Published On: Wed, Feb 13th, 2019

తెదేపాలో ఆమంచిని అన్ని విధాలా ప్రోత్స‌హించాం

* ముఖ్య‌మంత్రిపై తీవ్ర విమర్శలు చేయడం దారుణం

* మంత్రి శిద్దా రాఘవరావు

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తెదేపాను వీడటం వల్ల ఆయనకే నష్టమని, పార్టీకి ఎలాంటి నష్టం లేదని అటవీ శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు అభిప్రాయపడ్డారు. ఈ సంద‌ర్భంగా బుధ‌వారం వెల‌గ‌పూడి స‌చివాల‌యంలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో మంత్రి మాట్లాడుతూ లోటు బడ్జెట్ ఉన్నా అభివృద్ధి ఆగలేదన్నారు. నాలుగున్నర సంవత్సరాల్లో చీరాలలో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని తెలిపారు. సీఎం చంద్రబాబుపై ఆమంచి కృష్ణమోహన్ విమర్శలను ఈ సంద‌ర్భంగా మంత్రి శిద్ధా ఖండించారు. పసుపు కుంకుమ పథకం ద్వారా డ్వాక్రా మహిళలకు రూ.9400 కోట్లు ఇస్తున్నామన్నారు. 2004 నుంచి పదేళ్ల పాటు డ్వాక్రా మహిళలకు కేవలం రూ.40875 కోట్ల రుణం ఇచ్చారని, టీడీపీ అధికారంలోకి వచ్చాక నాలుగున్నర సంవత్సరాల్లో రూ.63,280 కోట్ల రుణాలు ఇచ్చామని మంత్రి తెలిపారు. ఆమంచి కృష్ణమోహన్, గత వారం సీఎం చంద్రబాబుతో చర్చలు జరిపినప్పుడు కూడా పార్టీలోనే కొనసాగుతానని చెప్పారని మంత్రి శిద్ధా తెలిపారు. నాయకులు పార్టీలు మారడం సహజమే అయినా, సీఎంపై తీవ్ర విమర్శలు చేయడాన్ని ఆయన ఖండించారు. చీరాలలో సీఎం చంద్రబాబు నాయుడు ఎవరిని సూచిస్తే వారు టీడీపీ నుంచి పోటీ చేస్తారని మంత్రి శిద్ధా రాఘవరావు స్పష్టం చేశారు.

Just In...