Published On: Wed, Oct 31st, 2018

తిత్లీకి కేంద్ర సాయం రూ.229 కోట్లు విడుదల

సెల్ఐటి న్యూస్‌, అమరావతి: రాష్ట్రంలోని తిత్లీ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలకు కేంద్ర ప్రభుత్వం రూ.229 కోట్ల నిధులు బుధ‌వారం విడుదల చేసింది. కేంద్ర విపత్తు సహాయనిధి నుంచి రాష్ట్ర విపత్తు సహాయనిధికి ఈ నిధులు వచ్చాయి. రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ద్వారా నిధులను ఖర్చు చేసేందుకు కేంద్రం అవకాశమిచ్చింది. తుపాను ధాటికి నష్టపోయిన ప్రాంతాల్లో కేంద్ర బృందాలు పర్యటించాయని, వారిచ్చిన నివేదిక ఆధారంగా మరిన్ని నిధుల విడుదలకు అవకాశమున్నట్లు కేంద్ర హోంమంత్రిత్వశాఖ వెల్లడించింది. తిత్లీ తుపాను ప్రభావం శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలపై పడింది. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం ప్రాంతంలో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కొబ్బరి, జీడి, మామిడి, అరటి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. తుపాను బాధితులకు తక్షణ సాయంగా రూ.1200 కోట్లు విడుదల చేయాలని సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాసిన విషయం తెలిసిందే.

Just In...