Published On: Thu, Jan 9th, 2020

తిరుపతి శ్రీకోదండరామాలయంలో నేడు అష్టోత్తర శతకలశాభిషేకం

సెల్ఐటి న్యూస్‌, తిరుప‌తి: తిరుపతిలోని శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో జనవరి 10వ తేదీ పౌర్ణమి సందర్భంగా అష్టోత్తర శతకలశాభిషేకం వైభవంగా జరుగనుంది. ఆలయంలో ఉదయం 10.30 గంటలకు ఈ సేవ నిర్వహిస్తారు. భక్తులు ఒక్కొక్కరు రూ.50/- చెల్లించి ఈ సేవలో పాల్గొనవచ్చు. అనంతరం సాయంత్రం 5.30 గంటలకు శ్రీ సీత లక్ష్మణ సమేత శ్రీకోదండరామస్వామివారి ఉత్సవమూర్తులను ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు. అక్కడి నుంచి శ్రీరామచంద్ర పుష్కరిణికి తీసుకెళ్లి ఆస్థానం చేపడతారు. ఆ తరువాత పుష్కరిణి హారతి నిర్వహిస్తారు. జనవరి 11న శ్రీకోదండరామాలయంలో కల్యాణోత్సవం. శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో జనవరి 11వ తేదీ స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవం వైభవంగా జరుగనుంది. శ్రీరామచంద్ర మూర్తి జన్మించిన పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలయంలో ఉదయం 11.00 గంటలకు కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. గృహ‌స్తులు(ఇద్దరు) రూ.500/- చెల్లించి టికెట్‌ కొనుగోలుచేసి కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఉత్తరీయం, రవికె, అన్నప్రసాదం బహుమానంగా అందజేస్తారు. అనంతరం సాయంత్రం 5.30 గంటలకు శ్రీసీత లక్ష్మణ సమేత శ్రీకోదండరామస్వామివారి ఉత్సవమూర్తులను ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు.
అక్కడినుంచి శ్రీరామచంద్ర పుష్కరిణికి తీసుకెళ్లి ఊంజల్‌సేవ చేపడతారు.

16న తిరుమలలో శ్రీ‌వారి పార్వేట ఉత్సవం …
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి పార్వేట ఉత్సవం మకర సంక్రాంతి పర్వదినం మరుసటిరోజున కనుమ పండుగనాడైన జనవరి 16న అత్యంత ఘనంగా జరగనుంది. అదేరోజున గోదాపరిణయోత్సవం విశేషంగా నిర్వహిస్తారు. గోదాపరిణయోత్సవం సంద‌ర్భంగా ఉద‌యం 9.00 గంట‌ల‌కు ఆండాళ్ అమ్మ‌వారి మాల‌ల‌ను శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద జీయ్య‌ర్‌స్వామి మ‌ఠం నుండి ఆల‌య నాలుగు మాడ వీధుల‌లో ఊరేగింపుగా శ్రీ‌వారి ఆల‌యానికి తీసుకు వెళ్ళి స్వామివారికి స‌మ‌ర్పిస్తారు. అనంత‌రం మధ్యాహ్నం 1.00 గంటకు శ్రీ మలయప్పస్వామివారు, శ్రీ కృష్ణస్వామివారు పార్వేట మండపానికి వేంచేపు చేస్తారు. అక్కడ ఆస్థానం, పారువేట కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంత‌రం స్వామివారు ఆల‌యానికి చేరుకుంటారు.

ఆర్జితసేవలు రద్దు…
ఈ ఉత్సవాల కారణంగా జనవరి 16న శ్రీవారి ఆలయంలో నిర్వహించే తోమాలసేవ, అర్చన, తిరుప్పావ‌డ‌, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం, వసంతోత్సవం మరియు సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది.

Just In...