Published On: Tue, Mar 12th, 2019

తెదేపా పాల‌న‌లో బ్రాహ్మ‌ణ సామాజిక‌వ‌ర్గం అణ‌చివేత‌..

* తెదేపా సీనియ‌ర్ నేత ముష్టి శ్రీనివాస్ సంచ‌లన వ్యాఖ్య‌లు

* పార్టీ ప్రాథ‌మిక స‌భ్య‌త్వానికి రాజీనామా

సెల్ఐటి న్యూస్‌, విజయవాడ: తెలుగుదేశం పార్టీలో బ్రహ్మాణులకు జరుగుతున్న అన్యాయంపై టీడీపీ, బ్రహ్మాణ సంఘం నాయకులు ముష్టి శ్రీనివాస్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా మంగ‌ళ‌వారం ఉద‌యం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముష్టి శ్రీనివాస్ మాట్లాడుతూ సీట్ల కేటాయింపులో టీడీపీ బ్రాహ్మాణులకు మొండి చేయ్యి చూపింద‌న్నారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సీట్లు కేటాయింపులో అన్యాయం జరిగింద‌న్నారు. అందుకు నిరసనగా పార్టీలో త‌న ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. వ‌లసదారులకు, భూ కబ్జా నాయకులకు టీడీపీలో సీట్లు ఇస్తున్నార‌ని ఆరోపించారు. దేవాదాయ శాఖలో సైతం ప్రాధాన్యత ఇవ్వటంలేద‌న్నారు. సెంట్రల్ నియోజవర్గంలో త‌మ సామాజికవ‌ర్గం ఓట్లుతోనే అధికారంలోకి వచ్చి మమ్మల్ని విస్మరిస్తున్నార‌ని ఎమ్మెల్యే బొండా ఉమామ‌హేశ్వ‌ర‌రావును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. వైసీపీ, బీజేపీలు సీట్లు కేటాయింపులో బ్రాహ్మ‌ణుల‌కు ప్రాధాన్యత ఇచ్చాయ‌ని తెలిపారు. గుర్తింపు లేని పార్టీలో గుర్తింపు లేని ఎమ్మెల్యే దగ్గర పనిచేశామ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఎమ్మెల్యే బోండా ఉమా, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న త‌మ‌కు ప్రాధాన్యత ఇవ్వటం లేద‌న్నారు. ఈ క్ర‌మంలో విజ‌య‌వాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. పార్టీ స‌భ్య‌త్వానికి రాజీనామా చేసిన‌ప్ప‌టికీ తాను ఎప్ప‌టికీ తెలుగుదేశం పార్టీకి అభిమానిగానే ఉంటాన‌న్నారు.

Just In...