Published On: Sat, Sep 9th, 2017

తెలుగు విద్యార్థులపై దాడులు సహించేది లేదు

* క‌ర్ణాట‌క సీఎస్‌తో మాట్లాడాల‌ని సీఎంవో అధికారుల‌కు సీఎం చంద్రబాబు ఆదేశం

సెల్ఐటి న్యూస్‌, అమరావతి : కర్ణాటకలో తెలుగు విద్యార్థులను పరీక్షలు రాయకుండా కన్నడ సంఘాల ప్రతినిధులు అడ్డుకుంటున్న ఘటనను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్‌గా తీసుకున్నారు. తెలుగు విద్యార్థులపై దాడులు చేస్తే సహించేది లేదని ఈ సంద‌ర్భంగా సీఎం చంద్ర‌బాబు హెచ్చరించారు. ఈ ఘటనపై కేంద్రంతో మాట్లాడతానని మంత్రులకు సీఎం చెప్పారు. అవసరమైతే కర్ణాటక ముఖ్యమంత్రితోనూ చర్చిస్తానని తెలిపారు. ఈ ఘటనపై వెంటనే కర్ణాటక సీఎస్‌తో మాట్లాడాలని సీఎంవో అధికారులను ఆదేశించారు. దీంతో ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీశ్‌చంద్ర కర్ణాటక సీఎస్‌తో మాట్లాడారు. ఆది, సోమ‌వారాల్లో జరిగే పరీక్షల్లో తెలుగు విద్యార్థులకు రక్షణ కల్పించాలని కోరారు. అమ‌రావ‌తిలోని రాజ‌ధాని స‌చివాల‌యంలో సీఎం అధ్యక్షతన కొనసాగుతున్న తెదేపా సమన్వయ కమిటీ సమావేశంలో కర్ణాటక ఘటనను మంత్రులు సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. కర్ణాటక రాష్ట్రంలోని హుబ్లీలో బ్యాంకింగ్‌ పరీక్షలు రాసేందుకు వెళ్లిన తెలుగు విద్యార్థులను అక్కడి కన్నడ సంఘాల నేతలు అడ్డుకున్నారు. విద్యార్థులను పరీక్షా హాల్‌ వద్ద అడ్డుకొని హాల్‌ టికెట్లు చించివేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు రంగప్రవేశం చేసి కన్నడ సంఘాల నేతలను అడ్డుకున్నారు.

Just In...