Published On: Fri, Nov 30th, 2018

తెదేపాకు మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు రాజీనామా

* నేడు ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌మ‌క్షంలో జ‌న‌సేన‌లోకి

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: మాజీ మంత్రి, ప్రత్తిపాడు ఎమ్మెల్యే రావెల కిషోర్‌బాబు తెదేపాకు గుడ్‌బై చెప్పారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను గుంటూరులోని తెదేపా కార్యాలయానికి తన అనుచరుడి ద్వారా శుక్ర‌వారం పంపించారు. తెదేపా క్రియాశీల సభ్యత్వానికే కాకుండా ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసినట్టు తెదేపా వర్గాలు వెల్లడించాయి. గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్న రావెల జనసేన పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. రైల్వే అధికారి అయిన రావెలకు గత ఎన్నికల్లో తెదేపా అధినేత చంద్రబాబు ప్రత్తిపాడు నుంచి పోటీచేసే అవకాశం కల్పించారు. 2014 ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన రావెల.. అనంతరం అనూహ్యంగా మంత్రి పదవిని దక్కించుకున్నారు. ఈ క్ర‌మంలో ఇటీవ‌ల కాలంలో .. పార్టీలో, నియోజకవర్గంలో ఆయన పనితీరు పట్ల వ్యతిరేకత రావడంతో మంత్రి పదవి నుంచి సీఎం చంద్రబాబు తప్పించారు. నాటి నుంచి రావెల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నప్పటికీ అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. తొలుత ఆయన వైకాపాలో చేరతారంటూ ఊహాగానాలు వచ్చాయి. అయితే.. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహ‌న్‌రెడ్డి నుంచి సరైన స్పందన రాకపోవడంతో జనసేనలో చేరాలని నిశ్చయించుకున్నారు. ఈ మేరకు గత రెండు, మూడు దఫాలుగా పవన్‌తో సమావేశమై చర్చలు కూడా జరిపినట్టు సమాచారం. ఈ క్రమంలోనే ఆయన శుక్రవారం గుంటూరులోని తన అనుచరులతో సమావేశమై తెదేపా, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను తెదేపా కార్యాలయానికి పంపించారు. పవన్‌ కల్యాణ్‌ సమక్షంలో శ‌నివారం ఉద‌యం ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌మ‌క్షంలో ఆయన జనసేన పార్టీలో చేరనున్నారు.

Just In...