Published On: Tue, Dec 4th, 2018

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల ప్రత్యేక వ్యాసం

* సిరులతల్లి శ్రీ అలమేలుమంగ అవతరణ

సెల్ఐటి న్యూస్‌, ఆధ్యాత్మికం: సిరులతల్లి శ్రీ మహాలక్ష్మి తిరుచానూరులో శ్రీ అలమేలుమంగగా కార్తికమాసంలో శుక్ల పంచమీ శుక్రవారం, ఉత్తరాషాడా నక్షత్రం, విజయలగ్నంలో శ్రీనివాసుని ఎదుట పద్మసరోవరంలో సహస్రదాళాలు కలిగిన బంగారుపద్మంలో అవతరించింది. బంగారు పద్మంలో పద్మాసనియై పద్మహస్తగా పద్మమూలాలంకృత అయిన నిత్య యౌవన శోభితురాలైన శ్రీ మహాలక్ష్మి, పదహారేళ్ల నవయువతిగా అవతరించింది. బంగారు వర్ణంలో ప్రకాశిస్తున్న ‘పద్మావతి’ని బ్రహ్మేంద్రాది దేవతలు, భృగునారద, తుంబురాది మహర్షులు, ముక్కోటి దేవతలు ఎన్నోవిధాలుగా కీర్తిస్తూ, స్తుతించారు. ఆనాటి నుండి శ్రీ పద్మావతి అమ్మవారు వెలసిన తిరుచానూరు క్షేత్రంలో ”స్వతంత్ర వీరలక్ష్మీ”గా ప్రసిద్ధి పొందారు. శ్రీ వేంకటేశ్వరస్వామివారు సుదీర్ఘ కాలం తర్వాత తన ఎదుట ప్రత్యక్షమైన శ్రీమహాలక్ష్మిని చూసి ఆనంద పడుతూ తన మెడలోని కల్హారమాలను ఆమె కంఠంలో వేసి, ఆలింగనం చేసుకున్నాడు. అనంతరం అందరికి వరాలను ప్రసాదించే అలమేలుమంగ అదృశ్యమై శ్రీనివాసుని వక్ష:స్థలంలో ”వ్యూహలక్ష్మి”గా ఆవిర్భవించింది. శ్రీవారి వక్షస్థలంలో అమ్మవారు వేంచేసివున్నందున స్వామివారు ‘శ్రీనివాసుడు’గా ప్రసిద్ధి పొందాడు.
                     శ్రీ పద్మావతి అమ్మవారు అవతరించిన కార్తీకశుక్ల పంచమి నాటి సంద‌ర్భాన్ని పురస్కరించుకుని ప్రతిఏటా కలియుగాంతం వరకు అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరుపబడతాయని శ్రీపద్మావతి సమేత శ్రీనివాసుడు వరమిచ్చారు. అందువల్లే ఆనాటినుండి తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారికి ఉత్సవాలు ఎంత వైభవంగా జరుగుతునవో అలాగే అమ్మవారికి అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ దివ్య క్షేత్రంలో శ్రీనివాసుడు లేకుండానే మహారాజ్ఞి అయిన పద్మావతి అమ్మవారికి పాంచరాత్రాగమ పద్ధతిలో ఉత్సవాలు, ఊరేగింపులు జరుగునట్లు బ్రహ్మదేవుడు ఏర్పాట్లు చేసినట్లు పురాణ ప్రాశస్త్యి. అంతేగాక పద్మాసరోవరంలో పద్మావతి అమ్మవారు అవతరించిన నాటికి అవబృథ స్నానం (పచమితీర్థం)తో ముగియనున్నట్లు ఉత్సవాలు నిర్వహిస్తారు. పంచమితీర్థం రోజున తిరుమల క్షేత్రం నుండి శ్రీవారి కంఠంలోని పూలమాల, పసుపుకుంకుమలు, ఆభరణాలు, చీరసారె, పిండివంటలు, తిరుచానూరులోని అలవేలు మంగమ్మకు కానుకగా సమర్పించడం ఆనవాయితీ. సాక్షాత్తు శ్రీనివాసుడు ఏడుకొండలు దిగి వచ్చి తపస్సు చేసిన దివ్యస్థలమైన తిరుచానూరులో బ్రహ్మాది దేవతల కోరిక మేరకు శ్రీ పద్మావతి అమ్మవారు ఈ క్షేత్రంలో ‘అర్చామూర్తి’గా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇక్కడ ఎవరైతే అమ్మవారిని దర్శించుకుని, అర్చిస్తారో వారికి పోగొట్టుకున్న సిరిసంపదలు, పదవులు తిరిగి పొందడమేగాక, ధర్మ అర్థ కామ మోక్షలు, పురుషార్థాలు సిద్ధిస్తాయని స్థల పురాణ ప్రాశస్త్యి. తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు డిసెంబరు 4వ తేదీ నుండి 12వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. ఈ సందర్భంగా ప్రతి రోజు ఉదయం 8.00 నుండి 10.00 గంటల వరకు, రాత్రి 8.00 నుండి 11.00 గంటల వరకు అమ్మవారు వివిధ వాహనాలపై భక్తులకు దర్శనవివ్వనున్నారు. డిసెంబరు 4న ధ్వజారోహణంతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు డిసెంబరు 8న గజవాహనం, డిసెంబరు 9న గరుడవాహనం, డిసెంబరు 11న రథోత్సవము, డిసెంబరు 12వ తేదీ పంచమితీర్థంతో ముగుస్తాయి.

Just In...