Published On: Fri, Jan 4th, 2019

తీరప్రాంత పటిష్ట రక్షణలో వివిధ ఏజెన్సీలు సమన్వయంతో పనిచేయాలి

* సిఎస్ అనీల్‌చంద్ర పునేఠ

సెల్ఐటి న్యూస్‌, అమరావతి: ఆంద్రప్రదేశ్ రాష్ట్ర తీరప్రాంత పటిష్ట రక్షణ విషయంలో తూర్పు నావికాదళంతో పాటు ఇండియన్ కోస్టుగార్డు, మైరన్ పోలీస్, రేవులు, మత్స్య తదితర శాఖలు, ఏజెన్సీలు సమన్వయంతో పనిచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠ సూచించారు.శుక్రవారం అమరావతి సచివాలయంలోని ఆయన కార్యాలయంలో కోస్టల్ సెక్యూరిటీకి సంబంధించి విశాఖపట్నం తూర్పు నావికాదళం నేతృత్వంలో 4వ రాష్ట్రస్థాయి అపెక్స్ కమిటీ సమావేశం సిఎస్ అధ్యక్షతన జరిగింది.ఈసందర్భంగా సిఎస్ మాట్లాడుతూ తీరప్రాంత రక్షణకు సంబంధించి వివిధ శాఖలు,ఏజెన్సీలు పరస్పర సహకారం,సమన్వయంతో పనిచేయడం ద్వారా తీరప్రాంత రక్షణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందుకు సంబంధించి ఏర్పాటు చేసిన అపెక్స్ కమిటీ సమావేశం గత మూడేళ్ల క్రితం జరిగిందని ఈసమావేశం తరచు జరిగితే మంచి ఫలితాలు సాధించేందుకు అవకాశం ఉంటుందని కావున ఇకమీదట ఈసమావేశం మూడు నెలలకు ఒకసారి జరిగేలా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.ఈసమావేశంలో చర్చించిన వివిధ అంశాలపై సంబందిత శాఖలు తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై హోంశాఖ ముఖ్యకార్యదర్శి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నామని ఆకమిటీ ఆయా అంశాలను చర్చించి సకాలంలో చర్యలు తీసుకోవాలని సిఎస్ ఆదేశించారు.ఇందుకు సంబంధించి సంబంధిత శాఖల అధికారులకు వెంటనే లేఖ వ్రాయాలని హోంశాఖ ముఖ్యకార్యదర్శిని ఆదేశించారు. అదేవిధంగా కోస్టల్ సెక్యూరిటీకి సంబంధించి ముఖ్యంగా మత్స్యకారుల బోటుల రిజిస్ట్రేషన్, ఆయా బోటులకు కలర్ కోడింగ్, మత్స్యకారులకు బయోమెట్రిక్ గుర్తింపు కార్డులు జారీ తదితర అంశాలకు సంబంధించి తీరప్రాంత రాష్ట్రాల్లో అనుసరిస్తున్న ఉత్తమ విధానాలను పరిశీలించి మన రాష్ట్రంలో కూడా అమలు చేసేందుకు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని మత్స్యశాఖ కమీషనర్ రామశంకర్ నాయక్ ను సిఎస్ ఆదేశించారు.ఈసమావేశంలో చర్చించిన వివిధ అంశాలపై తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై వారం పది రోజుల్లోగా వివిధ అధికారులతో మరో సమావేశాన్ని ఏర్పాటు చేసి సమీక్షించడం జరుగుతుందని అన్నారు. వివిధ శాఖలు, ఏజన్సీలు అన్ని విధాలా పరిస్పర సహకారం, సమన్వయంతో పనిచేసి తీరప్రాంత రక్షణ విషయంలో పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠ సూచించారు. సమావేశంలో విశాఖపట్నం తూర్పు నావికాదళం ప్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ ఛీప్ విఏడియం కరంబీర్ సింగ్ (పివిఎస్ఎం, ఎవిఎస్ఎం) మాట్లాడుతూ తీరప్రాతం రక్షణకు సంబంధించి వివిధ శాఖలు, ఏజెన్సీలు అన్ని విధాలా తోడ్పాటును అందించాలని కోరారు. బోటుల ఈ-రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పారు. స్థానిక మత్స్యకార కమ్యునిటీతో నిరంతరం సమన్వయం కలిగి వారికి తీర ప్రాంత రక్షణకు సంబంధించిన వివిధ అంశాలపై అవగాహన పెంపొందించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతోందని తెలిపారు. తూర్పు నావికాదళం మరియు ఇండియన్ కోస్టు గార్డు సంయుక్త ఆధ్వర్యంలో కోస్టల్ సెక్యూరిటీ ఎక్సర్సైజులు నిర్వహించడం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 23న సీ విజిల్ కార్యక్రమం జరగునుందని ఆకార్యక్రమంలో సంబంధిత శాఖలు,ఏజెన్సీలు పాల్గొనాల్సిందిగా ఆయన విజ్ణప్తి చేశారు.తీరప్రాతం రక్షణకు తీసుకోవాల్సిన అంశాలపై ప్రజల్లో అవగాహనను పెంపొందించేందుకు వివిధ తీరప్రాంత జిల్లాల్లో కమ్యునిటీ ఇంటరాక్షన్ ప్రోగ్రామ్(సిఐపి)లను నిర్వహించడం జరుగుతోందని తెలిపారు.అన్ని ఓడలకు వెస్సెల్ ట్రాఫికింగ్ మేనేజిమెంట్ సిస్టమ్ ప్రవేశపెట్టడం జరిగిందని,అలాగే అన్ని బోట్లను రిజిష్టర్ చేయడం వాటికి కలర్ కోడింగ్ ఇవ్వడం వంటి చర్యలు చేపట్టడం జరుగుతోందని కరంబీర్ సింగ్ పేర్కొన్నారు.
ఇండియన్ కోస్టుగార్డు డిప్యూటీ కమాండెంట్ శ్వేత రాణా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 974కి.మీల పొడవున సముద్రతీరం ఉందని 31వేల 485 చేపలవేట చేసే బోట్లు ఉన్నాయని తీరం వెంబడి మొత్తం 508 మత్స్యకార గ్రామాలుండగా 353 ల్యాండింగ్ పాయింట్లు ఉన్నాయని పేర్కొన్నారు.కమ్యునిటీ ఇంటరాక్షన్ కార్యక్రమం కింద తీరప్రాంత మత్స్యకార గ్రామాల్లో 2016లో 168 కార్యక్రమాలు,2017లో 184 కార్యక్రమాలు,2018లో నవంబరు వరకు 184 అవగాహనా కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని తెలిపారు.
అనంతరం గత సమావేశంలో చర్చించిన వివిధ అజెండా అంశాలు తీసుకున్న చర్యలపై సమావేశంలో చర్చించారు.తదుపరి ప్రస్తుత సమావేశపు అజెండా వివరాలను తూర్పు నావికాదళ అధికారులు వివరిస్తూ విశాఖపట్నం పోర్టు ట్రస్ట్ రక్షణకు సంబంధించి ప్రస్తుతం పోర్టును ఆనుకుని ఉన్న ఫిషింగ్ హార్బర్ ను వేరే చోటుకి తరలించాల్సిన ఆవశ్యకత,యారాడ కొండపైగల దర్గా,మషీదులను వేరే చోటకి తరలించాల్సిన అంశాలపై సమావేశం దృష్టికి తెచ్చారు.దానిపై సిఎస్ పునేఠ స్పందించి జిల్లా కలక్టర్,మున్సిపల్ కమీషనర్,పోలీస్ కమీషనర్ల సమక్షంలో స్థానికంగా చర్చించి వాటిపై తగిన నిర్ణయం తీసుకోవాల్సిందిగా సూచించారు.అలాగే ఫిషింగ్ బోట్ల మానిటరింగ్,బోట్లకు కలర్ కోడింగ్,బయోమెట్రిక్ గుర్తింపు కార్డులు జారీ ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేయాల్సిన ఆవశ్యకతపై చర్చించారు.అంతేగాక కృష్ణ పట్నం పోర్టు రక్షణ సంబంధిత అంశాలు,రాష్ట్రంలోకి తమిళనాడు మత్స్యకారుల అనధికార ప్రవేశం తదితర అంశాలపై ఈఅపెక్స్ కమిటీ సమావేశంలో చర్చించారు.కోస్టల్ సెక్యురిటీకి సంబంధించి మత్స్యశాఖ, మెరైన్ పోలీస్ తదితర విభాగాల కు సంబంధించి తీసుకుంటున్న చర్యలను ఆయా అధికారులు వివరించారు. సమావేశంలో హోంశాఖ ముఖ్యకార్యదర్శి ఎఆర్ అనురాధ, ఇండియన్ కోస్టుగార్డుకు చెందిన కెప్టెన్ వికాస్ జా, మత్స్యశాఖ కమీషనర్ రామశంకర్ నాయక్, పలువురు తూర్పు నావికాదళ అధికారులు, ఇండియన్ కోస్టుగార్డు అధికారులు, మెరైన్ పోలీస్ విభాగపు అధికారులు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Just In...