Published On: Fri, May 18th, 2018

త్వరలో చేనేత కార్మికుల‌కు ప్ర‌త్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు

* మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి ప్ర‌క‌ట‌న‌ 
సెల్ఐటి న్యూస్‌, నెల్లూరు: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో చేనేత కార్మికులకు త్వరలో ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ప్రకటించారు. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో గురువారం జరిగిన మినీమహానాడు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి మాట్లాడుతూ.. సీజేఎఫ్‌ఎస్‌ లబ్ధిదారులకు భూహక్కులు కల్పిస్తూ పట్టాలను అందజేస్తామన్నారు. వారికి వ్యవసాయ రుణాల అర్హత కల్పిస్తామని చెప్పారు. దీని ద్వారా రాష్ట్రంలో 65వేల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందన్నారు. సోమశిల స్వర్ణముఖి కాలువ పనులు పూర్తి చేస్తామన్నారు. డక్కిలి మండలం ఆల్కూరుపాడులో రూ. 350కోట్లతో ఆనకట్ట నిర్మాణానికి టెండర్లు పిలువనున్నట్లు తెలిపారు. ఎస్‌ఎస్‌ కాలువ ద్వారా నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని 270 చెరువులకు నీళ్లు అందిస్తామని చెప్పారు. జూన్‌ 2లోపు పెండింగ్‌లో ఉన్న 3లక్షల మంది దరఖాస్తుదారులకు పింఛన్లు, లక్షన్నరమందికి కొత్త రేషన్‌ కార్డులను మంజూరు చేయనున్నట్లు వెల్ల‌డించారు.

Just In...