా రాజీనామాపై సుబ్బారెడ్డి స్పందించారు. ఆయన రాజీనామా చేసినట్లు సీఎం కార్యాలయానికి సమాచారం వచ్చిందన్నారు. తితిదే ఛైర్మన్‌గా బాధ్యతల చేపట్టే విషయంలో సీఎం జగన్‌ ఎప్పుడు తీసుకోమంటే అప్పుడే తీసుకుంటానని చెప్పారు. శనివారం మంచి రోజు అని సలహాలు, సూచనలు వచ్చాయని.. సీఎం ఆదేశాల ప్రకారం బాధ్యతలు చేపడతానని సుబ్బారెడ్డి తెలిపారు. తితిదే ధర్మకర్తల మండలిలో ఛైర్మన్‌ సహా 16 మంది సభ్యులుండగా.. వారిలో 10 మంది ఇప్పటికే రాజీనామా చేశారు. తాజాగా పుట్టా రాజీనామాతో పాలకమండలి రద్దయినట్లైంది. మరోవైపు తిరుపతిలోని స్విమ్స్‌ ఆస్పత్రిలో సిబ్బంది నియామకాల విషయంలో తితిదే ఛైర్మన్‌ పుట్టా సుధాకర్‌ యాదవ్‌పై ఆరోపణలు వచ్చాయి. నిబంధనలకు విరుద్ధంగా తితిదే ఛైర్మన్‌ తనపై ఒత్తిడి తెస్తున్నారంటూ స్విమ్స్‌ డైరెక్టర్‌.. ఈవో అనిల్‌ సింఘాల్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై ఈవో ప్రభుత్వానికి నివేదిక పంపారు. దీనిపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోనప్పటికీ.. ఆర్డినెన్స్‌ తీసుకొచ్చి తితిదే పాలక మండలిని రద్దు చేయాలని భావిస్తున్నట్లు ఊహాగానాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పుట్టా రాజీనామా చేయడంతో కొత్త ఛైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డిని నియమించినట్లు సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. దీంతో పాటు పాలక మండలి సభ్యులను ఎంపిక చేయాల్సి ఉంది. ఆ తర్వాత ఛైర్మన్‌తో పాటు సభ్యులంతా ఒకేసారి ప్రమాణస్వీకారం చేయడం ద్వారా కొత్త పాలకమండలి కొలువుదీరనుంది.

Just In...