Published On: Mon, Jul 6th, 2020

తొలిసారి రైలు మార్గంలో ఇనుప ఖనిజం రవాణా

* వెల్దుర్తి నుండి సేలంలోని మెసర్స్ జెయస్‌డ‌బ్ల్యు స్టీల్ సైడింగ్‌కి సరఫరా

* కొత్త ప‌థ‌కాలు, రాయితీల‌పై మ‌రింత ప్ర‌చారం చేయాల‌ని సూచించిన ద‌.మ‌. రైల్వే జీఎం గ‌జాన‌న్ మాల్య

విజ‌య‌వాడ‌, సెల్ఐటి న్యూస్‌: హైద‌రాబాద్ డివిజన్ కర్నూలు జిల్లా వెల్దుర్తి రైల్వేస్టేషన్ నుండి మొదటిసారి తమిళనాడులోని సేలం జెఎస్‌డ‌బ్ల‌యు స్టీల్ సైడింగ్‌కి ముడి ఇనుప ఖనిజం సోమ‌వారం నుండి రైల్వే శాఖ రవాణాను ప్రారంభించింది. మొత్తం 45 బాక్స్ ఎన్ వ్యాగన్లలో సుమారు 2979 టన్నుల ఇనుప ఖనిజం లోడ్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలోని వెల్దుర్తి చుట్టూ ప్రక్కల ఇనుప ఖనిజం గనులు ఉండడంతో హైద్రాబాద్ డివిజన్ రైలు మార్గాల ద్వారా రవాణాకు అనుకూలంగా ఉంది. సాధారణంగా తక్కువ స్థాయి రకమైన ఈ ఇనుప ఖనిజం కర్నూలు జిల్లా సమీపంలోని ఉక్కు పరిశ్రమలకు ఇంతకు పూర్వం రోడ్డు మార్గం ద్వారా రవాణా చేయడం జరిగేది. హైద్రాబాద్ డివిజన్ అధికారుల వాణిజ్యపరమైన ప్రయత్నాల వల్ల, ప్రస్తుతం ఇనుపఖనిజాన్ని రైలు ద్వారా రవాణా చేసే అవకాశాన్ని వినియోగించుకుని మొదటిసారిగా సరికొత్త గమ్యస్థానం తమిళనాడులో ఉన్న సేలం జేయు స్టీల్ సైడింగ్‌కి రవాణా చేయడం జరిగింది. ఈ కొత్త గమ్యస్థానం వెల్దుర్తి నుండి సుమారు 624 కి.మీ. దూరంలో ఉంది. రైల్వే ఇచ్చిన ప్రోత్సాహాన్ని ఉపయోగించుకుని వెల్దుర్తి ప్రాంతంలోని ఇనుప ఖనిజం రవాణా సంస్థలు రైలు ద్వారా ఉత్తర, దక్షిణ ప్రాంతాలకు రవాణా చేయడానికి ఆసక్తి చూపారు. ఇతర రవాణా వ్యవస్థలతో పోలిస్తే ఐరన్ ఓర్ ఫైన్స్ మరియు సంబంధిత ఇతర ఖనిజ ఉత్పత్తులు రైలు ద్వారా రవాణా చేయడం చౌక అని వినియోగదారులు ముందుకు వస్తున్నారు. అంతేకాక, రైలు ద్వారా సరుకు రవాణా అత్యంత వేగం మరియు ఎంతో భద్రత కూడా. ప్రస్తుతం దేశంలో నెలకొన్న ఈ క్లిష్టమైన పరిస్థితుల్లో రైల్వే ద్వారా సరుకు రవాణా చేయడం చాలా ఉత్తమమైన మార్గం. దక్షిణ మధ్య రైల్వేలో సరుకు రవాణా పెంపొందించే దిశలో భాగంగా సరికొత్త రవాణా అవకాశాలను మరియు కొత్త గమ్యస్థానాలకు సరుకు రవాణా చేస్తున్న హైద్రాబాద్ డివిజన్ అధికారులు మరియు సిబ్బంది కృషిని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య అభినందించారు. ఇటీవల రైల్వే అమలు చేస్తున్న కొత్త పథకాలు మరియు రాయితీల గురించిన సమాచారం వినియోగదారులకు అందజేయాలని అధికారులకు మరియు సిబ్బందికి సూచించారు. రైలు ద్వారా ఇనుప ఖనిజం రవాణాకు శ్రద్ధ చూపిన వినియోగదారులకు రైల్వే సంపూర్ణంగా తన మద్దతు మరియు ప్రోత్సాహం అందిస్తుందని ఆయన పేర్కొన్నారు.

Just In...