Published On: Fri, Sep 13th, 2019

త్వరలో రాష్ట్రానికి ప్రత్యేక వాతావరణ విధానం

* రైతులు నష్టపోకుండా విధాన రూపకల్పన

* బీమా సంస్థలు రైతులకు బీమా చెల్లించ నిరాకరించే వీలు లేకుండా పటిష్టమైన విధానం

* ఆర్టీజీఎస్ వద్ద అపారమైన వాతావరణ డాటా

* రైతు ప్రయోజనాలకు వాడుకునే దిశగా చర్యలు

* వాతావరణ విధాన రూపకల్పనపై వివిధ శాఖలతో సమావేశం

* వ్యవసాయ విద్యార్థులకు పాఠ్యాంశంగా ఆర్టీజీఎస్ వాతావరణ డాటా

సెల్ఐటి న్యూస్‌, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ప్రత్యేక వాతావరణం విధాన రూపకల్పన దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రకృతి వైపరీత్యాలు, విపత్తులు వాటిల్లినప్పుడు రైతులు ఏ మాత్రం నష్టపోకుండా ఉండేలా, బీమా సంస్థలు రైతులకు పంటల బీమా చెల్లించ నిరాకరించడానికి వీలు లేకుండా ఉండేలా ఈ వాతావరణ విధానం ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి పర్యవేక్షణలో అధికారులు  ఈ దిశగా కసరత్తులు మొదలు పెట్టారు. రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాల కారణంగా పలు సందర్భాల్లో రైతులు పంటలను నష్టపోతున్నారు. సమయంలో నష్టం అంచనా విషయంలో రాష్ట్రానికి, కేంద్ర ప్రభుత్వం వేసే అంచనాలకు  వ్యత్యాసాలుండటం కారణంగా మన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. భారత వాతావరణ శాఖ ఇస్తున్న అంచనాలను మాత్రమే బీమా సంస్థలు పరిగణనలోకి తీసుకోవడం మరో కారణం. పలు సందర్బాల్లో  ఈ అంచనాలు వాస్తవానికి దగ్గరగా లేకపోవడంతో బీమా సంస్థలు రైతులకు పంట నష్టం బీమా చెల్లించడానికి నిరాకరిస్తున్నాయి. ఫలితంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. బీమా కంపెనీల వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వీటిని సానుకూలంగా పరిష్కరించి రైతులు నష్టపోకుండా వారికి తక్షణం పంట నష్టం బీమ చెల్లింపు జరిగేలా చూడాలని ఇందుకోసం అవసరమైతే ఒక సమగ్ర వాతావరణ విధానం రూపొందించాలని ముఖ్యమంత్రి జగన్  మోహన్ రెడ్డి అధికారులకు సూచించడంతో ప్రభుత్వ ఆ దిశగా కసరత్తులు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో వాతావరణ అంచనాలు, డాటాకు సంబంధించి రైతులకు మరింత ఉపయోగకరంగా ఉండేలా ఎలా ముందుకెళ్లాలనే అంశంపై శుక్రవారం శుక్రవారంరియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) స్టేట్ కమాండ్ కేంద్రంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో ఒక సమావేశం జరిగింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుని రెండు సంవత్సరాలు గడిచింది. వాతావరణానికి సంబంధించి ఇస్రో సహకారంతో రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీకి చెందిన ఆంధ్రప్రదేశ్ వెథర్ ఫోర్ కాస్టింగ్ అండ్ ఎర్లీ వార్నింగ్ రిసెర్చ్ సెంటర్ (అవేర్) విభాగం వాతావరణానికి సంబంధించి కచ్చితమైన అంచనాలు, డాటాను అందజేస్తోంది. గత రెండేళ్ల అనుభవాలను ద్రష్టిలో ఉంచుకుని  వాతావరణానికి సంబంధించిన డాటాను మరింత సమర్థమంతంగా ఎలా ఉపయోగించుకోవాలనే దిశగా సమావేశంలో అధికారులు చర్చలు జరిపారు.ఇస్రో వాతావరణ శాస్త్రవేత్త, శ్రీహరికోట అంతరిక్ష పరిశోధన కేంద్రం మేనేజర్  డాక్టర్ రాజశేఖర్, ఇస్రో అందిస్తున్న వాతావరణ అంచనాలు, గణాంకాల మాడ్యూల్స్ గురించి వివరించారు.  వాతావరణానికి సంబంధించి నెల రోజుల ముందే కచ్చితమైన అంచనాలను తాము అందిస్తున్నామని తెలిపారు. నదీపరివాహక ప్రాంతాలు, కరవు ప్రాంతాలు, మేఘాల లభ్యత, వర్షం రాక, పిడుగులు, వడగళ్ల వర్షాల గురించి కచ్చితమైన అంచనాలను ఎంతో ముందుగా అందిస్తున్నామని దాన్ని సమర్థంగా  ప్రభుత్వ శాఖలు ఉపయోగించుకుంటే రైతులకు మరింత మేలు జరుగుతుందని తెలిపారు. ఆయా ప్రభుత్వ శాఖలు అవసరాలకు తగ్గట్లుగా తాము వాతావరణ డాటాను అందజేయడానికి ప్రయత్నిస్తామన్నారు.  రాష్ట్ర ప్రభుత్వం రూపొందించే వాతావరణ విధానానికి కావాల్సిన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.  ఉద్యానవన శాఖ సహాయ సంచాలకులు  రత్నాచార్యులు మాట్లాడుతూ, రాష్ట్రంలో పంటల బీమా చెల్లించకుండా వాతావరణాన్ని సాకుగా చూపి బీమా సంస్థలు రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయన్నారు.  రాష్ట్ర ప్రభుత్వానికి  చెందిన రియల్ టైమ్ గవర్నెన్స్ వద్ద వాతావరణాకి సంబంధించి ఎంతో కచ్చితమైన డాటా, అంచనాలు అందుబాటులో ఉన్నా కూడా రైతులకు బీమా చెల్లించడానికి  ఈ డాటాను పరిగణనలోకి తీసుకోవడం లేదని  తెలిపారు.  ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రతినిధులు మాట్లాడుతూ,స్వతాహాగా మన రాష్ట్ర రైతులు వ్యవసాయం చేయడంలో తెలివైన వారైనప్పటికీ వాతావరణ పరిస్థితులను అంచనా వేయడంలో లేదా ఆ సమాచారం అందిపుచ్చుకోవడంలో వెనుకబడుతున్నారని ఇందుకోసం ఒక ప్రత్యేకమైన వాతావరణ విధానం రూపకల్పన చేస్తే అది  వారికి ప్రయోజనకరంగా ఉంటుందని అన్నారు. ఆ విధానానికి చట్టబద్ధత తీసుకొచ్చి దానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం లభించేలా చేసుకుంటే రాష్ట్ర ప్రజలకు,  ముఖ్యంగా రైతులకు మరింత మేలు చేస్తుందన్నారు.  రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ ముఖ్య నిర్వహణాధికారి ఎన్.బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ వాతావరణ విధానం ఎలా ఉండాలి, తదితర అంశాలకు సంబంధించి వివిధ విభాగాల అధికారులు, నిపుణులు చెప్పిన అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని తెలిపారు. ఇస్రో సహకారంతో మన వద్ద వాతావరణానకి సంబంధదించి అపారమైన డాటా సొంతమైందని, దాన్ని మరింత సమర్థవంతంగా ఎలా ఉపయోగించుకోవాలనే దిశగా  ఆయా శాఖలు దృష్టి సారించాలని కోరారు.  రైతులకు మేలు చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని ప్రభుత్వం ఆశయాలకు అనుగుణంగా  వాతవారణ డాటను ప్రజోపయోగంగా ఉండేలా సంబంధిత శాఖలన్నిటికీ ఆర్టీజీఎస్ సహకారం అందిస్తుందన్నారు. మరే ఇతర రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్ 2400
ఆటోమేటిక్ వెథర్ స్టేషన్లు ఉన్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమేనన్నారు.
ఆర్టీజీలోని అవేర్ ద్వారా వాతావరణానికి సంబంధించి ప్రతి గంట, వారం, నెల, మూడు నెలలకు కావాల్సిన డేటా తీసుకోవచ్చు. వాతావరణంలో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి, ఎప్పుడు, ఎంత శాతం వర్షపాతం నమోదు కాబోతోంది, వరదలు ఎప్పుడు వచ్చే అవకాశాలున్నాయి, ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు ఎంత ఉండే అవకాశం ఉంది వంటి అంశాలు తీసుకోవడం ద్వారా రైతుల ప్రయోజనాల కోసం ఏం చేయవచ్చన్న అంశాలపై అధికారులమంతా చర్చించి ఆయా శాఖలు ప్రణాళికాయుతంగా పనిచేస్తే రైతులకు, సామాన్యులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఒక్క రైతుల కోసమే కాకాండా.. వర్షాల కారణంగా శానిటేషన్ పరిస్థితి ఏంటి, అంటు వ్యాధుల ప్రభావం, రోగాల వ్యాప్తి వంటివి అరికట్టే ప్రయత్నాలు చేయడానికి ఏమేం చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది దానిపైనా కూడా వాతావరణ అంచనాలను బట్టి చర్యలు తీసుకోవచ్చు అన్నారు.  వాతావరణం ఎప్పుడు, ఎక్కడ పొడిగా ఉండబోతోంది.. ఎండలు ఎక్కడ, ఎప్పుడు తీవ్ర ప్రభావం చూపించబోతున్నాయి అనేది అవేర్ ఇచ్చే వాతావరణ అంచనాల వల్ల ముందగానే తెలిసిపోతుందని దాని ఆధారంగా తగు చర్యలు తీసుకోవడానికి వీలవుతుందని తెలిపారు.  మనం రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉందో కూడా ఆర్టీజీఎస్ కు చెందిన అవేర్ విభాగం ముందుగానే అంచనా వేసి చెప్పగలదని,  పలు రాష్ట్రాల్లో వర్షాభావ పరిస్థితులుంటాయని, దానివల్ల అక్కడ వ్యవసాయం తగ్గుముఖం పడుతుంది, అలాంటప్పుడు మనం వారి అవసరాలకు అనుగుణంగా ఇక్కడ మన నీటి లభ్యతను బట్టి రైతులు పండించిన పంటలను ఆయా రాష్ట్రాలకు ఎగుమతి చేసి రైతులకు అధిక లాభాలు వచ్చేలా చూడొచ్చని సమావేశం అభిప్రాయపడింది.

పాఠ్యాంశాలుగా ఆర్టీజీఎస్ వాతావరణ అంచనాలు…
రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ ఇస్తున్న వాతావరణ అంచనాలు బేషుగ్గా ఉన్నాయని ఆచార్య ఎన్టీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రతినిధులు ప్రశంసించారు. బాపట్ల వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ రామక్రిష్ణమూర్తి, అసోసియేట్ డీన్ డి.లోకనాథరెడ్డిలు మాట్లాడుతూ ఆర్టీజీఎస్ అవేర్ విభాగం వద్ద అందిస్తున్న వాతావరణ అంచనాలు, డాటా అద్భుతంగా ఉందని, వాస్తవికతకు ఎంతో దగ్గరగా ఉన్నాయన్నారు. వీటిని తాము వ్యవసాయ వర్సిటీలో విద్యార్థులకు ఒక పాఠ్యాంశంగా పెడతామన్నారు. వీటిని విశ్వవిద్యాలయంలో పరిశోధనలకు కూడా ఒక సాధన కారకంగా మర్చే ప్రయత్నం చేస్తామన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రాజెక్టు మేనేజర్ హరికిరణ్, జలవనరుల శాఖ అదనపు కార్యదర్శి ఎంవీఎల్ కాళీకుమార్, ఏపీజెన్ కో డైరెక్టర్ జేసీఎస్ రాజు, వ్యవసాయ శాఖ డిప్యూటీ డైరెక్టర్ మాధవీలత తదితరులు పాల్గొన్నారు.

Just In...