Published On: Fri, Apr 12th, 2019

తెలుగు రాష్ట్రాల్లో నెత్తురోడిన రహదారులు

* మూడు వేర్వేరు ప్రమాదాల్లో 12 మంది దుర్మరణం

* ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం.

సెల్ఐటి న్యూస్‌, క్రైం డెస్క్‌: తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మొత్తం 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, కర్నూలు.. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాల్లోని రోడ్లు నెత్తుటి మరకలతో తడిచాయి. ఈ మూడు దుర్ఘటనల్లోనూ వాహన చోదకుల తప్పిదాలే ప్రాణాలు తీశాయి. మూడు ప్రమాదాల్లో మరో పది మందికి పైగా గాయపడ్డారు. అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తనకల్లు, నల్లచెర్వు మండలాల సమీపంలోని 42వ నెంబరు జాతీయ రహదారిపై మినీ బస్సు, లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. మరో 9మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. క్షతగాత్రులను సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. కుక్కంటి క్రాస్‌ నుంచి ప్రయాణికులతో కదిరికి వెళ్తున్న మినీ బస్సు తనకల్లు మండలం పరాకువాండ్లపల్లి క్రాస్‌ వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది. బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం సంభవించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రస్తుతం బస్సు డ్రైవర్‌ పరారీలో ఉన్నాడు. మృతుల్లో చాలా వరకు తనకల్లు మండలానికి చెందిన వారుగా గుర్తించారు. విషయం తెలుసుకున్న తనకల్లు ఎస్సై సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మ‌రోవైపున అనంతపురం జిల్లా తనకల్లు మండలంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్య‌క్తం చేశారు. ప్రమాదంలో గాయపడిన వారికి అవసరమైన వైద్య సహాయం అందించాలని అధికారులకు సూచించారు. 42వ నెంబర్ జాతీయ రహదారిపై లారీనీ మినీ బస్సు ఢీకొని ప్రమాదం జరిగిందని, ఈ ఘటనలో  ఏడుగురు మృతి చెందారని అధికారులు ఈ సంద‌ర్భంగా ముఖ్యమంత్రికి వివరించారు. మృతుల కుటుంబాల‌కు సీఎం చంద్ర‌బాబు త‌మ సంతాపాన్ని వెలిబుచ్చారు.

Just In...