Published On: Sat, Sep 7th, 2019

తెలుగు భాషకు పట్టం కట్టిన జగన్మోహన్ రెడ్డి

* వైయస్ఆర్ తెలుగుకు ప్రాచీన హోదా కల్పిస్తే

* నేడు వైయస్ జగన్ తెలుగు భాషా అధ్యయన కేంద్రాన్ని సాధించాడు

* ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్

సెల్ఐటి న్యూస్, మొగల్రాజపురం: దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి హాయంలో తెలుగు భాషకు ప్రాచీన హోదాను సాధించుకున్నామని, నేడు వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి హాయంలో నెల్లూరులోని ఎన్ సీఈఆర్టీ క్యాంపస్లో ప్రాచీన తెలుగు భాష ప్రాంతీయ అధ్యయన కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ఎంతో గర్వించదగిన విషయమని ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. నగరంలోని ది కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ అండ్ అమరావతిలో శనివారం జరిగిన విలేకరుల సమావేశం జరిగింది. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ దక్షిణ భారత భాషల అధ్యయన కేంద్రాన్ని మైసూర్లో ఏర్పాటు చేసిన తర్వాత రాష్ట్రాలకు చెందిన భాషల అధ్యయన కేంద్రాలను అయా రాష్ట్రాల్లోనే ఏర్పాటు చేసుకున్నారని చెప్పారు. తెలుగు ప్రాచీన హోదా సాధించుకున్నా తెలుగు భాషా అధ్యయన కేంద్రం మాత్రం మైసూరులోనే కొనసాగుతుందని చెప్పారు. ఈ కేంద్రాన్ని తెలుగు నేలపై ఏర్పాటు చేయమని గత ఏనిమిది సంవత్సరాలుగా కోరుతున్నా అప్పటి ప్రభుత్వాల చుట్టు తిరుగుతున్నా స్పందన లేదన్నారు. గత ముఖ్యమంత్రులు కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబునాయుడులు ఈ అధ్యయన కేంద్రాన్ని రాష్ట్రానికి తీసుకురావడంపై ఏమాత్రం శ్రద్ద చూపలేదన్నారు. వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈ కేంద్రాన్ని మన తెలుగు రాష్ట్రానికి తీసుకురావాలని గట్టిగా ప్రయత్నించి విజయం సాధించారన్నారు. అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా తనను నియమించిన మొదటి రోజే ఈ కేంద్రాన్ని నెల్లూరులో ఏర్పాటు చేయాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు లేఖ రాశానని లక్ష్మీప్రసాద్ తెలిపారు. విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం, నెల్లూరుకు సమీపంలోని తిరుపతిలో శ్రీవెంకటేశ్వర, పద్మావతి విద్యాలయాలు, సంస్కృత విద్యాఫీర్, ప్రాచీన గ్రంధాలయాలు నెల్లూరులో ఉన్నాయని అంతేకాకుండా భారతంలో ఎక్కువ భాగం అనువధించిన తిక్కన్న నడయాడిన ప్రాంతం నెల్లూరు కాబట్టి అక్కడ ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయమని ఉపరాష్ట్రపతికి రాసిన లేఖలో తాను కోరానని వివరించారు. గత నెల 28వ తేది నెల్లూరులో ఈ కేంద్రాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలని కేంద్ర మానవ వనరుల శాఖలోని భాషా విభాగం అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని లక్ష్మీప్రసాద్ తెలిపారు. ఇది తెలుగు ప్రజలు ఎంతో గర్వించదగిన విషయమన్నారు. ప్రభుత్వ, ప్రభుత్వేతర, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడిచే విద్యా సంస్థల్లో ఒకటి నుంచి పదో తరగతి వరకు తెలుగు భాషను తప్పని సరి చేసేందుకు తన వంతు కృషి చేస్తానని లక్ష్మీప్రసాద్ చెప్పారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తెలియజేశానని అయన కూడా సానుకూలంగా స్పందించారని లక్ష్మీప్రసాద్ చెప్పారు. ఆంధ్రా ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షుడు గోళ్ళ నారాయణరావు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలలల్లోనే అధికార భాషా సంఘాన్ని నియమించడం, ఆ సంఘాన్ని నియమించిన నెల రోజుల్లోపే తెలుగు భాషా అధ్యయన కేంద్రం తెలుగు రాష్ట్రంలో ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ వెన్నా వల్లభరావు, గుమ్మా సాంబశివరావు పాల్గొన్నారు.

Just In...